సర్దుబాటు గందరగోళం | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటు గందరగోళం

Jul 16 2025 3:37 AM | Updated on Jul 16 2025 3:37 AM

సర్దుబాటు గందరగోళం

సర్దుబాటు గందరగోళం

● ఇష్టారీతిన టీచర్ల కేటాయింపు ● జిల్లాలో 142 మందికి సర్దుబాటు ● ఎంఈవోలు, ఉద్యోగుల తీరుపై విమర్శలు ● మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయుల సర్దుబాటు గందరగోళంగా మారింది. సర్కారు బడుల్లో టీచర్ల కొరత అధిగమించేందుకు ఏటా విద్యాశాఖ ఏటా ఈ ప్రక్రియ చేపడుతోంది. గతంలో మాదిరిగా ఈ సారి కూడా తప్పిదాలు పునరావృతం అయినట్లు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల తీరుతో టీచర్లతో పాటు విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. జూనియర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా, సీనియర్లను ఆయా పాఠశాలలకు కేటాయించడం, మండల పరిధిలో కాకుండా ఇతర మండలాలకు కేటాయించడం, ఉర్దూ మీడియం పాఠశాలలకు తెలుగు మీడియం టీచర్లను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సంఘాల నాయకులు పలువురు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. పొరపాట్లు సవరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.

జిల్లాలో..

జిల్లాలో డీఈవో పరిధిలో 500 ప్రాథమిక, 119 ప్రా థమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు. మొత్తం 3,067 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 2,654 మంది పని చేస్తున్నారు. 413 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ల నుంచి అవసరమున్న చోటుకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కొంతమంది మండల విద్యాధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారితో మచ్చిక ఉన్నవారికి దగ్గరలో గానీ, అదే పాఠశాలలో కొనసాగించడం, తదితరవి చేసినట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

142 మంది సర్దుబాటు..

సర్దుబాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలో 142 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు చేశారు. ఇందుకు సంబంధించి డీఈవో ఉత్తర్వులుజారీ చేశారు. వీ రి లో 96 మంది ఎస్జీటీలు, 46 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ ప్రక్రియతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ప్రయోజనం చేకూరనుంది.

తప్పిదాలు ఇవే..

● జెడ్పీఎస్‌ఎస్‌ లాండసాంగ్విలో ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందకముందే ఆ పాఠశాలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి అక్కడికి కేటాయించారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఇద్దరు సైన్స్‌ ఉపాధ్యాయులు పనిచేయాల్సిన పరిస్థితి. బోథ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయుడు అవసరం ఉండగా అక్కడ పోస్టు కేటాయించలేదు.

● మావల మండలంలోని భట్టిసావర్గాం పాఠశాలలో జూనియర్‌ ఉపాధ్యాయుడిని అక్కడే కొనసాగించి సీనియర్‌ను సర్దుబాటు చేశారు. ఆయన వైకల్యం ఉన్నప్పటికీ అక్కడి నుంచి వేరే పాఠశాలకు కేటాయించారు.

● ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని లాండసాంగ్వి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయుడిని జైనథ్‌ మండలంలోని ఆకుర్లకు కేటాయించగా, జూనియర్‌ను ఆదిలాబాద్‌లోని రాంపూర్‌కు కేటాయించారు.

● ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 15 మంది ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి సర్దుబాటు చేశారు.

● ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని భీంసరిలో పనిచేస్తున్న వైకల్యం గల టీచర్‌ను జైనథ్‌ మండలానికి సర్దుబాటు చేశారు. ప్రత్యేక కేటగిరీని కూడా పరిశీలించలేదు.

● బరంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని భీంపూర్‌ మండలంలోని రాజులవాడికి కేటాయించారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడు తన కూతురును అదే పాఠశాలలో చేర్పించారు.

● భీంపూర్‌ మండలంలోని వడూర్‌ యూపీఎస్‌లో పనిచేస్తున్న ఎస్జీటీని మరో పాఠశాలకు సర్దుబాటు చేయాల్సి ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ బోధించేందుకు అదే పాఠశాలలో సర్దుబాటు చేశారు.

● బేలతో పాటు పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం బోధించే ఎస్జీటీలతో సర్దుబాటు చేశారు. ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు.

● సిరికొండ, గాదిగూడ మండలాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ రెండు మండలాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కూడా సర్దుబాటు చేయకపోవడం గమనార్హం.

అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాం

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలలకు అవసరానికి మించి ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను కేటాయించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏవైనా తప్పిదాలు ఉంటే సవరిస్తాం. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపడతాం.

– శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement