
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
● ఆటవిడుపుగా ఆదిలాబాద్ డీఏవో పోస్టు ● జిల్లాలో పనిచేసేందుకు అధికారుల అయిష్టత ● బదిలీపై వచ్చిన ఆఫీసర్ నామమాత్రంగా చేరిక ● అదే రోజు నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌పై.. ● మళ్లీ ఇన్‌చార్జి పాలనే..
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీపై వచ్చిన మేకల గోవింద్ మంగళవారం ఉదయం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.. తర్వాత కొంత మంది వ్యవసాయ అధికారులు వచ్చి ఆయనను కలిశారు. పిమ్మటే ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయి నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌స్వామి మళ్లీ తన పోస్టులో యథావిధిగా ఒదిగిపోయారు. వ్యవసాయ శాఖలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒకేరోజులో జరిగిపోయింది.
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో ప్రస్తుతం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ రైతు కమిషన్‌లో జేడీఏగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోవింద్‌ను ప్రభుత్వం ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో జేడీఏ పోస్టు ఖాళీగా ఉండగా, డిప్యూటేషన్‌పై అక్కడికి వెళ్లిపోయారు. అయితే ఆదిలాబాద్‌లో పనిచేసేందుకు అయిష్టత కారణంగా అనువైన జిల్లాకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చారని వ్యవసాయ శాఖలో చర్చించుకుంటున్నారు.
అంతా ప్రణాళిక..
రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లోనే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (జేడీఏ) పోస్టులు ఉన్నాయి. రైతు కమిషన్‌లో జేడీఏ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోవింద్ బదిలీ తప్ప ని పరిస్థితుల్లో ఆదిలాబాద్‌కు అదే హోదాలో వచ్చారు. అ యితే ఇక్కడి నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు ముందే ఆయన వ్యూహరచన చేసుకున్నారనే ప్రచారం ఉంది. ప్ర భుత్వం నుంచి బదిలీల ప్రక్రి య చోటుచేసుకోగా, అక్కడినుంచి ఆయనను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. నిజామాబాద్‌లో ఏడీఏ వీరస్వామి ఇన్‌చార్జి డీఏవో గా వ్యవహరిస్తున్నారు. జేడీఏ హోదా ఉన్న స్థానాని కే అధికారి గోవింద్ వెళ్లాల్సి ఉంటుంది. ఇదివరకు నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఈ ఆఫీసర్‌కు ఉంది. అక్కడ కూడా జేడీఏ హోదా కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన ఆదిలాబాద్‌లో ఇలా బాధ్యతలు తీసుకొని.. ఆ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూడా అదే రోజు బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. అయితేఈ విషయాలను ఆశాఖ అధికా రులు ఎవరు కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ‘సాక్షి’కి ఈ సమాచారం అందడంతో అటు నిజామాబాద్.. ఇటు ఆదిలాబాద్‌లో వివరా లు సేకరించడంతో ఈ రెండు జిల్లాల్లో మంగళవారం జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడికి వచ్చే అధికారుల తంతే అంతా..
జిల్లాలో జేడీఏ పోస్టు ఓ ఆటవిడుపుగా మారిపోయింది. బదిలీలు, పదోన్నతులు వంటి ప్రక్రియలు చోటుచేసుకున్నప్పుడు తప్పని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి ఏదో నామమాత్రంగా బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడం తంతుగా మారిపోయింది. గతంలో ఊషాదయాల్‌ను ఇక్కడ నియమించగా ఆమె ఇక్కడి నుంచి డిప్యూటేషన్‌పై రంగారెడ్డి కమిషనర్ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏడీఏ స్థాయి అధికారులు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. తాజాగా అదే పరిస్థితి. ఈ అధికారి కంటే ముందు కూడా మరో ఇద్దరు అధికారులను ఈ పోస్టులో నియమించగా వారు కూడా ఇక్కడ పనిచేసేందుకు అనాసక్తి కనబర్చుతూ డిప్యూటేషన్లపై వెళ్లిపోయారు. రెగ్యులర్ అధికారులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం, ఇక్కడ ఇన్‌చార్జి అధికారులే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఓ ఫార్స్‌గా మారిపోయింది. బదిలీలు, పదోన్నతుల విషయమై ప్రస్తుతం ఇన్‌చార్జి జిల్లా అధికారిగా ఉన్న శ్రీధర్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన ప్రస్తుతం అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు.

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!