
అంతా.. మా ఇష్టం!
● జిల్లాలో విద్యాశాఖ తీరిది ● కేజీబీవీ సీఆర్టీ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం ● 7వ ర్యాంకర్‌కు బదులు తదుపరి అభ్యర్థికి పోస్టింగ్ ● ఆరు నెలల తర్వాత వెలుగులోకి..
ఆదిలాబాద్‌టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా జిల్లా విద్యాశాఖ తీరు మాత్రం మారడం లేదు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకున్న వారికి కాకుండా అనర్హులకు పోస్టింగ్ ఇస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు డీఎస్సీ ప్రక్రియలో పలు తప్పిదాలు చేసిన అధికారులు మళ్లీ పునరావృతం చేశారు. కేజీబీవీలో సీఆర్టీ పోస్టుకు సంబంధించి ఈ తతంగం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆరు నెలల క్రితం కేజీబీవీ ఉద్యోగాల ప్రక్రియలో అర్హులైన అభ్యర్థికి కాకుండా ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన వారికి పోస్టింగ్ కల్పించారు. ఇటీవల కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో సదరు అభ్యర్థి విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి వెకెన్సీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ రోస్టర్‌లో ఇదివరకే పోస్టు భర్తీ అయ్యిందని, ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా లేదనడంతో ఆమె అవాక్కయ్యారు. తనకు దక్కాల్సిన పోస్టు మరో అభ్యర్థికి ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలిస్తామంటూ దాటవేశారు. దీంతో ఆమె విద్యాశాఖ కార్యాలయంలోని ఇన్‌వార్డులో ఫిర్యాదు చేశారు. తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం బయటకు వచ్చింది.
అసలేం జరిగిందంటే..
గత డిసెంబర్‌లో కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియారిటీ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. 1:2 ప్రకారం వెరిఫికేషన్ జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫిజికల్ సైన్స్‌లో రోస్టర్ నం.8కి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. 2023 జూన్ 16న రాత పరీక్షలో అర్హత సాధించి మెరిట్, రోస్టర్ ప్రకారం పోస్టు భర్తీ చేయాలి. అయితే ఫిజికల్ సైన్స్‌లో 7వ ర్యాంక్ అభ్యర్థి జాదవ్ జ్యోతికి బదులు ఆ తర్వాత ర్యాంక్ ఉన్న అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థికి ఈ విషయం తెలియదు. ఇటీవల మళ్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో డీఈవో కార్యాలయానికి వెళ్లి పోస్టుల గురించి ఆరా తీయగా ఇదివరకే ఆ పోస్టు భర్తీ అయ్యిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. తనకు దక్కాల్సిన పోస్టును మరొకరికి ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అధికారుల తీరుపై కలెక్టర్ ఫైర్..
ఒకరికి బదులు మరొకరికి పోస్టింగ్ ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులను పిలిచి కలెక్టర్ రాజర్షిషా ఫైర్ అయ్యారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే 8వ ర్యాంక్ అభ్యర్థిని తొలగించి 7వ ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అభ్యర్థి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. ఇదిలా ఉండగా ఈ తప్పిదం కావాలనే చేశారా.. లేక పొరపాటు జరిగిందా అనేది తెలియడం లేదు. సెక్షన్ క్లర్క్, సూపరింటెండెంట్, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి, విద్యాశాఖ ఏడీ, డీఈవో, ఆ తర్వాత వెరిఫికేషన్ కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఇంతమందిలో నుంచి ఏఒక్కరు కూడా విషయాన్ని పసిగట్టకపోవడంపై ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పొరపాటు జరిగింది..
గత డిసెంబర్‌లో జరిగిన కేజీబీవీ సీఆర్టీ ప్రక్రియలో పొరపాటుతో వేరే అభ్యర్థికి పోస్టింగ్ కల్పించడం జరిగింది. రోస్టర్ నం.8 ఉండడంతో ర్యాంక్ అదే అనుకొని పోస్టింగ్ ఇచ్చాం. ఇటీవల సదరు అభ్యర్థి మా దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తప్పిదాన్ని సవరించి ఏడో ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ కల్పిస్తాం.
– ఉదయశ్రీ, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి