
అభివృద్ధి పనులు ఇలా..
సాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదా యం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్‌తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవా రం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది.
కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు..
రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హక్కు ను కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నల్లమల డిక్లరేషన్ ప్రకటించింది. గిరిజనుల సంక్షేమం కోసం పలు అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన పోడు భూములకు ఈ పథకంతో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
లబ్ధి ఇలా..
పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్‌తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిరా సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు.
శాఖల సమన్వయం..
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఇందులో అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. తద్వారా వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు.
పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ‘ఇందిరా సౌర జల వికాసం’తో ముందడుగు ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ఏర్పాట్లపై ఐటీడీఏ దృష్టి
ఉమ్మడి జిల్లాలో గిరి తెగల జనాభా..
(2011 జనాభా లెక్కల ప్రకారం)
గోండు 2,63,515
లంబాడా 1,12,793
కొలాం 38,176
కోయ, ఇతరులు 30,739
పర్దాన్ 26,029
మన్నెవార్ 15,370
నాయక్‌పోడ్ 5,206
తోటి 2,231
ఎరుకల 1,735
మొత్తం జనాభా 4,95,794
పోడు భూముల వివరాలు..
విస్తీర్ణం 2,12,256
ఎకరాలు
రైతుల సంఖ్య 66,839
పట్టాల జారీ సంఖ్య 66,839
ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్వకం చేపట్టనున్నారు.
5 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు.
వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు.
ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు.
అర్హులు వీరు..
అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్నర ఎకరాలు(హెక్టా రు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూని ట్‌గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్‌గా ఏర్పాటు చేసి యూనిట్‌గా మంజూరు చేయనున్నారు. ఒకవేళ సరిహద్దులో అటువంటి రైతుల భూములు లేనిపక్షంలో ఆ రైతుకు వ్యక్తిగతంగా యూనిట్ మంజూ రు చేసేలా ఇందులో ప్రణాళిక చేశారు.
డిప్యూటీ సీఎం రానున్నారు..
ఇందిరా సౌర జల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది.
– ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏ

అభివృద్ధి పనులు ఇలా..

అభివృద్ధి పనులు ఇలా..