
ఆంధ్ర, మహారాష్ట్ర టు ఆదిలాబాద్
ఇచ్చోడ: జిల్లాలో జొన్నల దందా జోరుగా సాగుతుంది. కొంతమంది వ్యాపారులు ముఠాగా ఏర్పడి బినామీ రైతుల పేరిట జొన్నలు విక్రయిస్తూ స్వల్ప వ్యవధిలో భారీగా ఆర్జిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట జొన్నలతో వాహనాలు పట్టుబడిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. అయినా యంత్రాంగం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఆన్‌లైన్ నమోదు నుంచే..
రబీలో ఆయా పంటలు సాగు చేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈవోలు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగానే పంట దిగుబడిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా నేరుగా రైతు మాత్రమే తన పంట దిగుబడిని విక్రయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు పంట సాగు చేయకుండానే చేసినట్లుగా సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇచ్చోడ మండలంలో ఈ ఏడాది రబీలో 5,815 ఎకరాల్లో జొన్న సాగైనట్లు ఆన్‌లైన్‌లో నమోదై ఉంది. అయితే మండలంలో మెజార్టీ గ్రామాల్లో సాగునీటి సౌకర్యం లేదు. జొన్న సాగు అంతంతే ఉంది. అయితే ఆన్‌లైన్ నమోదులో ఉన్న దాంట్లో సగం కూడా సాగు కాలేదని తెలుస్తోంది. జిల్లాలో చాలా మండలాల్లో ఇదే పరిస్థితి.
సాంకేతికత అడ్డు పెట్టుకుని..
సాంకేతికత అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యాపారులు జొన్నలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపికచేసుకున్న రైతులనువారి ఆధార్‌కార్డు, పట్టాపాస్‌బుక్ ద్వారా కొనుగోలు కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ ఆన్‌లైన్ ఆధారంగా విక్రయింపజేస్తా రు. తర్వాత ఆ రైతు విక్రయించిన వివరాలు సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్ వద్ద ఎక్కడా కనిపించడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమకు సహకరించిన రైతులకు కొంత ముట్టజెబు తూ, అధికారులతో ‘మామూలు’గా వ్యవహరిస్తూ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌లో పంట నమోదై ఉన్న రైతులనుంచి మాత్రమే జొన్నలు కొనుగోలు చేస్తున్నామని, బినామీలను నిర్ధారించలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
జిల్లాలో జోరుగా జొన్నల దందా ప్రైవేట్ వ్యాపారులదే హవా అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ‘మద్దతు’తో అమ్మకం పట్టుబడుతున్నా స్పందించని అధికారులు
జిల్లాలో జొన్న సాగు వివరాలు
పంట సాగు 1,10,901 ఎకరాలు
సాగు చేసిన రైతులు 39,764 మంది
కొనుగోలు కేంద్రాలు 12
ఇప్పటి వరకు కొనుగోలు చేసింది
3,84,000 క్వింటాళ్లు
నిర్మల్‌కు చెందిన ఓ ట్రేడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో 250 క్వింటాళ్ల జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామ సమీపంలో పోలీసులు సోమవారం పట్టుకున్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లా కావలి నుంచి జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు లారీలో అక్రమంగా తరలిస్తుండగా సిరికొండ మండలం రాంపూర్(బి) వద్ద పోలీసులు పట్టుకున్నారు. 30 క్వింటాళ్ల జొన్నలతో పాటు లారీని సీజ్ చేశారు. ఇలా ఒక్క రోజులోనే 280 క్వింటాళ్ల జొన్నలు పట్టుబడడం గమనార్హం.
ఈ నెల 14న తాంసిలోని సబ్‌మార్కెట్ యార్డులో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన జొన్నలను విక్రయించేందుకు యత్నిస్తుండగా అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకుని 136 క్వింటాళ్ల జొన్నలతో పాటు మాక్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ నమోదులో పొరపాట్లు లేవు..
పంటల ఆన్‌లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే వివరాలను ఆన్‌లైన్ నమోదు చేశారు. ఈ ఏడాది జొన్న పంట దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న జొన్నలను పోలీసులు అడ్డుకట్ట వేయాలి.
– శ్రీధర్‌స్వామి, డీఏవో