
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటేశం వద్ద శుక్రవారం రూ.1.20 లక్షల విలువ కలిగిన 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. నందులపల్లిలో నకిలీ విత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఏవో పుప్పాల సృజన ఫిర్యాదు చేయగా సోదాలు చేశామన్నారు. నందులపల్లి ప్రాజెక్టు ప్రాంతంలో 40 కిలోల విత్తనాలను తన చేనులో దాచేందుకు ప్రయత్నిస్తూ వెంకటేశం పట్టుబడ్డాడని చెప్పారు. మందమర్రికి చెందిన పిండి సురేశ్ వద్ద లూజ్ విత్తనాలు కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. రెండు విత్తన సంచులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.