
లైంగికవేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ఓ మహిళ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్‌లో నివసిస్తున్నారు. కొన్ని అవసరాల నిమిత్తం అమృత్‌సర్‌కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్‌ను వీరు సంప్రదించారు. సదరు అధికారి డబ్బులు ఆశించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారు. వారిపై కక్ష పెంచుకున్న మునీష్ కుమార్ ఆదిలాబాద్‌కు చెందిన మహిళ పేరిట పేస్‌బుక్‌లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి, సదరు మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని గుర్తించి అమృత్‌సర్ నుంచి ఆదిలాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.