● పగిలిన ప్రధాన పైపులైన్ ● 17 కాలనీలకు నిలిచిన నీటి సరఫరా
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని 17 కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పట్టణ శివారు లాండసాంగ్వి పంప్‌హౌస్ నుంచి మున్సిపల్ పరి ధిలోని పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ తిర్పెల్లి సమీపంలో పగిలిపోయింది. దీంతో నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఫలితంగా తిర్పెల్లి, మహాలక్ష్మివాడ, భాగ్యగనర్, తాటిగూడ, క్రాంతినగర్, చిల్కూరి లక్ష్మినగర్, సుందరయ్యనగర్, గాంధీనగర్, బ్రాహ్మణవాడ, ఖిల్లా తదితర 17 కాలనీలకు మూడు రోజులుగా నీటి సరఫరా కావడం లేదు. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా బల్దియా అధికారులు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా ట్యాంకర్ కోసం పనులన్నీ వదులుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై మున్సిపల్ డీఈ తిరుపతిని సంప్రదించగా.. మరమ్ముతులకు సంబంధించిన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మంచిర్యాల నుంచి తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
నీటి తిప్పలు