
ఎస్‌హెచ్‌జీలకు అదనపు ఉపాధి
● స్కూల్ యూనిఫాం కుట్టు బాధ్యత వారికే ● పట్టణంలో 256 మంది సభ్యుల ఎంపిక ● జూన్ 2లోగా దుస్తులు అందించేలా ఆదేశం
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే గతేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యత కూడా వారికే అప్పగిస్తోంది. తద్వారా అదనపు ఉపాధి సమకూరుతుంది.
గతేడాది నుంచి కుట్టు బాధ్యతలు..
సర్కారు బడి విద్యార్థులకు అవసరమైన యూనిఫాంను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీటిని కుట్టించే బాధ్యతలను రాష్ట్రస్థాయిలోని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేవారు. ఆ దుస్తులు కొలతలకు అనుగుణంగా లేకపోవడంతో విద్యార్థులకు అసౌకర్యంగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక దీనిని గుర్తించింది. స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్కూల్ యూనిఫాం కుట్టే బాధ్యతలను గతేడాది నుంచే వారికే అప్పగించింది. దుస్తులు కుట్టేందుకు అవసరమైన బట్టను ప్రభుత్వమే అందజేస్తోంది. విద్యా సంవత్సరం ముగింపులో పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు సేకరించిన ఎస్‌హెచ్‌జీ సభ్యులు బట్ట అందిన కొద్దీ దుస్తులు కుడుతన్నారు. ఒక్కో జతకు వారికి రూ.75 చొప్పున ప్రభుత్వం కూలీ చెల్లిస్తోంది. స్వయం ఉపాధి రుణాల సద్వినియోగంతో వివిధ వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు దీని ద్వారా అదనపు ఉపాధి లభిస్తోంది.
68 పాఠశాలలు..10వేల విద్యార్థులు
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 68 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 10,786 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 4813 మంది, బాలికలు 5973 మంది ఉన్నారు. వీరందరికీ ఏడాదికి గాను ప్రభుత్వం రెండు జతల యూనిఫాం అందజేస్తోంది. వీటిని కుట్టించేందుకు గాను పట్టణంలోని 68 స్లమ్ లెవల్ ఫెడరేషన్లను ఎంపిక చేశారు. 258 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను గుర్తించి వారికి కుట్టు బాధ్యతలు అప్పగించారు. కొంతమంది తమ టైలరింగ్ దుకాణాల్లో దుస్తులు కుడుతుండగా మరికొంతమంది తమ ఇళ్ల వద్దే స్టిచింగ్ చేస్తున్నారు. బడులు తెరిచే నాటికి ప్రతీ విద్యార్థికి యూనిఫాం అందించాలని జిల్లా అధికారులు సంకల్పించారు. జూన్ 2 నాటికి కనీసం ఒక జతను అందించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా సభ్యులు తమ పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పర్యవేక్షించేందుకు గాను మెప్మా పరిధిలోని ఐదుగురు సీవోలకు బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రయోజనకరం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ఎంతో హర్షనీయం. అవసరమైన బట్టను ప్రభుత్వమే మాకు సరఫరా చేసింది. దీంతో ఇంటి వద్దే దుస్తులను కుడుతున్నా. ప్రభుత్వ నిర్ణయంతో మాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.
– రాణి, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు,
హౌసింగ్‌బోర్డు
ఆర్థికంగా ముందుకు సాగుతున్నాం..
ప్రభుత్వం నుంచి బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్ర నిధి రుణాలు పొందుతున్నాం. వాటి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నాం. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం మాకు అప్పగించడంతో అదనపు ఉపాధి లభించింది. అయితే ప్రస్తుతం ఒక్కో జతకు రూ.75మాత్రమే చెల్లిస్తోంది. మార్కెట్ ధరకనుగుణంగా కూలీ రేటు పెంచితే బాగుంటుంది. – షభానా, ఎస్‌హెచ్‌జీ
సభ్యురాలు, కేఆర్‌కే కాలనీ

ఎస్‌హెచ్‌జీలకు అదనపు ఉపాధి

ఎస్‌హెచ్‌జీలకు అదనపు ఉపాధి