
అక్రమ పత్రాలతో మోసం చేసిన ఉద్యోగి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగిని వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో సీఐ సునీల్ కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కొండూరి గంగాధర్ విద్యానగర్‌కు చెందిన సయ్యద్ రజాక్ సర్వే నం.346, ప్లాట్ నం.191 అటెండర్ కాలనీలో ప్లాట్ విక్రయించాడు. పదవిని దుర్వినియోగం చేసి సుమిత్రబాయి అనే అటెండర్ పేరుపై నకిలీ దస్తావేజులు తయారు చేసి బాధితుడికి విక్రయించాడు. సయ్యద్ రజాక్ ఈ ప్లాట్‌ను బ్రహ్మకంటి సత్యనారాయణకు విక్రయించగా, ఆయన నళినికి ప్లాట్‌ను అమ్మాడు. ఆమె బ్యాంక్ రుణం తీసుకుని ఇల్లు నిర్మించే క్రమంలో అక్కడికి వెళ్లి స్థల యజమాని తోట ఆశమ్మ అభ్యంతరం తెలిపింది. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. మొదట ప్లాట్ కొనుగోలు చేసిన సయ్యద్ రజాక్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. కొండూరి గంగాధర్ అక్రమంగా సుమిత్రబాయి సహకారంతో, ఆమెను బెదిరించి అక్రమ పత్రాలు సృష్టించినట్లు తేలిందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంగాధర్ ప్రస్తుతం జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ వ్యవహారానికి సంబంధించి బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారిస్తూ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దాని ఆధారంగా గంగాధర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీచేశారు.