
పంటమార్పిడితోనే ఫలితం
● ఏళ్ల తరబడి ఒకే రకం పంటలు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్‌సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. రుతుపవనాలు జూన్ మొదటి వారంలో జిల్లాలను తాకానున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు పడేలోగా విత్తనాలు సమకుర్చుకునే పనిలో రైతులు సమయాత్తమవుతున్నారు. అయితే వారు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. ఒకే భూమిలో ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి పండిస్తూ దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. చీడపీడల బెడద అధికమవడంతోపాటు భూమి నిస్సారమవుతుంది. పంట మా ర్పిడితో ప్రయోజనం పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ సస్యరక్షణ శాస్త్రవేత్త రాజశేఖర్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి నేలలు 70 శాతం, 20 శాతం ఎర్ర,10 శాతం చౌడు ఇసుక నేలలు ఉన్నాయి. అన్ని పంటలకు అనుకూలంగా నేలలు ఉన్న రైతులు పత్తి, సోయా, వరి పంటలను ఎనిమిదేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని ద్వారా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారు. పంట మార్పిడితో కొంతవరకు దిగుబడి పెంచుకుని నషాల నుంచి గట్టేక్కే ప్రయోజనం ఉంది.
పంట మార్పునకు..
పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా ఎంచుకోవాలి. ఉదాహరణకు కొన్ని పంటలు వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలను గ్రహిస్తాయి. నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు ఈ కోవలోకి వస్తాయి. అపరాల పంటలు కొంతవరకు పరిస్థితుల్ని కూడా తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రియ పదార్థాల్ని అందిస్తాయి. ఈ పంట వేరు బుడిపెలు నత్రజనిని స్థీరీకర్తిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన వారు సోయచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి అకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరాకు 1 నుంచి 2 టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది.
ఎలాంటి పంట వేసుకోవాలి
గతేడాది రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్‌లో మొక్కజొన్న వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులిపురుగుల బెడద తగ్గుతంది. శనగ పంట వరుసగా వేసుకుంటే కాయతొలుచు పురుగుల తాకిడి ఉంటుంది. వీటి దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ, మెట్ట వరి పంటలు వేసుకోవచ్చు. కంది, శనగ, పంటలతో పోలిస్తే మినుము, సోయచిక్కుడు పంటలకు కాయతొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. వీటితో పంట మార్పిడి చేయవచ్చు. వరుసగా పొద్దుతిరుగుడు వేసుకున్నవారు దాని స్థానంలో కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలు వేసుకోవాలి. దీనివల్ల నులిపురుగు తాకిడి తగ్గుతుంది. అనుప, కాకర, దోస, కర్బూజ, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ తీగజాతి కూరగాయల పంటలసాగు చేసినవారు వరితో పంట మార్పిడి చేసుకోవాలి.
ఏళ్లుగా పసుపు వేయొద్దు
ఒకసారి పసుపు వేసిన భూమిలో రెండేళ్లపాటు పసుపు సాగు చేయొద్దు. వరుసగా పసుపు వేసుకుంటే దిగుబడి తగ్గిపోతాయి. చీడపీడల దాడి అధికమవుతుంది. పసుపు వేసిన భూమిలో వరి, చెరుకు, అరటి పంటలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది.
చీడపీడల నివారణకు..
కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు, కొన్ని పంటల్ని అధికంగా అశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటల్ని వరుసగా వేసుకోకుండా పంట మార్పిడి చేసుకోవాలి. ఉదాహరణకు ఒకే భూమిలో వరుసగా వరి వేయకుండా పప్పు ధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటల్ని లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, అరుతడి పంటలతో పంట మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు.
దుక్కి దున్నుతున్న రైతు

పంటమార్పిడితోనే ఫలితం