
ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే
● పథకాలు సద్వినియోగం చేసుకోవాలి ● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమమే వాటి అంతిమ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే మహాలక్ష్మి పథకం అమలు అభినందనీయమన్నారు. ఈ పథకాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు మాత్రమే పరిమితి ఉండేదన్నారు. ప్రధాని మోదీ ప్రతీ నిరుపేదకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశంతో రూ.10లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా ఆయుష్మాన్ భారత్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ కింద అమలవుతుందని వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమన్, డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎం కల్పన, ఆర్టీసీ, వైద్యరోగ్యశాఖ అధికారులు, నాయకులు లాలా మున్న, జోగు రవి, రఘుపతి, సోమ రవి తదితరులు పాల్గొన్నారు.