
మున్సిపల్ కార్యాలయం
● ఇన్నాళ్లు అందినకాడికి చేతివాటం ● ప్రభుత్వం మారడంతో బదిలీ యత్నం
కై లాస్‌నగర్: రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్‌లో పనిచేసే కొంతమంది అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సదరు అధికారుల్లో ప్రభుత్వ మార్పు కలవరానికి గురిచేస్తోంది. ఇంకా ఇక్కడే కొనసాగితే తమ బండారం బయటపడి మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ఆ అక్రమార్కులు స్వచ్ఛంద బదిలీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు బల్దియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వేరే చోటుకు స్థాన చలనం జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చనే ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వేడుకుంటున్నట్లుగా తెలిసింది.
దీర్ఘకాలంగా ఒకే చోట!
మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగంలో గల ఇద్దరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ అధికారి మూడేళ్ల పాటు ఒక చోట పనిచేసే అవకాశముంది. కానీ సదరు అధికారులు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఐదారేళ్లకు పైగా ఇక్కడే తిష్టవేశారు. పరిచయాలు పెంచుకుని తమదైన శైలిలో అక్రమాలకు తెరలేపారనే చర్చ సాగుతోంది. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అధికారి అయితే ఏకంగా బినామీ పేర్లతో టెండర్లు సొంతం చేసుకుని పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి. కౌన్సిలర్లు, బల్దియా ఉద్యోగులు దీనిని బహిరంగంగానే చెబుతున్నారు. పనులను పర్యవేక్షించి పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా చూడాల్సిన సదరు అధికారే కాంట్రాక్టర్ అవతారమెత్తి రూ.కోట్లకు పడగలెత్తారనే విమర్శలున్నాయి. ప్రణాళిక విభాగంలో పనిచేసే మరో అధికారి సైతం ఇక్కడే ఏళ్లుగా పాతుకుపోయారు. పట్టణంలో జరిగే అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లపై చర్యలు చేపట్టాల్సిన సదరు అధికారి వారితో కుమ్మకై ్క అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా అక్రమం జరిగినట్లు ఫిర్యాదు అందితే చాలు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని కోట్ల రూపాయలు ఆర్జించినట్లుగా తోటి ఉద్యోగులే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇలా ఈ ఇద్దరు అధికారులు రెండు చేతుల ఆర్జించినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బదిలీ కోసం యత్నాలు ?
ఇన్నాళ్లు అక్రమంగా అందిన కాడికి దండుకున్న సదరు అధికారులు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ మొదలైంది. రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురుకాక ముందే చాప చుట్టేసేలా బదిలీ ప్రయత్నాలు చేపట్టినట్లుగా బల్దియా వర్గాలు గుసగుసలాడుతున్నాయి. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను సంప్రదించి తమను మరో చోటుకు బదిలీ చేసేలా చూడాలని వేడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం.