
ఆదిలాబాద్: ఆస్తి కోసం తమ్ముడినే అన్న హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో చోటు చేసుకుంది. గత నెల 29న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్‌లో జరిగిన హత్య వివరాలను డీఎస్పీ గంగారెడ్డి సోమవారం వెల్లడించారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములు సిలారి పెద్ద మల్లయ్య, సిలారి చిన్న మల్లయ్య(45)కు కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తరచూ పెద్ద మల్లయ్య తన తమ్ముడు చిన్న మల్లయ్యపై దాడి చేసేవాడు.
దీంతో బాధితుడు అతని అన్న, కుమారుడు మహేష్‌లపై పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కేసు పెట్టాడు. తమ్ముడిపై కోపం పెంచుకున్న పెద్ద మల్లయ్య అతన్ని చంపితే ఇల్లు, భూమి తనకు చెందుతాయని భావించి కుమారుడు మహేష్‌తో కలిసి కుట్రపన్నాడు. గతనెల 29న ఇంటివద్ద జరిగిన గొడవను అదునుగా భావించిన తండ్రీకొడుకులు ఊరి చివరన మాటువేసి మాంసం కొట్టే కత్తి, ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా దాడి చేశారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నమల్లయ్య అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ముందుగా నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ గత నెల 30న మృతి చెందాడు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మోటార్ సైకిల్, కర్ర కొడవలి, కత్తి, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హత్యకేసు ఛేదించిన సోన్ సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, రాజు, రవీందర్‌ను ఎస్పీ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి అభినందించారు.