breaking news
Yousuf khan
-
'ఈత సరదా ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది'
బషీరాబాద్: ఈత సరదా ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది. బంధువులతో కలిసి కాగ్నా నదిలో దిగిన అతడు నీటమునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డిజిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు మహ్మద్ యూసుఫ్‌ఖాన్(26) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బషీరాబాద్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో యూసూఫ్‌ఖాన్ కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. ఆదివారం అతడు బంధువులు, స్నేహితులతో కలిసి నవాంద్గి సమీపంలో ఉన్న కాగ్నానదిలోకి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో యూసుఫ్‌ఖాన్ నీటిలో మునిగి పోయాడు. స్నేహితులు, బంధువులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సాయం తో నదిలో గాలించగా సాయంత్రం 5 గంటలకు యూసుఫ్‌ఖాన్ మృతదేహం లభ్యమైంది. చేతికి అందివచ్చిన కొడుకు నదిలో మునిగి చనిపోవడంతో షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు అవివాహితుడు. కాగా, యూసుఫ్‌ఖాన్ మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
కైసే బనాతే.. సేమియా
సేమియా తయారీలో ఖాన్ బ్రదర్సది ఫిఫ్టీ ఇయర్స ఇండస్ట్రీ. పొడవాటి సన్నని దారం పోగుల్లా కనిపించే సేమియా తయారీకి వారు ఎలాంటి యంత్రాలనూ ఉపయోగించరు. కేవలం హస్తకౌశలంతోనే తయారు చేస్తారు. చాదర్‌ఘాట్ మూసానగర్ ప్రాంతంలోని సలీంఖాన్, ఆయన ఇద్దరు సోదరులు... అన్వర్ ఖాన్, యూసఫ్ ఖాన్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే పనిలో తలమునకలుగా ఉంటారు. రంజాన్ మాసం చివరి రోజైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తయారుచేసే స్వీట్ ‘షీర్ కుర్మా’కు ఈ సేమియానే ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో వీరికి మంచి గిరాకీ. వారి పిల్లలు కూడా స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఈ పనిలో చేదోడు వాదోడుగా ఉంటారు. ఎలా చేస్తారంటే... మైదాలో తగినంత ఉప్పు కలిపి, నీరు చేర్చి ముద్ద కలుపుకుంటారు. రాత్రంతా ముద్దను అలాగే వదిలేస్తారు. ఉదయాన్నే సేమియా తయారీ మొదలుపెడతారు. చకచకగా పోగులుగా తయారుచేసిన సేమియాను దండెంలా కట్టిన దారాలపై ఆరబెడతారు. సేమియా తయారీ ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. అయితే, ఒకసారి దారాలపై ఆరబెట్టాక, పది నిమిషాల్లోనే పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయిన సేమియాను జాగ్రత్తగా తీసి, కట్టలు కట్టలుగా కట్టి ప్యాక్ చేస్తారు. వానొస్తేనే ఇబ్బంది: సలీం ఖాన్: రంజాన్ నెలలోను, ముందు నెలలోను ఈ సేమియాకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. అయితే, తయారీ సమయంలో వానొస్తే మాకు నష్టం తప్పదు. అలాంటప్పుడు ఒక్కోరోజులో రూ.1200-1500 వరకు నష్టం వస్తుంది. పూర్తిగా చేతులతోనే సేమియా తయారు చేయడానికి చాలా నైపుణ్యం, ఓపిక కావాలి. మా నాన్న సర్దార్ ఖాన్ వద్ద నేను, మా తమ్ముళ్లు దీని తయారీని నేర్చుకున్నాం. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఈ సేమియా తయారీని మా తాత ప్రారంభించారు. యాభయ్యేళ్లుగా ఇదే పనిలో కొనసాగుతున్నాం. ప్రస్తుతం రోజుకు దాదాపు ముప్పయి కిలోల సేమియా తయారు చేస్తున్నాం. నగరంలోని దుకాణాలకే కాకుండా, చుట్టుపక్కల జిల్లాలకూ సరఫరా చేస్తున్నాం. - సాక్షి, సిటీప్లస్