breaking news
Yellapragada Subbarao
-
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
అజ్ఞాత మహనీయుడు
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు 1930ల నాటికే బయోకెమిస్ట్రీ పాఠ్యపుస్త కాల్లోకి ఎక్కింది. ఆయన పరిశోధనంతా విదేశాల్లో సాగినా, భారతీయ శాస్త్ర జ్ఞానంపై ఆయనకు అపారమైన నమ్మకం. భారతదేశం పరాయిపాలనలో వుండగా సుబ్బారావు విదేశీయుల వద్ద చదువు కున్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్య మంలో భాగంగా ఖద్దరుతో నేసిన సర్జికల్ ఏప్రాన్ వేసుకుని మెడికల్ కాలేజీకి హాజరయ్యారు. ప్రొఫెసర్ బ్రాడ్‌ఫీల్డ్ ‘గాంధీ వైస్రాయ్ అయ్యాక వేసుకుందువు గానిలే’ అని వేళాకోళం చేశాడు. ‘వైస్రాయ్ స్థాయికి గాంధీ ఎప్పుడూ దిగ జారడు’ అన్నాడీయన. ఈ మాట అన్నది 1920 ప్రాంతంలో. ఆ ప్రొఫెసర్ కసి పెట్టుకుని ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వకుండా అంత కంటే తక్కువదైన ఎల్ఎమ్ఎస్ డిగ్రీ ఇచ్చాడు. దాంతో మద్రాస్ మెడికల్ సర్వీసెస్‌లో ఉద్యోగం రాలేదు. ఆయుర్వేద కాలేజీలో చేరవలసి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో డిప్లోమా కోర్సుకి అడ్మిషన్ ఇచ్చారు కానీ ఫిజిషియన్‌గా కాదు, కెమిస్ట్‌గా. కోర్సు పూర్తి చేశాక జూని యర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉద్యోగం ఇచ్చారు. వాళ్ల ఇంట్లో అనారోగ్యం, దరిద్రం రెండూ ఉన్నాయి. సుబ్బారావు నాన్నగారికి దరిద్రం వలన అనారోగ్యం, దానివలన ఉద్యోగం పోయింది. ఈయనకు 18 ఏళ్ల వయసులో నాన్నగారు పోయారు. ఆయన సోదరులకు కూడా అనారోగ్యమే. ఇంకో ఏడేళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చి వెళదామ నుకుంటూండగా అన్నయ్య, పెద్ద తమ్ముడు రోజుల తేడాతో ‘స్ప్రూ’ వ్యాధితో పోయారు. మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కనబడని సందర్భంలో కాకినాడ వెళ్లి అప్పు చేయబోయారు. ‘అప్పెందుకు, మేం చదివిస్తాం, చదువయ్యాక మా అమ్మాయిని పెళ్లి చేసుకో’ అని ఒక కుటుంబం ముందుకొచ్చింది. అతనికి పెళ్లిమీద ధ్యాస లేదు. చదువుకోసం సరేనన్నారు. సుబ్బారావు స్కూలు ఫైనల్ రెండు సార్లు ఫెయిలయ్యారు. ఇంటర్లో ఆయన సబ్జక్ట్ మేథ్స్. మరి మెడికల్ సైంటిస్టు కావడానికి ఇవేమైనా అడ్డు వచ్చాయా? ఆట్టే మాట్లాడితే ఆయన ఎంబీబీఎస్ కూడా కాదు. ఆయన చేసిన రీసెర్చి పేపర్లు ఆయన సమ్మతితోనే తక్కినవాళ్ల పేర పబ్లిష్ అయ్యాయి. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకు వెళ్లి రీసెర్చి చేసిన శిష్యులకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఆయనకు రీసెర్చి అంటే ఎంతో పిచ్చి. లీడర్లీ కంపెనీలో 15,000 డాలర్ల జీతం ఇస్తామన్నారు. అప్పట్లో ఆయనకు హార్వర్డ్ యూని వర్శిటీలో కేవలం 2,700 డాలర్ల జీతం మాత్రమే. ఒక్కసారిగా పెద్ద అవకాశం. అప్పులన్నీ తీరిపోతాయి. ఎగిరి గంతేయాలి కానీ తను చేసే ఎక్స్‌పెరిమెంట్స్‌కు కొత్త బిల్డింగ్ ఇచ్చే మాటైతే సగం జీతానికే పని చేస్తానని అన్నారు. రీసెర్చి అంటే ప్రాణం పెట్టే లీడర్లీ ప్రెసిడెంట్ విలియం బ్రౌన్‌బెల్ కొత్త బిల్డింగూ ఇచ్చాడు, ఆఫర్ చేసిన జీతమూ ఇచ్చాడు. బాడీ ఫ్లూయిడ్స్‌లో, టిష్యూస్‌లో ఫాస్ఫరస్ మోతాదు ఎంత ఉండాలి అని బేరీజు వేసే అంశంపై ఆయన దృష్టి సారించి సైరస్ ఫిస్కేతో కలిసి ఒక పద్ధతి కనిపెట్టారు. టెక్నికల్‌గా దాన్ని ర్యాపిడ్ కేలోరిమెట్రిక్ మెథడ్ అన్నా, వాడుకలో దానికి ఫిస్కే–సుబ్బారావ్ మెథడ్ అని పేరు వచ్చింది. ఇంత గొప్ప పరిశోధన చేసేనాటికి ఆయనకు నిండా 30 ఏళ్లు లేవు. అమెరికన్ సొసైటీ ఆఫ్ బయొలాజికల్ కెమిస్ట్రీస్ వార్షిక సదస్సులో 1924లో దీన్ని డిమాన్స్ట్రేట్ చేశారు. మన శరీరంలో శక్తిని నిల్వచేసే ఫాస్పోక్రియాటిన్, అడినాసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) కనుక్కున్నారు. రెండవ ప్రపంచయుద్ధంలో పసిఫిక్ తీరంలో యుద్ధ రంగంలో వున్న అమెరికా సైనికులు మలేరియా, ఫైలేరియాసి స్తో బాధపడి చికిత్సకై వచ్చినపుడు వారు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి మట్టి శాంపుల్స్ తెప్పిం చారు. ఎందుకంటే వ్యాధి ఒకేలా ఉన్నా, దాని తీవ్రతలో, అది శరీరంపై చూపే ప్రభావంలో తేడా ఉంది. సైనికుడి శరీరం లోని ఇమ్యూనిటీకి తోడు ఇంకా ఏదో ఫ్యాక్టర్ ఉండి ఉంటుంది అనుకున్నారు. అందుకని అక్కటి మట్టి తెప్పించి దానిలో నేచురల్‌గా ఉండే ఫంగస్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ఏజంట్స్ ఏవైనా వున్నాయా అని పరీక్ష చేశారు. ఇలా చేయడం అప్పటికి చాలా కొత్త. దీని కారణంగానే ప్రపంచంలో తొలి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ – ఆరియోమైసిన్ కనిపెట్టబడింది. 1994లో సుబ్బారావుగారి శతజయంతి జరిగిన సంద ర్భంలో ఆయన పేర మన ప్రభుత్వం స్టాంపు విడుదల చేసింది. అదే సంవత్సరం టెట్రాసైక్లిన్ లేటెస్ట్ వెర్షన్ డాక్సీసైక్లిన్ గుజరాత్, మహారాష్ట్రలలో చెలరేగిన ప్లేగును అరికట్టడానికి ఎంతో ఉప యోగపడింది. బెంజమిన్ డగ్గర్తో కలిసి ఆయన 1945లో టెట్రాసైక్లిన్ కనిపెట్టారు. ఆయన పోయిన సంవత్సరమే అంటే 1948లో అది మార్కెట్లోకి వచ్చింది. ఇన్నేళ్లలో కొన్ని కోట్ల మందిని కాపాడి ఉంటుంది. సుబ్బారావు అమెరికాలో వున్నా ట్రాపికల్ ఏరియాస్‌లో, ముఖ్యంగా తను పెరిగిన రాజమండ్రి, కాకినాడలలో ఎక్కువగా ఉన్న ఫైలేరియా గురించి పరిశోధన కేంద్రీకరించి హెట్రజన్ ఔషధం కనిపెట్టారు. అప్పట్లో మన దేశంలో ఎక్కువగా ఉన్న టీబీని అరికట్టడానికి ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్ కని పెట్టారు. తన సోదరులను పొట్టన పెట్టుకున్న ‘స్ప్రూ’ను అరికట్టడానికి ఫోలిక్ యాసిడ్‌ను లివర్‌లోని బ్యాక్టీరియా నుండి విడదీశారు. అది రక్తహీనతతో బాధపడే మన భారతీయులకు ఎంతో అవసరం. క్యాన్సర్‌కు కీమోథెరపీ వాడకం గురించి ఇప్పుడు సామాన్య జనానికి కూడా తెలుసు. కీమోథెరపీ ఏజంట్లలో తొలితరం డ్రగ్ మెథోట్రెక్సేట్‌ను డెవలప్ చేసినది సుబ్బారావు, ఆయనతో బాటు సిడ్నీ ఫార్బర్! ఆంధ్రప్రాంతంలో ‘బెరిబెరి’ (నంజు వ్యాధి) కూడా తీవ్రమైన వ్యాధే. దానికై ఆయన థయామిన్ తయారీపై దృష్టి సారించారు. ఈయన వచ్చేసరికి పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ తప్ప యాంటీబయాటిక్స్ ఏమీ తెలియవు. 8 ఏళ్లల్లో ఆయన ఇన్ని డిస్కవరీస్ చేయడానికి కారకుడయ్యారు. 1948లో ఆయన చనిపోక పోయి ఉంటే యింకా ఎన్ని గొప్ప ఔషధాలు దక్కేవో! అప్పట్లో రీసెర్చి అంటే ఇంగ్లండ్‌కు వెళ్లేవారు. కానీ ఆయన అమెరికాకు వెళ్లారు. మెడికల్ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్ చూపిం చిన పక్షపాత బుద్ధి వలన! ఆయన డిస్కవరీల పేటెంట్లన్నీ అమెరి కాకు వెళ్లాయి. అది అమెరికాకు గెయిన్, బ్రిటన్‌కు లాస్. ఆయన చనిపోయాక ఆయన లైబ్రరీని లీడర్లీ వాళ్లు ఆయన పేర ఆంధ్ర యూనివర్సిటీకి డొనేట్ చేద్దామనుకున్నారు. అక్కడ దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం, ఆవశ్యకత ఎవరికీ లేదని గుర్తించి తమ కంపెనీలోనే ఆయన పేర లైబ్రరీ పెట్టి అక్కడే ఉంచేశారు. -డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి వ్యాసకర్త శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు, ‘పద్మభూషణ్’ గ్రహీత -
యల్లాప్రగడ జీవితంతో సింగీతం సినిమా
కాలచక్రం వెనక్కి వెళితే?... ఆ ఊహే బాగుంది కదూ.! ఆ ఊహకు తెరరూపం ఆ మధ్య వచ్చిన చిత్రం ‘24’. ఇప్పుడంటే ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మంచి కథ, స్క్రీన్‌ప్లే మీద పట్టు, టెక్నాలజీ మీద దర్శకుడికి అవగాహన ఉంటే చాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి సినిమా చేయడం పెద్ద సాహసం. ఆ దర్శకుడికి గొప్ప విజన్ ఉండాలి. సింగీతం శ్రీనివాసరావు అలాంటి దర్శకుడే. అందుకే పాతికేళ్ల క్రితమే ‘ఆదిత్య 369’ తీయగలిగారు. మూకీ సినిమా ‘పుష్పక విమానం’ దర్శకుడు కూడా ఈయనే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘భైరవద్వీపం’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి పలు ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించారు. ఎయిటీ ప్లస్ ఏజ్‌లోనూ సింగీతం ఉత్సాహంగా ఉన్నారు. ఆ మధ్య ‘వెల్కమ్ ఒబామా’ చిత్రం చేసిన ఆయన ఇప్పుడు ఓ బయోపిక్ తీయడానికి రెడీ అవుతున్నారు. భారతీయ వైద్య శాస్త్రజ్ఞులలో అత్యంత పేరు, ప్రతిష్ఠలు సాధించిన కీ॥యల్లాప్రగడ సుబ్బారావు జీవితం ఆధారంగా సింగీతం ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ సినిమా కోసం కథ రెడీ చేస్తున్నాను. బయోకెమిస్ట్రీ (జీవ రసాయన శాస్త్రం) రంగానికి సుబ్బారావుగారు చేసిన సేవలు కొనియాడదగ్గవి. ఆయన జీవితం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌కు ఎవర్ని తీసుకోవాలో కథ రెడీ అయ్యాకే నిర్ణయించుకుంటానని సింగీతం పేర్కొన్నారు.