breaking news
Worldcup-2011
-
ఆ ఐదు నిర్ణయాలు.. ధోని ఏంటో చెప్తాయి
ముంబై : మహేంద్రసింగ్ ధోని.. ఎప్పటినుంచో తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు శనివారం(ఆగస్టు 15)తో తెరదించాడు. టెస్టుల నుంచి 2014లోనే తప్పుకున్న ధోని అప్పటి నుంచి వన్డే, టీ 20ల్లో కొనసాగుతున్నాడు. 2017లో కెప్టెన్ స్థానం నుంచి పక్కకు తప్పుకొన్న ధోని ఆటగాడిగా కొనసాగాడు. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిసారిగా కనిపించిన ధోని మళ్లీ జట్టులోకి రాలేదు. ఆలోగా కరోనా వైరస్ విజృంభణతో క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడడం జరిగింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్లో ధోని రాణించి మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ ధోని తన అభిమానులందరిని షాక్‌కు గురిచేస్తూ ఆగస్టు 15 శనివారం.. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.(మీకు సలాం, ట్రెండింగ్‌లో థాంక్యూ మహి!) అంతే.. ఇక ధోని మెన్ ఇన్ బ్లూలో కనిపించడనే విషయాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలా క్రికెటలో ధోని శకం నిరాడంబరంగా ముగిసింది.మరి అలాంటి ధోని.. కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. ఈ నేపథ్యంలో అతను తీసుకున్న చాలా నిర్ణయాలు.. కెప్టెన్‌గా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. వాటిలో ఒక ఐదింటిని ఇప్పుడు మనం ఒకసారి గుర్తుచేసుకుందాం. 2007 టీ20 వరల్డ్ కప్ : అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా 2007 మొదటి టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ దాటితే గొప్ప అని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ధోని నాయకత్వంలోని భారత యువజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. పాక్‌పై గెలిస్తే అభినందనలు.. ఓడితే చెప్పులు దండలు పడడం ఖాయం. ఒకవైపు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో విజయం భారత బౌలర్లపై పడింది. పాక్ విజయానికి 13 పరుగులు కావాలి. మిస్మా-ఉల్-హక్ 37 పరుగులతో అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు.. టీమిండియా బౌలర్లలో హర్భజన్, జోగిందర్ శర్మలకు ఒక్కో ఓవర్ మిగిలి ఉంది. ఇక్కడే ధోని కెప్టెన్‌గా తన తెలివిని ప్రదర్శించాడు. ఎందుకంటే అంతకుముందు భజ్జీ వేసిన 17వ ఓవర్లో మిస్బా మూడు సిక్స్‌లు కొట్టాడు. అందుకే సీనియర్ బౌలర్ హర్భజన్‌ను కాదని జోగిందర్ శర్మకు బంతిని ఇచ్చాడు. జోగి వేసిన మొదటి బంతి వైడ్‌గా వెళ్లింది.. రెండో బంతి డాట్ బాల్‌గా పడింది. ఒక మూడో బంతిని మిస్బా షార్ట్ ఫైన్‌లైగ్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు.. అక్కడున్నవారంతా అది సిక్స్ అని భావించారు. కానీ బంతి అనూహ్యంగా శ్రీశాంత్ చేతిలో పడింది. ఇంకేముంది... టీమిండియా ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్ పడింది. ఇదే కెప్టెన్‌గా ధోని మొదటి విజయానికి భీజం పడింది.(ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్) గంగూలీ, ద్రవిడ్‌ల తొలగింపు : టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్‌ను సాధించిపెట్టిన ధోని కొద్ది రోజుల్లోనే వన్డే కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. 2008లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్( కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్)కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని అప్పటి బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా దగ్గరకు వెళ్లి మన ఫీల్డింగ్‌లో సమూల మార్పులు అవసరం ఉందని , జట్టులో యువకులు ఉంటే బాగుంటుందని.. అప్పుడే ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపాడు. దీంతో పరోక్షంగా దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, ద్రవిడ్‌లు ఈ సిరీస్ నుంచి తప్పుకునేందుకు కారణమైన ధోనిని అప్పట్లో తప్పుబట్టారు. కానీ అనూహ్యంగా ధోని సేన తొలిసారి ఆసీస్ గడ్డపై ట్రై సిరీస్‌ను గెలిచింది. అంతేకాదు.. భారత ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా బాగా మెరుగయ్యాయి. తాను అనుకున్న ఏ విషయమైన నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా చెప్పడం అతనికి అభిమానులను మరింత పెంచింది. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. బ్యాటింగ్‌లో ప్రమోషన్ 2011 ప్రపంచకప్.. సొంతగడ్డపై జరగడం ఒక సానుకూలాంశం. ఈసారి కప్పు సాధించకపోతే.. మళ్లీ సాధించలేం అన్న రీతిలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 274 పరుగులు సాధించింది. బారీ బ్యాటింగ్ లైనఫ్ కలిగిన టీమిండియాకు ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదనిపించింది. కానీ అనూహ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌లు విఫలమవ్వడం.. కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లడం.. మలింగ భయంకరమైన బౌలింగ్‌తో బెంబెలెత్తించాడు. దీంతో యువరాజ్‌ను కాదని తానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ధోని. ఒక కెప్టెన్‌గా ధోని తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం.. కానీ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించడం.. యువరాజ్‌తో కలిసి ఆఖరు వరకు క్రీజులో నిలిచి 91 పరుగులు చేయడం.. విన్నింగ్ షాట్‌ను సిక్స్‌గా మలచడం చకచకా జరిగిపోయాయి. 28 ఏళ్ల తరువాత భారత అభిమానలు దాహం తీర్చిన ధోని కెరీర్లో ఈ నిర్ణయం కలికితురాయిలా నిలిచిపోతుంది. ఓపెనర్ల రొటేషన్ పాలసీ.. అప్పటివరకు టీమిండియా జట్టులో సచిన్, సెహ్వాగ్ రెగ్యులర్ ఓపెనర్లుగా కొనసాగుతుండేవారు. వీరి గైర్హాజరీలో మాత్రమే ఇతర ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానంలో వచ్చేవారు. కానీ ధోని 2008లో సీబీ సిరీస్‌లో మాత్రం రొటేషన్ పద్దతిని అమలు పరిచాడు. సచిన్, సెహ్వాగ్, గంబీర్‌లతో కలిసి రొటేషన్ పద్దతిని పరిచయం చేశాడు. అయితే ఇది అంతగా సక్సెస్ కాకపోయినా టీమిండియా జట్టుకు రొటేషన్ ఓపెనింగ్ అనే ఒక కొత్త పద్దతిని అలవాడు చేశాడు. రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ప్రమోషన్ 2013 సంవత్సరం వచ్చేసరికి ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ఐసీసీ టీ20, వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపిని గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా నిలిచాడు. అప్పటివరకు మిడిల్ ఆర్డర్లో కొనసాగుతున్న రోహిత్ శర్మను ఓపెనర్‌గా పరిచయం చేసింది ఈ ఏడాదే. 2007లోనే జట్టులోకి వచ్చిన రోహిత్ ఆరు సంవత్సరాలైన అడపా దడపా మెరిసాడే తప్ప రెగ్యులర్‌గా చోటు దక్కేది కాదు. రోహిత్లో అపారమైన ప్రతిభ ఉందని కనిపెట్టిన ధోని.. 2011లో తొలిసారి దక్షిణాఫ్రికా టూర్లో ఓపెనర్‌గా ఆడించాడు. కానీ మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 29 పరుగులే చేసి రోహిత్ విఫలమయ్యాడు. రోహిత్ మీద ఉన్న నమ్మకంతో 2013 జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మళ్లీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. ఈసారి రోహిత్ .. 83 పరుగులు చేసి తన సత్తా నిరూపించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రోహిత్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.(మహేంద్రుడి మాయాజాలం) -
గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
కొల్‌కత: ప్రపంచ కప్ గెలుచుకొని నేటికి ఆరేళ్లు పూర్తయిన సంధర్భంగా ఆ జట్టులోని సభ్యులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెహ్వాగ్ ట్వీటర్లో ఆనందం వ్యక్తం చేయగా ఐపీఎల్ కొల్‌కత నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్లు నైట్‌రైడర్స్ అధికారిక వెబ్సైట్లో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌కు సిద్దంగా లేను: గంభీర్ ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండో బంతికే డక్ ఔట్ అవ్వడం అయోమయానికి గురి చేసిందని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ తెలిపాడు. ఆ సమయంలో బ్యాటింగ్ రావడానికి సిద్దంగా లేనని,ప్యాడ్లు కట్టుకుంటున్నానని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అంపైర్ రిఫరల్ తీసుకోవడంతో కాస్త సమయం దొరికందన్నాడు. క్రీజులోకి వెళ్లె ముందు మెదడులో ఇది ప్రపంచకప్ ఫైనల్, 275 పరుగుల లక్ష్యం అని చాలా ఆలోచనలు మొదలయ్యాయన్నాడు. వచ్చిన వెంటనే మలింగా విసిరిన తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పాడు. 275 పరుగుల లక్ష్యం స్వదేశంలో పెద్ద లక్ష్యం కాదని కానీ ఆసమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరం మ్యాచ్గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని భావించి ఆడానన్నాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్, నాటి కెప్టెన్ ధోనితో కలసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుకు బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రాత్రి జెర్సీ విప్పలేదు: పీయూష్ చావ్లా ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అయితే మ్యాచ్‌గెలిచిన రాత్రి భారత్ జెర్సీ, మెడల్ తీసేయకుండా అలానే పడుకున్నానని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్అనంతరం చాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి సందడి చేశానని, కానీ తాగలేదని, ఇప్పటికీ తాగిన అనుభూతే కలుగుతుందన్నాడు ఈ లెగ్ స్పిన్నర్. టీషర్టుపై ప్రతి ఒక్క ఆటగాడి సంతకం తీసుకున్నానని, మెడల్ టీషర్టుతో అలానే పడుకున్నాని చావ్లా తెలిపాడు. ఆ వేడుకలతో తన జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా నిలిచిందన్నాడు. ఫుల్ టాస్‌ను సింగిల్ తీశాను: యూసఫ్ పఠాన్ ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మెరిపించిన యూసఫ్‌పఠాన్ తన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యూసఫ్ 30 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోశించాడు. ఇదే మ్యాచ్ 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్, యూసఫ్‌లు జట్టును గెలిపించారు. యూవీ 50 కోసం ఫుల్‌టాస్ బాల్‌ను సింగిల్ తీశానని యూసఫ్ తెలిపాడు. ఆ సమయంలో భారత్ విజయానికి 8 పరుగులు దూరంలో ఉందని, యూవీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు కావాలని, అయితే సింగిల్ తీయడంతో యూవీ ఫోర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని యూసఫ్ తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. దీంతో యూవీ వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించి 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో 6 వికెట్లతో భారత్ గెలుపొందడం 1983 వరల్డ్‌కప్ తర్వాత ఇది రెండోసారి.