breaking news
world sennior boxing
-
వికాస్ శుభారంభం
అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ చేసింది. మంగళవారం జరిగిన 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ మలిక్ శుభారంభం చేశాడు. మెదార్ మమకీవ్ (కిర్గిజిస్థాన్)తో జరిగిన తొలి రౌండ్లో వికాస్ 3-0 (29-28, 29-28, 30-27)తో విజయం సాధించాడు. నిర్ణీత మూడు రౌండ్లలోనూ వికాస్ ప్రత్యర్థిపై ఆధిక్యంలో నిలిచాడు. 20న జరిగే రెండో రౌండ్లో అతను మిచెలుస్ (పోలాండ్)తో తలపడతాడు. సోమవారం జరిగిన 52 కేజీల తొలి రౌండ్లో భారత బాక్సర్ మదన్‌లాల్ 0-3తో రిస్కాన్ (మాల్దోవా) చేతిలో ఓడిపోయాడు. -
ఈసారీ పతకం వచ్చేనా?
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగనున్నారు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఇటలీ ఆతిథ్యమిచ్చిన 2009 పోటీల్లో విజేందర్ సింగ్... అజార్బైజాన్ వేదికగా జరిగిన 2011 పోటీల్లో వికాస్ కృషన్ యాదవ్ భారత్ తరఫున కాంస్య పతకాలు సాధించారు. భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈసారి భారత బాక్సర్లు అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఐబా) పతాకం కింద పోటీపడతారు. ఆదివారం ఈ పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. భారత్ నుంచి ఐదుగురు బాక్సర్లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆసియా చాంపియన్ శివ థాపా (56 కేజీలు) నాలుగో సీడ్‌గా, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరితో పాటు నానో సింగ్ (49 కేజీలు), ఒలింపియన్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), ఆసియా గేమ్స్ రజత విజేత మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు)లకు కూడా తొలి రౌండ్లో బై లభించింది. దీంతో వీరంతా నేరుగా రెండో రౌండ్ బౌట్లో తలపడతారు. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ (75 కేజీలు) మాత్రం తొలి రౌండ్ నుంచే చెమటోడ్చనున్నాడు. ఈ నెల 17న జరిగే పోరులో స్వీడన్‌కు చెందిన హంపస్ హెన్రిక్సన్తో అతను తలపడతాడు. సోమవారం జరిగే పోరులో మదన్‌లాల్ (52 కేజీలు)... అలెగ్జాండ్రోస్ రిస్కన్ (మాల్దొవా)తో ఆడతాడు. ఈనెల 26 వరకు జరిగే ఈ పోటీల్లో 116 దేశాల నుంచి 550 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.