ఐటీ గమ్యం భాగ్యనగరం
2018లో ప్రపంచ ఐటీ సదస్సుకు వేదిక
ఆతిథ్యమివ్వనున్న రాష్ర్ట ప్రభుత్వం
విట్సా, నాస్కాం సంస్థల సంయుక్త నిర్వహణ
80 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు
పాలుపంచుకోనున్న ప్రపంచ దిగ్గజాలు
ఏర్పాట్లపై కేసీఆర్‌తో నాస్కాం ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యనగరానికి తన సత్తా చాటే మరో అద్భుత అవకాశం లభించింది. ఐటీ సేవలకు అంతర్జాతీయ కేంద్రంగా నిలిచేలా ప్రపంచ దేశాలను ఆకట్టుకునే సందర్భం వచ్చింది. ప్రతిష్టాత్మక ‘ప్రపంచ ఐటీ సదస్సు’కు హైదరాబాద్ వేదికగా నిలువనుంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సు 2018లో హైదరాబాద్‌లో జరగనుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికే షన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్(విట్సా), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కాం) సంయుక్తంగా ఈ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ) సమావేశాలను నిర్వహించనున్నాయి. దీనికి ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకువచ్చింది.
సదస్సు నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6 కోట్లు) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. ఈ సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై నాస్కాం అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో సీఎంతో చర్చించారు. డబ్ల్యూసీఐటీ-2018 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఈ సదస్సుకు సంబంధించిన వివరాలనుఐటీ మంత్రి కె. తారకరామారావు, నాస్కాం ప్రతినిధులు మీడియాకు వివరించారు.
దేశానికే గర్వకారణం..
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమల సంఘాల కన్సార్షియమైన విట్సా.. 1978 నుంచి ప్రపంచ ఐటీ సదస్సును నిర్వహిస్తోంది. దీనికి వేదికగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతుంటాయి. విట్సాలో భారత్ నుంచి నాస్కామ్ కూడా కీలక సభ్యత్వం కలిగి ఉంది. భారత్ తరఫున సదస్సు నిర్వహణకు నాస్కామ్ వేసిన బిడ్‌కు విట్సా ఆమోదం లభించింది. దీంతో ఆసియా దేశాల్లో రెండోసారి, భారత్‌లో తొలిసారి ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ ఐటీ సద స్సుకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కడం ఎంతో గర్వకారణమని నాస్కామ్ ప్రతినిధులు పేర్కొన్నారు. దేశంలో భౌగోళికంగా, మౌలిక వసతులపరంగా అత్యుత్తమ నగరమైన హైదరాబాద్‌నే సదస్సు నిర్వహణకు వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
సదస్సు ప్రత్యేకత..
ఐటీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతిక పరిణామాలపై కీలక చర్చలకు ప్రపంచ ఐటీ సదస్సు కేంద్రంగా నిలుస్తుంది. అగ్రగామి సంస్థలు, ప్రఖ్యాతిగాంచిన ఐటీ నిపుణులు తమ తమ విధానాలను, ప్రణాళికలను ఈ సదస్సు ద్వారా వెల్లడిస్తారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఈ సదస్సులో కీలక భూమిక వహిస్తాయి. సత్యనాదెళ్ల, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎరిక్ సమిడిట్, మైకేల్ డెల్, అమర్థ్యసేన్, థామస్ ఫ్రెడ్మిన్, బిల్‌గేట్స్, జాన్ చాంబర్స్, గయ్ కవాసాకి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజాలు ఈ సదస్సులో పాలుపంచుకోనున్నారు. ఈ సదస్సును నిర్వహించే దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
అంతర్జాతీయ గుర్తింపుతో పాటు వాణిజ్యపరంగానూ కొత్త అవకాశాలు లభిస్తాయి. గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచ ఐటీ సదస్సు-2014ను మెక్సికోలో నిర్వహించారు. దీనికి 73 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. 11 వేదికలపై 52 ప్రదర్శనలు, వెయ్యికిపైగా వాణిజ్య సమావేశాలను నిర్వహించారు. 2012లో కెనడాలో, 2008లో కౌలాలంపూర్(మలే సియా)లో జరిగిన సదస్సుల వల్ల ఆయా దేశాలకు భారీగా పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 2016లో ఈ సదస్సుకు బ్రెజిల్ వేదికకానుంది.
సీఎం ఆరోగ్యానికి ఢోకా లేదు
బ్రెజిల్లో జరిగే ప్రపంచ ఐటీ సదస్సు-2016 కు రాష్ట్రం తరఫున మంత్రులు, అధికారులతో కూడిన బృందాన్ని పంపుతాం. 2018లో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు అంతకన్నా మెరుగైన ఆతిథ్యమిచ్చేలా ప్రణాళికలు రూపొం దిస్తాం. రాష్ర్ట ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధులను పంపి వివిధ దేశాల ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తాం. సీఎం ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులు సరికాదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదు.
- కె. తారకరామారావు, ఐటీ శాఖ మంత్రి
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
భారత్‌లో ప్రపంచ ఐటీ సదస్సు నిర్వహణకు అవకాశం దక్కడం ఎంతో గర్వకారణం. దాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో బాగుంది. రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించాం. ప్రపంచ ఐటీ రంగానికి హైదరాబాద్ నగరం గమ్యస్థానం కానుంది.
- ఆర్.చంద్రశేఖర్, నాస్కాం అధ్యక్షుడు
హైదరాబాద్‌లోనే ఎందుకంటే..
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఐటీ పరిశ్రమకు హబ్‌గా ఉన్న భాగ్యనగరంలో పేరొందిన సంస్థలన్నీ తమ శాఖలను స్థాపించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఐటీ రంగానికి దన్నుగా నిలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యాధునిక హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలకు కొదువలేదు. ఆతిథ్యపరంగా, పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. ఈ ప్రత్యేకతల వల్లే మరో ప్రపంచ సదస్సును నిర్వహించే అవకాశం నగరానికి దక్కింది.
ప్రపంచ ఐటీ సదస్సు నిర్వహణ ద్వారా నగరానికి మరింత గుర్తింపు రానుంది. ఇది హైదరాబాద్ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలువనుం ది. ఈ సదస్సు కోసం సుమారు 80 దేశాల నుంచి 2500 మందికిపైగా ప్రతినిధులు నగరానికి తరలివస్తారని అంచనా. వీరు స్థానిక ప్రభుత్వంతోనూ, నాయకులతోనూ భేటీ కానున్నారు. వాణిజ్య సమావేశాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తాయి. వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. సరికొత్త టెక్నాలజీ, అత్యాధునిక పద్ధతులు, విధానాలు, ఈ-గవర్నెన్స్ తదితర అంశాల్లో రాష్ట్రానికే కాక దేశానికీ మార్గనిర్దేశకంగా ఈ సదస్సు నిలిచే అవకాశముంది.