breaking news
west godavari zp chairman
-
రాజీనామా చేస్తానన్న మంత్రి... దిగొచ్చిన బాబు
జెడ్పీ చైర్మన్ బాపిరాజుపై సీఎం ఆగ్రహం మిత్రపక్షంతో ఘర్షణ వైఖరి తగదని హితవు నష్ట నివారణ బాధ్యత కళా వెంకట్రావుకు అప్పగింత ఏలూరు : రాజీనామా చేస్తానన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యాఖ్యలతో దిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జెడ్పీ చైర్మన్ ముళ్ల పూడి బాపిరాజుపై మండిపడ్డారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ అక్షింతలు వేశారు. సమస్య పరిష్కార బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు, రెడ్డి సుబ్రహ్మణ్యంకు అప్పగించారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు, పడమర విప్పర్రు, అలంపురం గ్రామాల్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడానికి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బుధవారం ఏర్పాట్లు చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావుకు తెలియజేయలేదు. దీనిపై ఆగ్రహించిన మంత్రి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఆయన ఒక దశలో పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే ప్రచారం జరిగింది. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు రంగంలోకి దిగి సీఎం చంద్రబాబు ఎదుట పంచాయితీ ఏర్పాటు చే శారు. గురువారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఫిర్యాదుల కట్టతో సీఎం చెంతకుముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీకి వెళ్లేముందు జెడ్పీ చైర్మన్ బాపిరాజు పెద్ద కసరత్తే చేశారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీలు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రికి వ్యతిరేకంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను సేకరించి ఒక ఫైల్ తయారు చేశారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోక తప్పదని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారనే ఫిర్యాదులను సైతం సిద్ధం చేశారు. ముఖ్యంగా మైనారిటీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఎదుట ఉంచి పంచాయితీ చేయాలని భావించారు. అయితే, చంద్రబాబు అందుకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. బాపిరాజు తాడేపల్లిగూడెంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ‘నువ్వేం చెప్పవద్దు. గతంలోనే నీకు చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదు. మిత్రపక్షాన్ని కలుపుకుపోవాల్సిన సమయంలో సమస్యలు సృష్టించవద్దు’ అని గట్టిగా చెప్పడంతో బాపిరాజు మౌనం వహించినట్టు సమాచారం. ఇదిలావుండగా, జెడ్పీ చైర్మన్ తీరుపై మంత్రి మాణిక్యాలరావు తన వాదనను గట్టిగానే వినిపించినట్టు భోగట్టా. తాను నియోజకవర్గంలో లేని సమయంలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచారు. తాను మంత్రిని అయినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేననే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేపడుతున్న కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతున్నాయని మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించారు. -
ఇద్దరి మధ్య ‘ఇగో’ చిచ్చు
ఏలూరు : పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తహతహలాడాల్సిన టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ‘ఇగో’ సమస్యతో కత్తులు దూస్తున్నారు. ఎక్కడికక్కడ తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తాజా గా సోమవారం ఆ ఇద్దరూ ఇరు పార్టీల శ్రేణుల సమక్షంలోనే ఆరోపణలు గుప్పించుకున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయ శాఖ మం త్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మినిస్టర్ గారూ.. మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ఇలాగైతే ఎలా’గని అసహనం వ్యక్తం చేశారు. ‘టీడీపీ శ్రేణులను కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏం మాట్లాడుతున్నారు. 35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా’ అని మాణిక్యాలరావు ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వాగ్వాదం ముదిరి పరిస్థితి ఒకింత ఉద్రిక్తపూరితంగా మారడంతో మంత్రి శిద్ధా రాఘవరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు.