breaking news
water source nil
-
సాగుకు నీరివ్వలేం!
హెచ్ఎల్సీ కింద పంటలు వద్దు - నార్లు పోసుకుని నష్టపోతే మేం బాధ్యులం కాదు - టీబీ డ్యామ్ పరిస్థితిని అర్థం చేసుకోండి - డీఈఈ రామసంజన్న కణేకల్లు: ‘‘తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ దారుణంగా ఉంది. హెచ్ఎల్సీ ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు. వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తాం. రైతులు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.’’ అని కణేకల్లు హెచ్ఎల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న అన్నారు. స్థానిక హెచ్ఎల్సీ అతిథి గృహంలో శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో వర్షం సమృద్ధిగా కురవకపోవడంతో డ్యాంకు ఇన్ఫ్లో బాగా తగ్గిందన్నారు. ప్రస్తుతం నీటి మట్టం 1,613 అడుగులు కాగా.. 41.312 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దామాషా ప్రకారం హెచ్ఎల్సీకి వచ్చే నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయన్నారు. రైతులు ముందుగానే వరినార్లు పోసుకున్నాం.. నీళ్లివ్వండని డిమాండ్ చేసినా ఫలితం ఉండబోదన్నారు. అందుకు తాము బాధ్యులం కామన్నారు. కర్ణాటకలో శనివారం టీబీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారని.. ఆ తర్వాత నీటి విడుదల ఆధారంగా హెచ్ఎల్సీ కోటాను తీసుకుంటామన్నారు. ప్రత్యేకించి నీళ్లు తీసుకుంటే కర్ణాటక రైతులు జల చౌర్యానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఏఈఈ నరేంద్ర మారుతి మాట్లాడుతూ బోర్లు లేకపోతే పంటల జోలికి వెళ్లకపోవడమే మేలన్నారు. సాగుకు నీరివ్వలేమనే విషయాన్ని కరపత్రాలు, పత్రికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నాన్ ఆయకట్టును చూస్తూ ఊరుకోం ప్రస్తుత పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని.. అయితే నాన్ ఆయకట్టు రైతులు హెచ్ఎల్సీ నీటిని చోరీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, రైతులతో కలిసి షట్టర్లను ధ్వంసం చేసి అయినా నీళ్లు పారించుకుంటామని ఉద్దేహాల్ బ్రాంచ్ కాలువ టీసీ మెంబర్ అప్పారావు అన్నారు. హెచ్ఎల్సీ పొడవునా నాన్ ఆయకట్టు రైతులు కాలువ గట్ల మధ్యే పైపులు వేశారని.. యూటీల వద్ద కూడా పైపులు ఉన్నాయన్నారు. చాలా మంది పట్టపగలే కాలువపై మోటార్లు పెట్టి నీళ్లను చోరీ చేస్తూ దర్జాగు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆ విషయాన్ని మేం చెప్పలేం పంటలు సాగు చేయొద్దనే విషయాన్ని తాము ఆయకట్టు రైతులుకు చెప్పలేమని డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సాగునీటి కోసం రైతులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని.. ఈ క్రమంలో పంటలు సాగు చేయవద్దని ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. - కేశవరెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు -
పాతాళంలో జలం
- పేరుకే వర్షాకాలం - వెంటాడుతున్న వర్షాభావం - భారీగా పడిపోయిన భూగర్భజలాలు - తాజా నీటి మట్టం సగటు 26 మీటర్లు - ఎండుతున్న బోరుబావులు - చాలా గ్రామాల్లో తాగునీటి తప్పని తిప్పలు - మల్బరీ, పండ్లతోటలకూ నష్టం గత సంవత్సరం ఇదే సమయానికి భూగర్భజల మట్టం 17 మీటర్లు ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలమట్టం 26 మీటర్లు డేంజర్జోన్ ఉన్న ప్రాంతాలు ప్రాంతం మీటర్లు అగళిలో 83.64 గాండ్లపెంట 79.74 తలుపుల 72.37 లేపాక్షి మండలం శిరివరం 68.91 లేపాక్షి మండలం పులమతి 68.79 అమరాపురం 64.15 అమడగూరు మండలం మహమ్మదాబాద్ 61.21 బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 61.01 జలం పాతాళంలోనికి పడిపోయింది. వందల అడుగులు బోర్లు వేసినా పైకి రాలేనంటోంది. వర్షాకాలంలోనూ సరైన వానలు కురవకపోవడంతో ఈసారి భూగర్భజలమట్టం దారుణంగా పడిపోయింది.౾ గత సంవత్సరంతో పోలిస్తే 9 మీటర్ల లోతుకు పడిపోయింది. భూగర్భజలశాఖ జిల్లా వ్యాప్తంగా బోరుబావులతో అనుసంధానం చేసిన ఫిజోమీటర్లలో నమోదైన వివరాలు తీసుకుంటే తాజా నీటి మట్టం సగటు 26 మీటర్లుగా నమోదైంది. వర్షాకాలంలో 26 మీటర్లు అంటే పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు. - అనంతపురం అగ్రికల్చర్ వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో పాతాళగంగ రోజురోజుకూ మరింత లోతుకు పడిపోతోంది. 2016–17 సంవత్సరంలో జూన్, జూలై మినహా ఆగస్టు నుంచి వర్షాలు కురవకపోవడంతో నీటి మట్టం పడిపోయింది. గతేడాది సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా 40 శాతం తక్కువగా వర్షాలు పడటంతో 338.8 మి.మీగా నమోదైంది. దీంతో చాలా మండలాలు, గ్రామాల్లో భూగర్భజలాలు భూతద్ధం పెట్టినా నీటి చెమ్మ కనిపించే పరిస్థితి లేదు. ఈ ఏడాది కూడా జూన్లో 63.9 మి.మీ గానూ 59 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ కేవలం 2 మి.మీ నమోదైంది. అంటే ఇప్పటివరకు 84.4 మి.మీ గానూ 27.50 శాతం తక్కువగా 61.4 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు జిల్లాలో వరుణుడి జాడ కనిపించకపోవడంతో దాని ప్రభావం పాతాళగంగపై పడింది. అగళిలో 83.67 మీటర్లలో నీటి మట్టం జిల్లాలో తాజా సగటు నీటి మట్టం 26 మీటర్లుగా నమోదైనా... చాలా మండలాల్లో పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. అగళిలో ఏకంగా 83.64 మీటర్లలో నీటి చుక్క కనిపిస్తుండం ఆందోళన కలిగిస్తోంది. గాండ్లపెంట 79.74 మీటర్లు, తలుపుల 72.37 మీటర్లు, లేపాక్షి మండలం శిరివరం 68.91 మీటర్లు, అదే మండలం పులమతి 68.79 మీటర్లు, అమరాపురం 64.15 మీటర్లు, అమడగూరు మండలం మహమ్మదాబాద్ 61.21 మీటర్లు, బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 61.01 మీటర్లు, గుడిబండ మండలం మోరుబాగల్ 59.82 మీటర్లు, గోరంట్ల మండలం పులగూర్లపల్లి 58.82 మీటర్లు, మడకశిర మండలం ఆర్.అనంతపురం 57.88 మీటర్లు, సోమందేపల్లి మండలం చాలకూరు 57.21 మీటర్లు, పెనుకొండ 55.69 మీటర్లు, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర 54.94 మీటర్లు, రాప్తాడు మండలం మరూరు 51.64 మీటర్లు, హిందూపురం మండలం మణేసముద్రం 43.95 మీటర్లు, తాడిమర్రి మండలం పిన్నదరి 43.24 మీటర్లు, కుందుర్పి మండలం ఎర్రగుంట్ల 41.34 మీటర్లు, రొద్దం మండలం రాచూరు 40.42 మీటర్లు, తనకల్లు మండలం కొక్కంటిక్రాస్ 39.64 మీటర్లు, యాడికి మండలం కోనుప్పలపాడు 38.36 మీటర్లు, శెట్టూరు మండలం అనుంపల్లి 36.60 మీటర్లు, కనగానపల్లి మండలం మామిళ్లపల్లి 36.34 మీటర్లు... ఇలా చాలా మండలాలు, గ్రామాల్లో భూగర్భదలమట్టం దారుణంగా పడిపోయింది. ఎండుతున్న బోర్లు వర్షాలు లేక భూగర్భజల మట్టం తగ్గిపోవడంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల సంఖ్యలో బోరుబావులు ఉండగా గత వేసవిలోనే 70 నుంచి 80 వేల బోర్లు నీళ్లు రాక కట్టిపెట్టేశారు. వర్షాకాలం ఊరించినా ఫలితం లేకపోవడంతో ఇపుడు లక్షకు పైబడి బోర్లు ఎండుముఖం పట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని బోరుబావులు ఎండిపోవడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అరటి, బొప్పాయి, కళింగర, కర్భూజా, కూరగాయల పంటలు లాంటి స్వల్పకాలిక పంటలు అర్ధంతరంగా వదిలేస్తుండగా.. చీనీ, బత్తాయి, మామిడి, సపోటా, ద్రాక్ష, దానిమ్మ లాంటి దీర్ఘకాలిక పంటల విస్తీర్ణం సైతం కుదించుకుని అరకొర నీటితో తడుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వరి పంట జోలికి వెళ్లడం మానేసిన రైతులు ఇతరత్రా వ్యవసాయ పంటలు కూడా సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతో ఇంతో ఆర్థికంగా చేయూతను ఇస్తున్న ఉద్యానతోటలు ఈసారి రైతులను దెబ్బతీయగా, మల్బరీ పంట కూడా చాలా చోట్ల వదిలేయాల్సి రావడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి సైతం ఇక్కట్లు పడుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తూ భగీరథయత్నాలు చేస్తున్నా నీటి చుక్క కనిపించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.