breaking news
volunteers rescue
-
కేజ్రీవాల్ సాక్షిగా.. యువరైతు ఆత్మహత్య
-
కేజ్రీవాల్ సాక్షిగా.. యువరైతు ఆత్మహత్య
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చెట్టుకు ఉరేసుకుని గజేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. అతడిని గమనించిన ఆప్ వాలంటీర్లు వెంటనే చెట్టు ఎక్కి, అతడిని కిందకు దించారు. గజేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గజేంద్ర మరణించాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ తలపెట్టి.. ప్రారంభించింది. ఆ ర్యాలీలోనే గజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందినవాడినని చెప్పాడు. తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని, తనకు ముగ్గురు పిల్లలున్నా.. చేయడానికి పనేమీ లేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని ఆ లేఖలో అతడు అన్నాడు. కాగా, తమ ర్యాలీని భగ్నం చేయడానికే ఈ కుట్ర పన్నారని ఆప్ ఆరో్పించింది. గజేంద్రను వెంటనే చెట్టునుంచి కిందకు దించాలని పోలీసులకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. కాగా, తన ప్రసంగం ముగియగానే సీనియర్ నేత మనీష్ సిసోదియాతో కలిసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్పత్రికి వెళ్లి గజేంద్ర మృతదేహాన్ని సందర్శించారు.