breaking news
Visvasarayi Kalavit
-
గిరివాసుల దాహం తీర్చండి
సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె ఈ సమస్యను ప్రస్తావించారు. ఏటా గిరిజన మహిళలు చాలా ఇబ్బం దులు పడుతున్నారన్నారు. దూరంలో ఉన్న కొండవాగుల్లో నీటి కోసం నడిచి వెళ్తున్నారన్నారు. ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ట్యాం కుల ద్వారా సరఫరా చేస్తారో, ఎన్టీఆర్ సుజల ధార ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని పట్టుబట్టారు. గత సమావేశాల్లో 570 ఏజెన్సీ గ్రామాలలో 24 గ్రామాలకు రక్షిత పథకాలు ఏర్పాటు చేశారన్నారు. మిగతా గ్రామాలకు రక్షిత నీరు అందించాలని గుర్తు లేదా అని ప్రశ్నించారు. మహిళల దినోత్సవం రోజైనా మహిళల నీటి కష్టాలు తీరుస్తామని ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ బెల్టు షాపులను నిషేధించండి... మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారితపై చర్చలో పాల్గొంటూ బెల్టుషాపులను ప్రభుత్వం నిషేధించాలన్నారు. వీటి వలన ఎన్నో కుటుంబాలు నాశనమౌతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాటు సారా పేరుతో గిరిజనులను వేధించడం తగదన్నారు. సారా తయారీకి ప్రోత్సాహించేవారిని నియంత్రించలేకపోతున్నారన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం ఫీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాలు పూర్తిగా అమలు చేయకపోవడంతో పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మా ఇంటి మహలక్ష్మి పథకం కూడా అమలు జరగడం లేదన్నారు. ఏజెన్సీ వైద్యాధికారి పోస్టులను బర్తీ చేయాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అన్నారు. గిరిపుత్రిక కళ్యాణ పథకానికి నిధులు సరిగా కేటాయించడం లేదన్నారు. మైనర్బాలికా వివాహాలను అడ్డుకోలేకపోవడం వలన వారికి రావాల్సిన రాయితీలు కోల్పోతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరైనా గిరిజనులు చనిపోతే ఇంటికి ప్రైవేట్ వహానాల్లో తీసుకువస్తే రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లించాలన్నారు. -
సమస్యలే వారి సిరి
సిరికొండ.. పేరులోనే కొండను చేర్చుకున్న ఈ గిరిజన గ్రామం అక్కడి ప్రజల పాలిట సమస్యల గుదిబండగా మారింది. వెలగవాడ పంచాయతీ పరిధిలో, డివిజన్ కేంద్రమైన పాలకొండకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. ఇక్కడ అన్నీ సమస్యలే. తాగునీటికి నిత్యం తిప్పలే.. వీధి కాలువలు లేవు.. ఇళ్లు మంజూరు కావు.. పింఛన్లు అందవు... రేషన్ సరుకులు అందనే అందవు. అన్నింటికీ మించి గిరిజన గ్రామంగా అధికారిక గుర్తింపు లేదు. గ్రామంలో ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాథ.. సమస్యలు పరిష్కరించేవారు కాదు కదా.. కనీసం తెలుసుకొని ఓదార్చేవారే కరువైన ఆ గ్రామాన్ని ఒక ప్రజాప్రతినిధి సందర్శించారు. ప్రతి ఇంటి తలుపు తట్టారు. సమస్యలు పరిశీలించారు. గిరిజనంతో మమేకమై వారు చెప్పినవన్నీ ఓపికగా విన్నారు. వారి తరఫున పోరాడతానని భరోసా ఇచ్చారు. ఆమె మరెవరో కాదు.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి.. అందులోనూ ఎమ్మెల్యే హోదాలో కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిలిచిన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా గ్రామమంతా కలియదిరిగారు. ఆ వివరాలు నేటి వీఐపీ రిపోర్టర్‌లో.. కళావతి : ఏం బాబు నీరు పేరేంటి.. ఎలా ఉన్నారు?... రామారావు : ఏం చెప్పమంటారు. నా పేరు ఆరిక రామారావు. వార్డు సభ్యునిగా ఉన్నాను. మా గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో చేర్చకపోవడంతో గిరిజనులకు అందాల్సిన సౌకర్యాలు పొందలేకపోతున్నాం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నోటిఫైడ్ ఏరియాలో ఈ గ్రామాన్ని కలపాలని ఇప్పుడూ కోరుతున్నాం. కళావతి : ఏయే సౌకర్యాలు అందడం లేదు... రామారావు : ఏ అభివృద్ధి జరగడం లేదు. కాలువల నిర్మాణం, సీసీ రహదారుల నిర్మాణం లేదు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. కనీసం పాఠశాల భవనం కూడా మంజూరు చేయలేదు. పిల్లలు చదువులు మానేసి ఇంటిలోనే ఉంటున్నారు. వృద్ధుడి పింఛను కష్టాలు కళావతి(వృద్ధుడితో) : ఏం తాత ఇంకేటి సంగతులు?... పట్టయ్య : ఏం సెప్పనమ్మ.. రోడ్డు పుట్టనప్పుడు పుట్టినాను.. నాకు 45 సంవచ్చరాలంటూ పింఛను నిలిపేనారమ్మా... కళావతి : నీ వయసు ఎంత అంటావ్...? పట్టయ్య : నాను రాసుకోనేదమ్మా...కాకపోతే ఈ ఊరు వెలవకముందే పుట్టినాను. 95 సంవచ్చరాలు దాటి ఉంటాయని తెలుసు. కళావతి: పింఛను ఎందుకు తొలగించారో అడగలేదా...? పట్టయ్య : అడిగినానమ్మా...నాకు 45 సంవచ్చరాలేనని, కార్డులో రాసుకున్నారటమ్మా.. అందుకని పింఛను మరి ఇవ్వమని పెసిరెంటు బాబూ సెప్పినారు. సమస్యలపై ఆరా కళావతి : రేషన్‌కార్డులు అందరికీ ఉన్నాయా...? ఊయక చిన్నమ్మి: ముందు కార్డులు ఉండేవి. మా ఇంట్లో పిల్లలతో కలిసి నలుగురున్నాం. పోయిన నెలలో రేషన్ సరుకులు ఇవ్వనేదు. అడిగితే కార్డు పోయిందని చెప్పి నాలుగు కేజీలు ఈ నెలలో ఇచ్చినారు. కళావతి : కార్డు విషయమై ఎవరిని అడిగారు... చిన్నమ్మి: నాయుడు బాబు వద్దకు మూడుసార్లు ఎల్లినాను. మీ కార్డు పోయిందన్నారు. కొత్త కార్డు వచ్చేవరకు మేమేమీ సేయలేమన్నారు. కళావతి : గ్రామంలో తాగునీరు ఉందా?...కూలి పనులు దొరుకుతున్నాయా??.. చిన్నమ్మి: బోరు ఉన్నాది. అయితే నీరు సేదుగా ఉంటాది. కొండపై నుంచి వచ్చిన ఊట నీరు పట్టుకుని తాగుతున్నాం. జబ్బులు, జొరాలు తప్పడం లేదు. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారు. కళావతి : ఉపాధి పనులు లేవని ఎవరన్నారు?.. చిన్నమ్మి: కిందటి సంవచ్చరం పనులకు ఎల్లాం. వారానికి 500 నుంచి 600 రూపాయలు వచ్చేది. ఈ ఏడాది పనులు ఇయ్యాలని ఫీల్డ్ ఆపీసర్‌ను అడిగాం. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారని సెప్పారు. కళావతి : మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు...? చిన్నమ్మి: కొండపెకైల్లి కట్టెలు తీసుకొచ్చి పాలకొండలో అమ్ముతున్నాం. రోజుకు 40 నుంచి 50 రూపాయలు వస్తే సంతలో సరుకులు, బియ్యం కనుక్కొని జీవిస్తున్నాం. పొదుపు సొమ్ము లాక్కున్నారు కళావతి : డ్వాక్రా సంఘాలు ఎలా నడుస్తున్నాయి? గౌరి : గ్రామంలో రెండు సంఘాలున్నాయి. రుణమాఫీ చేస్తామనడంతో అప్పు తీరుతాదని కట్టడం మానేసినాం. దీంతో బ్యాంకోళ్లు ఇంతవరకు మేం పొదుపు డబ్బు తీసుకున్నారు. కళావతి : డబ్బులు ఎందుకు తీసుకున్నారని అడగలేదా? గౌరి :బ్యాంకు పుస్తకంలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకు వారిని అడిగాం. అప్పు కింద జమ సేసుకున్నామన్నారు. రుణ మాఫీ అయితే మా పరిస్థితి ఏమిటని అడిగితే ఇప్పట్లో మాఫీ రాదు, మీరు తీసుకున్న అప్పు చెల్లించకపోతే పోలీసు చర్యలు చేపడతామని బెదిరించినారు. కళావతి : గ్రామంలో పాఠశాల ఉందా. ఎంతమంది చదువుతున్నారు? బంగారమ్మ: ఊరిలో బడి ఉండేదమ్మా. పూర్తిగా పడిపోనాది. అప్పట్లో 20 మంది పిల్లలు సదివేవారు. ఇప్పుడు భవనం లేకపోవడంతో అటవీశాఖ భవనంలో చదువు సెబుతున్నారు. బడి లేకపోవడంతో పిల్లలు మాతో పాటు కొండ పనులకు వస్తున్నారు. పార్టీ మారితేనే సౌకర్యాలంట! కళావతి : ఈ సమస్యలపై ఎవరిని ఇంతవరకు అడగలేదా? కాంతారావు:ఇంతవరకు అధికారులు గానీ, నాయకులు గానీ రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. అందుకే తాగునీరు, కరెంట్, బడి, కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కళావతి : మీరెళ్లి ఎవరినీ కలవలేదా?... కాంతారావు:పాలకొండ ఎల్లాం. పింఛన్లు ఆపేశారని నాయకులను అడిగాం. పార్టీ మారితేనే పింఛన్లు వత్తాయని సెప్పారు. కళావతి : మీరు ఏ పార్టీలో ఉన్నారు...ఏ పార్టీలోకి మారమన్నారు? కాంతారావు: మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తెలుగుదేశంలోకి వస్తేనే రేషన్‌కార్డులు, పింఛన్లు వత్తాయని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. కళావతి : ఇళ్లు సగం గోడలతో ఎందుకు కనిపిస్తున్నాయి? కొండగొర్రె లక్ష్మణరావు: ఇందిరమ్మ గృహాలు ఇచ్చారు. కిందటేడు ఇళ్లు కట్టాం. 27 వేల రూపాయల బిల్లు ఇచ్చారు. మేము కూలి పనులు చేసుకుంటూ మరికొంత డబ్బు వేసి శ్లాబు వరకు కట్టాం. ఇప్పుడు బిల్లులు ఆపేశారు. కళావతి : ఫోటోలు తీయడానికి ఎవరైనా వచ్చారా? లక్ష్మణరావు: ఎవరూ రాలేదు. బిల్లులు అడిగితే తర్వాత ఇస్తామన్నారు. నెలలు దాటిపోతున్నా డబ్బులు అందకపోవడంతో పూరిపాకలోనే ఉంటున్నాం. కళావతి : ఇంకా ఎంత బిల్లు రావాలి? లక్ష్మణరావు: ఇంకా ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున బిల్లులు అందాల్సి ఉంది. ఇది చెల్లిస్తేనే శ్లాబులు వేసుకొని గుడిసెలను ఖాళీ చేయగలం.