breaking news
vishal thambe
-
తాయిలాల మయం!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే కార్పొరేషన్ బడ్జెట్ స్థాయీ సమితి అధ్యక్షుడు విశాల్ తాంబే మంగళవారం 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను సమర్పించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించినట్లు బడ్జెట్ ద్వారా స్పష్టం అవుతోంది. నగరవాసులపై ఎలాంటి పన్నులను పెంచకుండా నగర ప్రజలను ఆకర్షించే విధంగా పలు పథకాలకు శ్రీకారం చుట్టేందుకు బడ్జెట్లో చూపారు. పుణేను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, చారిత్రాత్మక నిర్మాణాలకు తిరిగి మెరుగులు దిద్దే విషయమై బడ్జెట్లో తాంబే ప్రాముఖ్యమిచ్చారు. ముఖ్యంగా నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రో, మోనోలకు బడ్జెట్లో నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఇలా ఉంది.. మెట్రోకు రూ.25 కోట్లు, మోనోకు రూ.15 కోట్లు, కొత్తగా కార్పొరేషన్లో చేరే 34 గ్రామాల అభివృద్ధి కోసం రూ.20 కోట్లు, ఎస్సీఎంటీఆర్ ఏర్పాటుకు రూ. ఏడు కోట్లు, బయోగ్యాస్, చెత్త నిర్మూలనకు రూ.6.20 కోట్లు, నగరంలో పేదల మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు, బాలభవన్‌లకు రూ. కోటి, బాలికల పాఠశాలలకు రూ.కోటి, రహదారుల అభివృద్ధికి రూ.557.81 కోట్లు, జోపిడిపట్టి పునరావాసం కోసం రూ.46.62 కోట్లు, పీఎంపీఎంఎల్కు రూ.27 కోట్లు, వాతావరణ కాలుష్య నివారణకు రూ.13 కోట్లు కేటాయించారు. నగరంలో కొత్తగా 34 గ్రామాలు విలీనం కావడంతో కనీస అవసరాలైన రోడ్లు, నీరు, ట్రాఫిక్, ఫ్లైఓవర్, చెత్త నిర్మూలన, డ్రైనేజ్ వ్యవస్థలకు ప్రాధాన్యం కల్పించారు. నగర ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతలో భాగంగా విద్యార్థులు, మహిళలు, పురుషులు, వృద్ధులకు ప్రత్యేకంగా పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా ఎల్బీటీ ద్వారా రూ.200 కోట్ల ఆదాయం, సాధారణ పన్నుల ద్వారా రూ.150 కోట్లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.100 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు, నీటి పన్ను, కట్టడాలు, ఇతర ఉత్పాదక వస్తువుల ద్వారా రూ.91 కోట్ల ఆదాయం చేకూరుతుందని కార్పొరేషన్ అంచనావేసింది. పెట్రోలు, మందులు, అప్పులను తిరిగి ఇవ్వడం, సేవక వర్గాల ఖర్చు సుమారు రూ.100 కోట్ల వరకు తగ్గించాలని బడ్జెట్లో పొందుపర్చారు. కాగా, కార్పొరేషన్‌కు ఎల్బీటీ ద్వారా 45 శాతం, నగరాభివృద్ధి చార్జీల ద్వారా 22 శాతం, పన్నుల ద్వారా 19 శాతం, ఇతరత్రా జమల ద్వారా 9 శాతం, జేఎన్ఎన్యూఆర్ఎంల ద్వారా 5 శాతం, నీటి పన్నుల ద్వారా 3 శాతం వనరులు కార్పొరేషన్‌కు సమకూరనున్నాయి. కాగా కార్పొరేషన్ అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టులకు 45 శాతం, సేవక వర్గానికి 20 శాతం, పెట్రోలు, ఇతర ఖర్చులకు 11 శాతం, జేఎన్ఎన్యూఆర్ఎం ఖర్చులకు 9 శాతం, ప్రాథమిక విద్యకు 3 శాతం, విద్యుత్ ఖర్చులు, నీటి సరఫరాకు, వార్డుల వారీ అభివృద్ధి పనులకు, అప్పులు, వాటిని తిరిగి చెల్లింపులకు, మొత్తం కలిపి 4 శాతం ఖర్చు చేయనున్నారు. -
విద్యకు పెద్ద పీట
పుణే: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నగర పాలక సంస్థ (పీఎంసీ) పాఠశాల బోర్డు కోసం రూ. 305 కోట్ల వార్షిక బడ్జెట్‌ను స్థాయీ సమితి ఎదుట ప్రవేశపెట్టింది. నగరపాలక సంస్థకు చెందిన పాఠశాల బోర్డుకు రూ. 300 కోట్లకంటే ఎక్కువ అధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ విషయమై స్థాయీ సమితి అధ్యక్షుడు విశాల్ తాంబే మాట్లాడుతూ ‘పాఠశాల బోర్డు రూ. 329 కోట్ల బడ్జెట్‌ను రూపొందించి దానిని పీఎంసీకి సమర్పించింది. అయితే పరిపాలనా విభాగం దానిలో కొన్ని సవరణలు చేసి రూ. 279 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను స్థాయీసమితి ముందుంచింది. ఏదిఏమైనప్పటికీ రూ. 305 కోట్ల మేర నిధులను కేటాయించాలని మేం నిర్ణయించాం. ఆమోదం కోసం దీనిని సర్వసభ్య సమావేశం ముందుంచాం’ అని అన్నారు. ఉద్యోగులకు రుణాలు పీఎంసీ సిబ్బంది సొంత ఇళ్లను నిర్మించుకోవడంతోపాటు వాహనాలు, కంప్యూటర్లను కొనుగోలు చేసేందుకు రుణ పథకం అందుబాటులోకి తీసుకురావాలని స్థాయీ సమితి ప్రతిపాదించిందని విశాల్ తాంబే తెలిపారు. రూ. ఆరు వేల గౌరవ వేతనం అందుకుంటున్న శిశు పాఠశాలకు చెందిన అధ్యాపకులకు మరో రూ. 1,000 మేర పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. ఇక పాఠశాల అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులకు కూడా వేతనాలను పెంచనున్నామన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనం కూడా పెంచనున్నామన్నారు.ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించామన్నారు. స్థానిక ప్రభాత్ రోడ్డులోని సన్‌డ్యూ అపార్ట్మెంట్లో ఇది ప్రారంభమవుతుందన్నారు. పాఠశాలల నిర్వహణ సజావుగా సాగేందుకుగాను కార్పొరేట్ సంస్థల మద్దతు కోరాలని బోర్డు ప్రతిపాదించిందని, ఇందులోభాగంగా ఇప్పటికే కొన్ని సంస్థలను సంప్రదించిందని, అందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు. ఐఎంపీని అనుకరించండి బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థను అమలు చేసే సమయంలో సమీకృత సంచార ప్రణాళిక (ఐఎంపీ)ని అనుకరించాలని నేషనల్ సొసైటీ ఫర్ క్లీన్ సిటీ (ఎన్‌ఎస్‌సీసీ) నగరపాలక సంస్థను కోరింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ ప్రతినిధులు ఇటీవల పీఎంసీతో సమావేశమైన సందర్భంగా నగర్ రోడ్డు, అలంది మార్గాల్లో బీఆర్టీఎస్ మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌సీసీ ఈ మేరకు పీఎంసీ కమిషనర్‌కు ఓ లేఖ రాసింది.