breaking news
Virasam leader varavara rao
-
వరవరరావు బెయిల్‌ను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ముంబై: విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు (81) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్ పిటిషన్‌ను ఆమోదించవద్దని కోరింది. ఎల్గార్ పరిషద్– కోరేగావ్ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అమ్జాద్ సయిద్ బెంచ్ ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయవాది అనిల్‌సింగ్ వాదించారు. ఈ సందర్భంగా వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్‌లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేశారు. -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
అడవికాచిన వెన్నెలేనా?!
శ్రీరమణగారి ‘అక్షర తూణీరం’ (అన్నలు మరణింపబడ్డారు?, సాక్షి, 29–10–16) చాలా ఆర్ద్రంగా ఉంది. ఆదివాసుల విల్లంబుల పట్ల అక్షర ఆవేదనగా ఉంది. ‘నరుడో భాస్కరుడా’తో పది పన్నెండు అడుగుల నడకతోటే ఆయన సౌజన్యానికి ముగ్ధుడైన తీరు భాస్కరరావు వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చింది. అయితే విప్లవోద్యమం దేవుణ్ని నమ్మడం వంటి మూఢ విశ్వాసం కాదు. అది ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసా’న్ని వివరించిన మార్క్సిజం నుంచి, పరస్పరం సంఘర్షించిన శక్తుల నుంచి నిర్మాణమైన, శాస్త్రీయ అవగాహనతో ప్రపంచాన్ని మార్చిన, మార్చగల తాత్విక సిద్ధాంతం. ఇది అడవి కాచిన వెన్నెల అయిందా? యాభై ఏళ్ల తరువాత బేరీజు వేస్తే ఫలితాలు నైరాశ్యాన్నే నింపుతున్నాయా? నక్సల్బరీ ఉద్యమమే కావచ్చు, ఇప్పుడు మావోయిస్టు ఉద్యమమే కావచ్చు ఎన్నెన్నో త్యాగాల, అమరత్వాల పునాదులపై నిర్మాణమైనవే. కాసేపటి కోసం ఈ రాజ్యాంగంలో, ఈ శాసనసభల్లో, చట్టాల్లో విశ్వాసం ఉన్న వాళ్ల దృష్టితోటే బేరీజు వేసుకుందాం. శ్రీకాకుళ రైతాంగ పోరాటం 1971 నాటికే దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ ఉద్యమ ఫలితమే 1/70 చట్టం. ఆదివా సులకు అటవీభూమి మీద అధికారాన్ని ఇచ్చే చట్టం. ఇవాళ అది కాగితాలకే పరిమి తమైపోవడానికి కారణాలు రమణగారు చూస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి బీడీ శర్మ కృషి వల్ల వచ్చిన బూరియా రిపోర్ట్, బీడీ శర్మ, శంకరన్ వంటి వాళ్ల కృషి వల్ల వచ్చిన పెసా (పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ యాక్ట్) వంటివన్నీ తూర్పు, మధ్య భారతాల్లో విప్లవోద్యమ పోరాటాలతో వచ్చినవే. మరొక పార్శ్వం చూద్దాం. ఏ నక్సల్బరీ ప్రస్తావనైతే రమణగారు తెచ్చారో ఆ నక్సల్బరీ తిరిగి పీపుల్స్‌వార్ రూపంలో బెంగాల్లో తెలంగాణ నుంచి ప్రవేశించిన తరువాత రాష్ట్ర ఉద్యమంగా ఎగి సింది. బుద్ధదేవ్ కాలానికి భూమిలేని, సన్నకారు రైతులకు భూములు పంచడానికి నక్సల్బరీ నేపథ్యంలో అమలు చేస్తూ వచ్చిన ‘ఆపరేషన్ బర్గా’ కూడా విఫలమై 2009 నాటికి అది ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’గా మారింది. ఆపరేషన్ బర్గా కింద ఆదివాసుల కోసం కేటాయించిన 4,500 ఎకరాల అడవిని మరో ఐదు వందల ఎకరాలు కలిపి బుద్ధదేవ్ ప్రభుత్వం జిందాల్ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇచ్చే సింది. కాని అక్కడ ఉక్కు కర్మాగారం సాధ్యం కాకపోవడానికి మావోయిస్టు ఉద్యమమే కారణం. అక్రమాలను ఆపినదెవరు? బైలదిల్లా ఇనుపరజం తవ్వకాల తరువాత అప్పుడు అక్కడ ప్రవేశించిన ఎన్ఆర్ కంపెనీ తప్ప మరే బహుళజాతి కంపెనీ గానీ, బడా కంపెనీ గానీ ప్రవేశించలేక పోతున్నాయంటే 1980లో అక్కడ పీపుల్స్‌వార్‌గా ప్రవేశించి, 1995లో గ్రామ రాజ్యా లతో ప్రారంభించి ఆదివాసి, దళిత మొదలైన విప్లవకర వర్గాల ఐక్య సంఘటనతో పదేళ్ల క్రితమే అక్కడ ఏర్పడిన జనతన సర్కారే కారణం. ఇందుకు ఇప్పటికి కనీసం ఆరు వేల మంది ప్రజలు, విప్లవకారులు బలిదానాలు ఇచ్చారు. వందలాది మహిళలు లైంగిక అత్యాచారానికి గురయ్యారు. అభియాన్లు, సాల్వాజుడుం మొదలు 2009 మొదలైన ఆపరేషన్ గ్రీన్‌హంట్ నుంచి మూడు దశలు దాటి ఇప్పుడు మిషన్ 2016 పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజలపై యుద్ధాన్ని ప్రజాయుద్ధంతో ప్రతిఘటిస్తున్నారు. శ్రీకాకుళ ఉద్యమం ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు విప్లవోద్యమంగా మారింది. అపూర్వమైన నారాయణపట్నా ఉద్యమం అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధమైన నియాంగిరి, పోస్కో వ్యతిరేక పోరులలో మావోయిస్టుల నాయకత్వం క్రియాశీల భూమిక వహించింది. ఆ కక్షతోనే మావోయిస్టు పార్టీ దళ నాయకుడు శ్రీనివాసరావును ఆం్ర«ధా గ్రేహౌండ్స్ ఎన్‌కౌం టర్లో చంపేశారు. ఆయన రాజమండ్రిలో ఆర్టీసీ వర్కర్‌గా పనిచేసి నియాంగిరి వెళ్లారు. ఆయన సహచరి కామేశ్వరి కూడా ఆర్టీసీలో పనిచేసి ఇప్పుడు ఏవోబీ ఉద్యమంలో ఒక స్థాయి నాయకత్వంలో ఉన్నది. ఈ అక్టోబర్ 24నాటి మారణకాండ మృతుల్లో ఆమె కూడా ఉన్నదేమోనని మేం అక్కడ పదకొండు మంది స్త్రీల శవాలున్న పెట్టెలు తెరిపించి చూశాం. అందులో తల వేరు చేయబడిన స్త్రీ శవాన్ని చూశాం. ఇప్పుడు ఏవోబీలోని ఉత్తరాంధ్ర గురించి, ఇరవై ఏళ్ల విప్లవోద్యమం అడవిలో వెన్నెల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కాలమంతా ఒక ఐదున్నరేళ్ల వ్యవధితో చంద్రబాబు పరిపాలన కాలం. 1990 ఆగస్ట్‌లో వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయన అధికారానికి రాగానే తాను ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నని ప్రకటించుకున్నాడు. సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ మీద తిరిగి నిషేధం విధించి, సారా నిషేధం, సబ్సిడీలు ఎత్తేసి తెలుగు నేల మీద నెత్తురు పారించాడు. ఒక రాజ్య విధానంగా కోవర్టు హత్యలు ప్రారంభించాడు. 2000లో విశాఖపట్నం చింతపల్లి అడవుల్లో దుబాయ్‌కి చెందిన బాక్సైట్ కంపెనీతో ఎంఓయూ చేసుకుని చంద్రబాబు ఇవ్వచూపాడు. అప్పుడు మొదలైంది ఈ పాలక బాక్సర్తో ప్రజల బాక్సైట్ రక్షణ యుద్ధం. సుప్రీంకోర్టు సమతా తీర్పులో రాజ్యమంటే కూడా ప్రైవేట్ వ్యక్తి అని స్పష్టం చేయడంతో ఆదివాసుల అనుమతి లేకుండా అటవీభూమి తీసుకోవడానికి సాధ్యం కాదని తెలిసి రాజ్యాంగాన్నే సవరిం చడానికి ప్రయత్నం చేశాడు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాడు. మూడు లక్షల మంది ఆదివాసులను ముంచే పోలవరం ప్రాజెక్టు, మత్స్య కారుల జీవన విధ్వంసానికి కారణమైన కోస్టల్ కారిడార్, పర్యావరణ విధ్వంస కారకమైన పవర్ ప్లాంట్లు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టాడు. ఒక్కటే మిటి అమరావతి కోసం భూముల ఆక్రమణ సహా రెండేళ్ల పాలన అంతా హింసా విధ్వంసాలే. ఇది శేషాచలం అడవుల్లో ఇరవై ఒక్కమంది ఆదివాసులను, దళితులను చంపడంతో ప్రారంభమైంది. చర్చల ప్రస్థానం ఈ పదహారేళ్లలో ఆదివాసులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆపింది లేదు. పాడేరు కేంద్రంగా ఎంత మిలిటెంట్ ఉద్యమం చేశారంటే అందుకోసం వాకపల్లి, భల్లగూడ ఆదివాసీ మహిళలు గ్రేహౌండ్స్‌ల చేతుల్లో లైంగిక అత్యాచారాలకు గురికావాల్సి వచ్చింది. అందుకే ఇది ఆపరేషన్ ఆర్కే కాదు, మైనింగ్ మాఫియా ఆపరేషన్. ఇది గ్రీన్‌హంట్ ఆపరేషన్ మూడవ దశ దాటి మోడీ – చంద్రబాబుల పథకంగా ఇవాళ ఉత్తరాంధ్రలో అమలవుతున్న మిషన్ 2016. 1995లో చంద్రబాబు అధికారానికి వచ్చిన ఏడాది రెండేళ్లకే గ్రామ గ్రామాన పోలీసు క్యాంపు వల్ల లక్షలాది ఎకరాల భూములు పోడుగా మారిన స్థితిలో కన్సర్న్స్ సిటిజన్స్ కమిటీ (సీసీసీ) ఏర్పడింది. దాని ఏకైక ఎజెండా ప్రభుత్వంతో విప్లవ పార్టీలు, ముఖ్యంగా పీపుల్స్‌వార్– చర్చలు జరపాలి. ఇదే సమయంలో శాఖమూరి అప్పారావు జైలు నుంచి వేసిన ఒక పిటిషన్ మీద జస్టిస్ ఎం.ఎన్. రావు ఒక ఆసక్తిక రమైన పరిశీలన చేశారు. ‘‘ఇంతకాలమూ మనం నక్సలైట్లను ఒక సమస్యగా చూస్తున్నాం. ప్రజలు మాత్రం ఒక పరిష్కార మార్గంగా చూస్తున్నట్లున్నారు. మనం కూడా గాంధీయిజం లాగ, అంబేడ్కరిజం లాగ మావోయిజాన్ని కూడా ప్రజల ముందున్న ఒక పరిష్కార మార్గంగా ఆమోదించగలిగినప్పుడు మాత్రమే అందుకు పరిష్కారాన్ని కూడా వెతకగలుగుతాం’’ అనే అర్థంలో ఆ తీర్పు వెలువడింది. దాంతో చంద్రబాబును సీసీసీ చర్చలకు ఒప్పించగలిగింది. పార్టీ కేంద్ర, ఆంధ్ర కమిటీల నాయకత్వం శ్యాం, మహేష్‌లతో మొదటి దఫా, ఆర్కె మొదలైన వాళ్లతో రెండో దఫా శంకరన్, పొత్తూరి, కన్నబిరాన్, హరగోపాల్, డి. నరసింహారెడ్డిలు మాట్లాడారు. కె. రామచంద్రమూర్తి లాంటి వాళ్లు మీడియా ద్వారా ప్రజాభిప్రా యాన్ని కూడగట్టారు. భూసంస్కరణలు అమలైతే నక్సలైట్ ఉద్యమం ఉండదని ముఖ్యంగా శంకరన్ ఆశించాడు. బడుగువర్గాల నుంచి వచ్చిన దేవేందర్‌గౌడ్ హోంమంత్రిగా, పేర్వారం రాములు డీజీపీగా ఉన్న కాలం తొమ్మిది నెలలే అని, అప్పుడే చర్చలు జరిగి, శాంతి నెలకొనాలని పొత్తూరి గారు చెప్పినప్పుడు ‘‘వ్యక్తుల నేపథ్యాలు, మంచి చెడ్డలు కాదు. వ్యవస్థను బట్టి వర్గపోరాట రాజకీయాలుంటాయి. మేం ఆ భ్రమలతో చర్చ లకు ఒప్పుకోవడం లేదు. ప్రజలు కోరుతున్నారు, ప్రజాస్వామ్య వాదులుగా మీ పట్ల మాకు గౌరవం ఉంది. అందుకని వస్తాం’’ అని ఆర్కే చెప్పాడు. విధి విధానాలు నిర్ణయించడానికి నన్ను, గద్దర్‌ను ప్రతినిధులుగా ప్రకటించింది. 2002 జూన్ 5, 9, 20 తేదీలలో మూడు దఫాలుగా విధి విధానాల నిర్ణయం కోసం ప్రభుత్వ ప్రతినిధులు విజయరామారావు, తమ్మినేని సీతారాంలతో చర్చలు జరిగాయి. ఆర్కె పంపిన ప్రతిపాదనలను విజయరామారావు ఆదేశిక సూత్రాల (డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ)తో పోల్చాడు. కాని ఆచరణలో మాత్రం ఈ మూడురోజులూ ఎన్కౌంటర్లు జరిగాయి. జూలై 2న ఈ చర్చల్లో పాల్గొనడానికే వస్తున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత ఎన్కౌంటర్ హత్యతో పార్టీ చర్చల్లో పాల్గొనే ప్రతిపాదనను వెనక్కి తీసుకొంటూ జూలై 19న ప్రకటన చేసింది. వాస్తవానికి జూలై 20న పార్టీ నాయకత్వం బహుశా ఆర్కె, పటేల్ సుధాకర్‌రెడ్డి చర్చ లకు రావాలి. ఇక్కడి నుంచి చర్చల ఆకాంక్ష ప్రజాస్వామ్యవాదుల్లోనూ, ప్రజల్లోనూ మరింత తీవ్రమై 2004 ఎన్నికలకు అది ప్రాతిపదిక అయింది. ముందస్తు ఎన్నికలు ప్రకటించిన చంద్రబాబు 2004 ఎన్నికలను రెఫరెండం అన్నాడు. మళ్లీ గెలిõ¯్త ప్రపంచ అభివృద్ధి నమూనానే అమలు చేస్తానని, నక్సలైట్లది శాంతి భద్రతల సమస్యగానే చూస్తానని, ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. వైఎస్ఆర్ నాయ కత్వంలోని కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ, 2001లో ఏర్పడ్డ తెరాస వరకు, ఇందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నాయి. 2004 మే 14న కొత్త ప్రభుత్వం ఏర్పడి జానారెడ్డి హోంమంత్రి అయిన దగ్గర నుంచి 2005 జనవరి 8న చైతన్య మహిళా సంఘం కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి ఎన్కౌంటర్ హత్య దాకా ఆ కాలమంతా ఈ చర్చల్లో కీలక వ్యక్తి అప్పటి మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కె. ఆయనతో పాటు ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చినవాడు గాజర్ల రవి అలియా¯Š గణేష్ (ఇప్పుడు ఉదయ్‌గా ఏఓబీ కార్యదర్శి). ఆ ఇద్దరూ ఈ ఎన్కౌంటర్ పేరిటి మారణ కాండలో ఏమయ్యారో తెలియదు. ఆర్కె గాయపడి పోలీసుల అదుపులో ఉన్నాడనీ, అక్కడికక్కడ మరణించిన ఏడుగురిలో ఒకరనీ ఊహాగానాలు జరుగుతున్నాయి. అంతకు ముందురోజే (అక్టోబర్ 23) ఆయన తప్పుకొని ఉండకపోతే ఇంక అక్టోబర్ 24 నుంచి ఆయన గ్రేహౌండ్స్ చక్రబంధంలోనే ఉన్నాడు. 2004 అక్టోబర్‌లో నాలుగు రోజుల చర్చలలో రెండే ప్రధానాంశాలు. 1) ప్రజా స్వామిక హక్కుల పరిరక్షణ, 2) భూసంస్కరణలు. ఈ చర్చలకు మావోయిస్టు పార్టీతో పాటు సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర నాయకులు అమర్, రియాజ్‌లు పాల్గొన్నా, మొత్తం బృందానికి నాయకుడు ఆర్కె. జనశక్తి పార్టీ తరఫున చర్చలలో పాల్గొన్న రియాజ్‌ను 2005 జూలై 2న కాచీగూడ ష్రాఫ్ ఆసుపత్రి దగ్గర ముగ్గురు సహచరులతో పాటు అరెస్టు చేసి, కరీంనగర్ జిల్లా బదన్‌కల్ అడవుల్లో చంపేశారు. చర్చల దౌత్యాన్ని కూడా కాదని ఇటువంటి హత్యాకాండకు పూనుకోవడం రెండోసారి. ఈ స్వేచ్ఛ వారి పోరాటాల ఫలితమే ఈ పన్నెండేళ్ల పరిణామం ఏమిటంటే, పార్లమెంటరీ రాజకీయ పార్టీల పతనం నిషేధిత పార్టీలతోనైనా సరే చర్చించే రాజకీయ స్థాయి నుంచి ఆ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని, శ్రేణులను, వారు నాయకత్వం వహిస్తున్న ఆదివాసులను ఆపరేషన్ హరిభూషణ్ పేరుతో, ఆపరేషన్ ఆర్కె పేరుతో చంపడమే లక్ష్యంగా ప్రారంభమైంది. ఇప్పుడంతా మైనింగ్ మాఫియా మిషన్లు. కంపెనీల ప్రయోజనాలు. ఇందుకోసం ప్రజల మీద యుద్ధం. ఇది యుద్ధమే కనుక చంపుతం అంటారు. బలిమెలకు ప్రతీ కారం అంటారు. మీరు పాటించనప్పుడు మాకెందుకు రాజ్యాంగం, చట్టాలు అంటారు. కాని దీన్ని ప్రజాస్వామ్యం అనుకోమంటారు. అందుకు రాజీ పడకపోతే నరసంహారం చేస్తామంటారు. అప్పుడది; అవును, అడవిలో కాచిన వెన్నెల అనిపిస్తుంది. కాని, ఈ భూమి పుట్టి మనిషి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద ఆదిమ మానవుల నుంచి ఆదివాసీ సమాజాలు ఈ అడవిని తమ కోసం కాక, మన కోసం, భావి కోసం త్యాగాలతో, పోరాటాలతో కాపాడి ఉండకపోతే మనం ఇట్లా ఉండగలిగే వాళ్లమేనా? ఇట్లా రాయగలిగే వాళ్లమేనా? తెలతెలవారగానే తెలిరేకల వలె రాలిపోతున్న ఆ విప్లవ కారులు వెదజల్లిన వెన్నెలలను అనుభవిస్తూ కూడా వృథా అనుకుందామా? నైరాశ్యా నికి గురవుదామా? ఇది మన ప్రజాస్వామ్య విలువలకు, చైతన్యానికి పరీక్ష అని ఏమైనా స్పందిద్దామా? (వ్యాసకర్త : వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు ) -
జయశంకర్ కలలుగన్న తెలంగాణ రావాలి
విరసం నాయకుడు వరవరరావు హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి దాకా కొత్తపల్లి జయశంకర్ పోరాడారని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర నాయకుడు వరవరరావు అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని శనివారం హన్మ కొండలోని జయశంకర్ స్మృతి వనం (ఏకశిల పార్కు)లో జయశంకర్ విగ్రహానికి వరవరరా వు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. లాబీ యింగ్, ఆత్మహత్యలతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. దారులు వేరైనా తాను, జయశంకర్ ఈ దిశగా పోరాటం చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆర్ఎస్ఎస్ నుంచి రాడికల్స్ వరకు ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా పని చేస్తానని చెప్పి జయశంకర్ ముందుకు వెళ్లారన్నారు. జయశంకర్, కాళోజీ, బియ్యాల జనార్దన్‌రావు కలలుగన్న తెలంగాణ రావాల్సి ఉందన్నారు. తాను మావోయిస్టు పంథాలో పోతే, జయశంకర్ గాంధేయ మార్గం లో వెళ్లారని చెప్పారు. మా ఇద్దరివి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలని వరవరరావు తెలిపారు. మార్గదర్శకుడు జయశంకర్ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఈ తరం చేసిన మహోన్నత పోరాటానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ మార్గదర్శకుడిగా నిలిచారని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని జయశంకర్ స్మృతివనంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి.. స్పీకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆచార్య జయశంకర్ మహోన్నతమైన వ్యక్తి గొప్ప కాలజ్ఞాని అని కొనియాడారు. ఆయన పుట్టిన గడ్డ మీద పుట్టడం, ఆయన శిషు్యడిగా, తెలంగాణ ఉద్యమంలో అతని వెన్నంటి పనిచేయడం ఎంతో అదృష్టమన్నారు. తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తే అన్యాయం జరుగుతుందని ముందే చెప్పిన కాలజ్ఞాని అని కొనియాడారు. అక్కంపేటలో నివాళి.. ఆత్మకూరు : జయశంకర్ పుట్టిన ఊరు అక్కంపేటలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్ విగ్రహానికి డిప్యూటీ æసీఎం కడియం శ్రీహరి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. అక్కంపేట పాఠశాలకు 12 గదులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే అక్కంపేటకు సీసీ రోడ్ల కోసం తాను రూ.20 లక్షలు, ఎంపీ దయాకర్ ద్వారా రూ.10 లక్షలు ఇస్తామని, అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చడానికి కృషిచేస్తానని, జయశంకర్ సార్ జ్ఞాపకార్థం కమ్యూనిటీహాల్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ జయశంకర్‌సార్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అకడమిక్ పాఠాలతోపాటు తెలంగాణ పాఠాలను చెప్పేవాడని గుర్తుచేశారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ అక్కంపేట అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయసాధనకు ప్రతిఒక్కరు పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొద్దిరోజుల్లో అక్కంపేటకు రానున్నారని తెలిపారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ అక్కంపేట గ్రామాన్ని తాము దత్తత తీసుకున్నామని, గ్రామంలో ప్రజల సహకారంతో 25వేల మొక్కలు నాటామని వివరించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, ఆర్డీఓ వెంకటమాధవరావు, డీఎఫ్ఓ పురుషోత్తం, ఎంపీపీ గోపు మల్లికార్జున్, సర్పంచ్ కూస కుమారస్వామి, తహసీల్దార్ డీఎస్.వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్ఎస్ నాయకులు ధర్మరాజు, జాకీర్‌అలీ, కేశవరెడ్డి, బుచ్చిరెడ్డి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్వేచ్ఛ కావాలి
విరసం నేత వరవరరావు హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయాలపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవేదన వ్యక్తంచేశారు. 4 దశాబ్దాలుగా అమలవుతున్న ఎమర్జెన్సీ నిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం అనే పేరుతో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం సభ నిర్వహించారు. కార్యక్రమంలో వరవరరావు మాట్లాడుతూ.. 1948లోనే తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ అనుభవించారని గుర్తుచేశారు. వర్గ సమాజం, వర్గ పోరాటంలో ఎమర్జెన్సీ ఒక పేజీ మాత్రమేనన్నారు. నక్సల్బరి రాజకీయాల ప్రభావంతో అవినీతి వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయని, ఈ ఉద్యమాలలో పార్లమెంటరీ రాజకీయాలను విశ్వసించే వారు సైతం పాల్గొన్నారన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్వేచ్ఛ కావాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేటప్పుడు సెక్షన్ 8 కు ఒప్పుకోకుండానే తెలంగాణ ఇచ్చిందా.. హైదరాబాద్‌పై అధికారాలు పదేళ్లు ఉన్న విషయాన్ని ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ రోజు సెక్షన్ 8పై గవర్నర్ అధికారాలపైనా... ప్రజలను మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితనం లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వికారుద్దీన్‌ను హత్య చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇంకా నిలబడి ఉన్నాయన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి ముందుకు పోవడానికి అనేక ఉద్యమాలు జరిగినా సఫలం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ తర్వాతనే పౌరహక్కుల సంఘం నేతలు ఎక్కువగా హత్యలకు గురయ్యారన్నారు. సభకు పౌర హక్కుల సంఘం నగర అధ్యక్షుడు పీఎం రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు.