నేను క్యాస్టిస్టును కాదు..
♦ నాపై ఎలాంటి మరకలు లేవు: హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ
♦ నేటి నుంచి రీసెర్చ్ వర్క్, రేపటి నుంచి తరగతులు
హెచ్‌సీయూలో రోహిత్‌తోపాటు నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన కమిటీకి తానే అధ్యక్షుడినని.. అయినా తాను క్యాస్టిస్టును కాదని, తనపై ఎటువంటి మరకలూ లేవని ఇన్చార్జి వీసీ విపిన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌సీయూ కెమిస్ట్రీ డీన్ దుర్గాప్రసాద్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, మెడికల్ సెన్సైస్ డీన్ వేముగంటి గీతలతో కలసి శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు.
హెచ్‌సీయూలో తరగతులు ప్రారంభించేందుకు జేఏసీ నుంచి సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఇంత వరకు వారి నుంచి స్పష్టమైన అంగీకారమేమీ అందలేదన్నారు. రోహిత్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసిన కమిటీకి తానే అధ్యక్షుడినని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2008లో తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో తాను డీన్‌గా ఉన్నానని చెప్పారు.
కానీ ఆ ఘటనకు సంబంధించి తనపై ఎటువంటి మరకలు లేవని, కమిటీలు క్లీన్చిట్ ఇచ్చాయన్నారు. అసలు హెచ్‌సీయూలో కుల వివక్ష ఉందా, లేదా అని విలేకరులు ప్రశ్నించగా... తాను 36 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాననీ, తనకు అటువంటిదేమీ కనిపించలేదని పేర్కొన్నారు. తాను క్యాస్టిస్టును కాదని, తనపై ఎటువంటి మరకలూ లేవని చెప్పారు. అయితే గతంలో జరిగిన ఆత్మహత్యలపై చర్చ జరగాల్సి ఉందని, అధ్యాపకులను సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. కేవలం హెచ్‌సీయూలోనే కాదని దేశవ్యాప్తంగా వర్సిటీల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే దళితులే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించగా... అందుకు అనేక కారణాలుంటాయంటూ దాటవేశారు. విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం తమ పరిధిలో లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, 50 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటివేవీ యూనివర్సిటీ చేతిలో లేవని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేసే అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. మొత్తం పదకొండు మంది డీన్లు విద్యార్థులతో చర్చించారని, తరగతులు ప్రారంభించేందుకు వారు అంగీకరించారని శ్రీవాస్తవ చెప్పారు. అయితే అలా హామీ ఇచ్చిన విద్యార్థి నేతలెవరో చెప్పాలని కోరగా... ఇంకా నిర్దిష్టమైన హామీ ఏమీ రాలేదని తెలిపారు.