నమీబియా క్రికెటర్ మృతి
విన్డోక్ (నమీబియా): ఇటీవల క్రికెట్ మైదానంలో గుండెపోటుకు గురైన నమీబియాకు చెందిన రేమండ్ వాన్ స్కూర్ (25) చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. గత ఐదు రోజులు క్రితం క్రికెట్ ఆడుతుండగా తీవ్ర అస్వస్థతతో ఆస్పతి పాలైన రేమండ్.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. నమీబియా, ఫ్రీ స్టేట్ జట్ల మధ్య ఆదివారం జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్‌లో రేమండ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా విరామం కోరాడు. అనంతరం మంచి నీళ్లు తాగగానే అతను ఒక్కసారిగా కింది పడిపోయాడు. దీంతో అతనిని సహచరులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రేమండ్ తుది శ్వాస విడిచాడు. అతను మృతి చెందిన విషయాన్ని నమీబియా అధికారులు శనివారం ధృవీకరించారు.
రేమండ్ తన కెరీర్ లో అన్ని ఫార్మెట్లు కలిపి ఇప్పటివరకు నమీబియా తరపున 265 మ్యాచ్ లు ఆడాడు. అందులో 92 ఫస్ట్‌క్లాస్, 103 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఉన్నాయి. అతను ఓవరాల్ గా 8,000కు పైగా పరుగులు చేశాడు. అతని మృతి పట్ల నమీబియా క్రికెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్రికెట్ ప్రపంచం నిజమైన పోరాట యోధుడ్ని కోల్పోయిందంటూ సానుభూతి తెలిపింది.