breaking news
vallapu reddy
-
వల్లపురెడ్డి సాహిత్యం
సమగ్ర సాహిత్యం సామాజిక, ఆర్థిక, మానసిక సంఘర్షణల నేపథ్యంలో, సాంప్రదాయిక సాహిత్య ప్రతిభతోపాటు, ఆధునిక సాహిత్య సాంగత్యంతో అద్భుత శిల్ప నైపుణ్యం గల కథానిక రచన చేసిన రచయిత వల్లపురెడ్డి బుచ్చారెడ్డి. ఈ మధ్యనే ఆయన రచనలన్నీ వల్లపురెడ్డి సాహిత్యంగా రెండు భాగాలుగా వెలువడ్డాయి. కథలు మొదటిభాగం. కవితలు, వ్యాసాలు, పరిష్కరణలు రెండవభాగం. వల్లపురెడ్డి కథలు 1954-1967 మధ్య తెలుగు స్వతంత్ర, స్రవంతి, ఆంధ్రప్రభ వారపత్రిక, శారద, ఉదయభాను, భారతి పత్రికల్లో 52 వరకు ప్రచురించబడ్డాయి. అందులో ఉపలబ్ధమైన 35 కథలతో సంపుటి వెలువడింది. కథలన్నీ మానవతావాద ప్రతీకలే. మనోవైజ్ఞానిక సిద్ధాంత ప్రతిపాదనలే. క్లిష్ట సామాజిక చట్రంలో మనుషుల ప్రవర్తన ఎలావుంటుందో భావశబలతతో చిత్రించారు. శైలి అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. సంప్రదాయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయడం వల్ల అక్కడక్కడ దీర్ఘసమాసాలు, వాడుకలో లేని పదాలు దర్శనమిస్తాయి. అయినా అవి కథాగమనానికి ఏమాత్రం ప్రతిబంధకం కావు. 35 కథలు సన్నివేశాల్లో కానీ, సమస్యల్లో కానీ వేటికవే ప్రత్యేకత కలిగివుంటాయి. ఇక, రెండవసంపుటి ‘మధుగీత’లో మధుగీత, ముక్తగీతికలు, మణికుల్య వ్యాసాలు, నరసయ్య సరస కవిత లాంటివి ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గాలిబ్ ఆదిగా 56 మంది ఉర్దూ కవుల గజళ్లకు, రుబాయిలకు మధుర భావానుకృతులు మధుగీత, ముక్తగీతికలు. వల్లపురెడ్డికున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ భాషల ప్రావీణ్యం ఈ అనువాదాలకు ప్రాణం పోసింది. ‘‘మధుతత్వాన్ని తొనలు ఒలిచి ఇచ్చినంత సుతారంగా ఆవిష్కరించాడు వల్లపురెడ్డి. తన మాటల్లో ఉర్దూ కవితలోని ప్రణయ స్వరూపాన్ని పుడిసిలించి చూపాడు కూడా’’ అన్నారు సినారె. ఈ కవితలతోపాటు, మణికుల్య వ్యాసాలు, నరసయ్య సరస కవిత, శ్రీరంగనాథ విలాసము పరిష్కరణ, ముఖాముఖి, లేఖలు వగైరా కలిగివున్న రెండో సంపుటి వారి భాషా సాహిత్య పాటవాలకు నిదర్శనం. జి.యాదగిరి 9440339917 -
పాలమూరు మేలిమి కథకుడు
1954 - 60ల మధ్య పాలమూరు జిల్లా నుంచి విస్తృతంగా కథలు రాసి గుర్తింపు పొందిన రచయిత వల్లపురెడ్డి. వాస్తవ జీవిత చిత్రణ వల్లపురెడ్డి బలం. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఆయన ప్రధాన కథా వస్తువులు. ప్రధాన స్రవంతి వచనంలో అలవోకగా కథను నడిపించడం తెలిసిన వల్లపురెడ్డి కథలకు భారతి, తెలుగు స్వతంత్ర వంటి పత్రికలు పీఠం వేయడంలో ఆశ్చర్యం లేదు. వల్లపురెడ్డి దాదాపు 70 కథలు రాసినా అన్నీ అందుబాటులో లేకపోవడం దురదృష్టం. దొరికిన 35 కథలతో ఈ సంపుటి తీసుకొచ్చిన పాలమూరు మిత్రులు అభినందనీయులు. మరుగున పడ్డ కథకులు అలాగే ఉండిపోరనీ మబ్బు తొలగిన మరుక్షణాన పాఠకుల సమక్షంలో హాజరవుతారని ఈ సంపుటి సాక్ష్యం పలుకుతుంది. కథాభిమానులు తప్పక పరిశీలించాల్సిన పుస్తకం. వెల: రూ.150/- ప్రతులకు: 94908 04157