breaking news
used flowers
-
వాడిన పూలూ 'గుబాళిస్తున్నాయ్'
మహాకవి శ్రీశ్రీ రాసిన ‘వాడిన పూలే వికసించెనే..’ అన్న పాటను నిజం చేస్తున్నారు తుని మండలం టి.తిమ్మాపురం మహిళలు. ‘బంతి.. చామంతి.. మా చేతిన పడితే అగరువత్తి’ అంటూ వారంతా కొత్త పాటను ఆలపిస్తున్నారు. వాడిన పూలను పౌడర్‌గా మార్చి పర్యావరణ హితమైన అగరువత్తులను తయారు చేస్తూ పూల పరిమళాలను వెదజల్లుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వాడిన పూలు పనికి రావనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అవి కూడా విపణి వీధిలో వికసిస్తూ పరిమళాలు విరజిమ్ముతున్నాయి. దేవుడికి అలంకరించిన పుష్పాలు ఆ తరువాత మహిళల చేతుల్లో అగరువత్తులుగా మారిపోతున్నాయి. ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ లాభదాయకమై విజయవంతంగా నడుస్తోంది. ప్రపంచ మార్కెట్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కాకినాడ జిల్లా తుని మండలంలోని టి.తిమ్మాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో 15 కుటుంబాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు అగరువత్తులు, సాంబ్రాణి కడ్డీలు వంటివి తయారు చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన వీటి టర్నోవర్ రూ.కోటిన్నర దాటేసింది. శ్రీసత్యదేవ స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం నుంచి సేకరిస్తున్న పుష్పాలను నిత్యం తిమ్మాపురం తీసుకెళ్లి ఎండబెట్టి పౌడర్‌గా మారుస్తున్నారు. ఆ పౌడర్‌తో అగరువత్తులు తయారు చేసి 60 గ్రాములు, 120 గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. పూల పౌడర్‌తోనే సాంబ్రాణి కడ్డీలను సైతం తయారు చేస్తున్నారు. 15 లక్షల అగరవత్తుల ప్యాకెట్ల తయారీ అన్నవరం సత్యనారాయణస్వామి అలంకరణకు ఉపయోగించిన పుష్పాలను రోజుకు 60 నుంచి 80 కిలోల వరకు సేకరించి టి.తిమ్మాపురం తరలిస్తున్నారు. వీడిని ఎండబెట్టి పౌడర్ చేసిన అనంతరం తులసి, పారిజాతం, స్వర్ణ, సంపంగి, చందనం పరిమళాలతో అగరవత్తులు, రెండు రకాల సాంబ్రాణి కప్పులు (కడ్డీలు) తయారు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం 15 కుటుంబాలకు చెందిన స్వయంశక్తి సంఘాల మహిళలు రోజుకు ఐదువేల అగరవత్తి ప్యాకెట్లు, డిమాండ్‌ను బట్టి సాంబ్రాణి కడ్డీలను తయారు చేస్తున్నారు. ఇలా ఏడాదికి 15 లక్షల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. 60 గ్రాముల ప్యాకెట్ రూ.50, 120 గ్రాముల ప్యాకెట్ రూ.100, 130 గ్రాములు సాంబ్రాణి కడ్డీల (30) ప్యాకెట్ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఏడాది తిరగకుండానే రూ.1.50 కోట్ల లావాదేవీలు నిర్వహించి పెద్దపెద్ద వ్యాపారులను ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన అగరవత్తులను అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం, లోవ కొత్తూరు తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్‌ను విస్తరించేందుకు అమెజాన్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదిరింది. వీటికి డిమాండ్ పెరిగింది మేం సేకరించిన పుష్పాలతో అగరవత్తులు తయారు చేసి దైవసన్నిధిలో భక్తులకు విక్రయించడం సంతృప్తినిస్తోంది. పుష్పాలను పౌడర్ చేయడం, పౌడర్‌ను ముద్దగా కలపడం, కలిపిన ముద్దను అగరవత్తులుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా యంత్రాలు అవసరం. యంత్రాల కొనుగోలుకు రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పెట్టుబడి అవసరం. ప్రభుత్వం సహకరిస్తే మరికొందరు మహిళలకు ఉపాధి లభిస్తుంది. – పోల్నాటి సూరన్న, శ్రీపవన్ సూర్య ట్రేడర్స్, టి.తిమ్మాపురం విస్తరణకు తోడ్పాటు అందిస్తాం కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్న అగరవత్తుల తయారీ యూనిట్‌కు రుణం మంజూరుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే స్త్రీ నిధిలో రూ.లక్ష రుణం ఇచ్చాం. పీఎంఎఫ్ఎంఈ పథకంలో రూ.10 లక్షల రుణం మంజూరుకు బ్యాంకులతో చర్చిస్తున్నాం. – వై.సత్తిబాబు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతిపథం, తుని మండలం -
వాడిన పూలే వికసించనీ...
తాజా పువ్వులతో ఇంటిని అలంకరించుకోవడం అందరికీ తెలిసిందే. ఆ పువ్వులు వాడిపోతే పారేయడమూ మామూలే. కాని ఎండిపోయిన పువ్వులను కూడా ఇంటి అలంకరణలో వాడచ్చు. అదెలాగో చూద్దాం. సాధారణంగా పువ్వులలో తేమ తగ్గిపోతే అవి వాడిపోతాయి. ఈ పువ్వులను చాలా బరువుగా ఉన్న పుస్తకంలో మధ్యలో ఉంచాలి. పైన ఏదైనా పెద్ద బరువు పెట్టాలి. లేదా రెండు వెడల్పాటి చెక్కల మధ్య న్యూస్‌పేపర్ లేదా టిష్యూ పేపర్ పరిచి దాని మధ్యలో పువ్వులను చక్కగా విడదీసి గట్టిగా ప్రెస్ చేసి, అలాగే ఉంచాలి. రెండు వారాల తర్వాత తీసి చూస్తే తేమంతా పోయిన పువ్వులు బాగా ఎండిపోయి కనిపిస్తాయి. ఇలాగే ఆకులు, కొమ్మలు, తీగలను ఎండిపోయే విధంగా తయారుచేసుకోవచ్చు. లేదంటే ఎండినవాటినే సేకరించవచ్చు. ఎండిన పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ వాల్ ఫొటోఫ్రేమ్లకు, ఫ్లవర్ బొకేలకు వాడుకోవచ్చు. ఫ్లవర్వేజ్లలో రకరకాల ఎండు గడ్డి మొక్కలు, ఎండిన పువ్వులతో అలంకరించవచ్చు. ఎండిన కంకులు, గడ్డి తీగలు, పోచలు.. కలిపి బొకేలా తయారుచేసి, ఇంటి మూలల్లో అలంకరించుకుంటే లుక్కే మారిపోతుంది. పెద్ద పెద్ద క్యాండిల్స్ సైడ్లను వేడితో కొద్దిగా మెత్తబరిచి, ఎండుపువ్వులను, ఆకులను అతికించి, గాలికి ఉంచాలి. చూడచక్కని పువ్వుల డిజైన్లతో క్యాండిల్స్ కొత్త కళను నింపుకుంటాయి. ఇంటి అలంకరణలో నచ్చిన రీతిలో ఉపయోగిస్తే ఎండు పువ్వుల సొగసులు ఎప్పటికీ వాడిపోవు. ఇంటి అందాన్ని ఎప్పుడూ వడలిపోనీయవు.