breaking news
upup
-
తిరుమల కొండల్లో ఇది రెండో ఎన్కౌంటర్
తొలి ఎన్కౌంటర్ బ్రహ్మాజీ కొండ వద్ద వారం రోజుల్లో నాలుగుసార్లు పోలీసుకాల్పులు తొలిసారి వెలుగుచూసిన బాణం సాక్షి, చిత్తూరు: శేషాచల కొండల్లో గత ఆరు నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో బుధవారం రాత్రి జరిగింది రెండోది. చామల రేంజ్ బ్రహ్మాజీ కొండ వద్ద(భాకరాపేట అడవుల్లో) తొలి ఎన్కౌంటర్ లో తమిళ కూలీ హతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో ఒకేసారి ముగ్గురు ఎర్రదొంగలు మృతిచెందారు. ఎన్నికల కారణంగా సాయుధబలగాలు మూడు నెలలు కూంబింగ్ ఆపేశాయి. మళ్లీ నెల రోజులుగా చిత్తూరు, తిరుపతి అర్బన్జిల్లాల పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. అటు చామల రేంజ్(భాకరాపేట, తలకోన) నుంచి ఇటు తిరుమల మీదుగా మామండూరు రేంజ్(మామండూరు) వరకు తిరుమల అడవుల్లో పోలీసులు, అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సాయుధ బలగాలు నాలుగు బృందాలుగా విడిపోయి జల్లెడపడుతున్నారుు. వారం రోజులుగా సాగుతున్న విస్తృత కూంబింగ్‌లో నాలుగుసార్లు స్మగ్లర్ల దాడులను ఎదుర్కొన్న పోలీసు, అటవీశాఖల దళాలు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆత్మరక్షణార్థం కాల్పులకు దిగాల్సి వచ్చింది. 15 రోజుల కిత్రం భాకరాపేట అడవుల్లో తొలిసారి స్మగ్లర్లు రాళ్లదాడికి దిగటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసు బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. తరువాత వారం రోజులకు శ్రీవారి మెట్టు వద్ద, పులిబోనుకు పై ప్రాంతాల్లోను, చంద్రగిరి మండలం మామండూరు వద్ద హైవేకు సమీపంలోని అటవీప్రాంతంలో స్మగ్లర్లపై పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. వెలుగుచూసిన బాణం తిరుమల అడవుల్లో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన కూలీల వద్ద తొలిసారి బాణం వెలుగుచూసింది. గతంలో కూడా పోలీసులపై బాణంతో దాడులు చేసినా, అప్పట్లో బాణం వెలుగుచూడలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బాణం వెలుగు చూడటంతో ఎర్రదొంగలు తమిళనాడులోని తిరువణ్ణామలై జమునామత్తూరు అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనులై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. వీరు మాత్రమే ఇతరులపై దాడికి బాణాలు కూడా వాడతారని విశ్లేషిస్తున్నారు. భక్తుల ముసుగులోనే.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీవారి పాదాలకు సమీపంలో ఉండటంతో ఎర్రకూలీలు భక్తుల ముసుగులోనే కొండకు చేరుకుని అక్కడి నుంచి ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళ్లి ఉంటారని అటవీ, పోలీసు శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు కూలీలు అటవీ మార్గంలో ఆయుధాలతో పైకి చేరుకోగా, మిగిలినవారు బస్సుల్లో తిరుమలకు, అక్కడి నుంచి కాలినడకన శేషాచల కొండల్లోకి ప్రవేశించినట్లు సమాచారం. -
శేషాచలం అడవుల్లో పోలీస్ ఫైర్
రాళ్లతో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు నిందితుల పరార్ తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న కూలీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అడవిలోకి వెళ్లిన పోలీసులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తుపాకులకు పనిచెబుతున్నారు. రెండు రోజుల క్రితం శేషాచల అడవిలోని చామలరేంజ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజాగా ఆదివారం శేషాచలం కొండల్లో గుడ్డెద్దుబండ, ఈతకుంట ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారని జిల్లా సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఇలియాస్‌బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు.. 15 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం కల్యాణిడ్యాం సమీపంలోని శ్రీవారి పాదాలు ప్రాంత అడవిలోకి కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో గుడ్డెద్దుబండ వద్ద వారికి సుమారు 30 మంది ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల ముఠా ఎదురుపడింది. పోలీసులను చూసిన వెంటనే వారు రాళ్లు రువ్వి ఎదురుదాడికి దిగారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరి పారు. నిందితులు రాళ్లు రువ్వుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. అలాగే కొండ దిగువ భాగంలో శ్రీవారి పాదాల ప్రాంతానికి ఎడమ వైపు 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి 40 మందితో కూడిన మరో స్పెషల్ పార్టీ పోలీసు బృందం కూం బింగ్‌కు వెళ్లింది. అక్కడ ఈతగుంట ప్రాంతంలో వారికి స్మగ్లర్ల ముఠా తారసపడింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు పోలీ సులపైకి రాళ్లు విసిరారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. ఈ రెండు సంఘటనలు ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రాథమిక సమాచారం మాత్రమే అందిందని, పోలీసు బృందాలకు స్మగ్లర్లు ఎవైరైనా పట్టుబడ్డారా, ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయా అనేది ఇంకా తెలియలేదని డీఎస్పీ ఇలియాస్‌బాషా చెప్పారు.