breaking news
University of Michigan
-
ఎదగడానికి నాలుగు ట్రిక్కులు!
వృత్తిపరమైన ఐంద్రజాలికులు వాస్తవంగా ఉన్నవి నాలుగు రకాల ట్రిక్కులేనని చెబుతారు. అవి: ఒక రూపాన్ని మన కళ్ళకు కట్టించడం; దేన్నయినా అదృశ్యం చేయడం; రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం; చివరగా ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం. ఈ నాలుగింటినీ జీవితానికి అన్వయించుకుంటే మనమూ ఎదుటివారిని ఆశ్చర్యచకితులను చేయగలం. ఎలాగంటారా... మొదటి ట్రిక్కు: మన ఉనికిని చాటుకోవడమంటే, భౌతికంగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు; మనల్ని మనం అత్యుత్తమమైన రీతిలో ప్రదర్శించుకోవడం! మనం ఊసరవెల్లి లాంటివాళ్ళం. తల్లితండ్రుల ముందు ఒకలా, స్నేహితుల వద్ద మరోలా ప్రవర్తిస్తాం. కానీ, ఈ బాహ్యమైన నేను కాకుండా ‘లోపల మరో నేను’ ఉంటాడు. మన అసలు స్వరూపం అదే! మనకు ఇష్టమైన వ్యాపకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరింపజేసేది వాడే! మనం అరమరికలు లేకుండా ఎవరి వద్ద వ్యవహరించగలమో, ఎవరు మన ‘లోపలి మనిషి’ని అభినందించగలుగుతారో అలాంటి వాళ్ళ వద్దనే ఆ ‘లోపలి మనిషి’ బయటపడతాడు. మిషిగన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, బోస్టన్‌లో మొదటి ఉద్యోగంలో చేరాను. అక్కడి బాస్ నన్ను తీర్చిదిద్దుతానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను. తీరా, నేను ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళేటప్పటికి, ఆయన కాస్తా ఉద్యోగం వదలి వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది అనుకున్నాను.తిరస్కరణతో... జీవితం తలకిందులవదు!‘‘ఈ ఏడాది ఏం చేయబోతున్నానో ‘నాకు లోపల’ తెలిసి పోతోంది. నా కష్టాలు, కన్నీళ్ళతోనే ఓ నవల రాస్తా’’నని నా స్నేహి తురాలితో చెప్పాను. అందుకామె నవ్వలేదు. ‘బ్రహ్మాండం. అదే పనిలో ఉండు’ అంది. ఆమె నా లోపలి మనిషిని గుర్తించి అతడి సత్తాపై నమ్మకం ఉంచిందన్నమాట. అలా వెన్ను తట్టేవారు మన అమ్మ, నాన్న, తాత, బామ్మ ఎవరైనా కావచ్చు. అటువంటి బేషరతు మద్దతు లభించినపుడు మనలోని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకని, ఇపుడు మీ స్నేహితులను అంటిపెట్టుకుని ఉండండి. వారి ప్రేమ, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. నేనా పుస్తకాన్ని పూర్తి చేసి, ప్రచురణకు అభ్యర్థిస్తూ పంపిస్తే, ప్రచురించలేమంటూ 24 ఉత్తరాలొచ్చాయి. ప్రచురణకర్తలు ఉన్నది 20 మందే! అంటే, కొందరు రెండుసార్లు తిరస్కరించారన్నమాట. వాళ్లకు ఆ పుస్తకం నచ్చకపోతే మరో పుస్తకం రాస్తానని అను కున్నాను. అదీ నచ్చకపోతే ఇంకోటి రాస్తానని ధైర్యం చెప్పు కున్నాను. ఆ తదుపరి పుస్తకం ప్రచురణకు నోచుకుంది. భయాన్ని బలంగా మలచుకోండి!మనం అదృశ్యం చేయాల్సింది భయాన్ని! ఇదే రెండో ట్రిక్కు. హైస్కూలులో ఉండగా, ఓ చోట ఐస్‌క్రీమ్ అందించే ఉద్యోగం చేశాను. ఒకావిడ వచ్చి ఐస్‌క్రీమ్ ఆర్డరు చేసింది. ఒక్క క్షణంలో ఇస్తానన్నాను. ఈ క్షణంలోనే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కానీ నేను బెదిరిపోలేదు. దాంతో ఈ దిక్కుమాలిన షాపులో జీవితాంతం గడుపుతావంటూ తిట్టిపోసింది. నిజం ఒప్పుకొని తీరాలి. నేను కలవరపడిన మాట వాస్తవం. కానీ, ఆ మహిళ నాలో రేకెత్తించిన భయం నాలో కసిని పెంచింది. కనుక, భయాన్ని పారదోలండి. భయం ఏదో చెరుపు చేస్తుందని కాదు. భయాన్ని ప్రేరణగా తీసుకుని ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. ఒకరు తక్కువ అంచనా వేసినంత మాత్రాన కుంగిపోనవసరం లేదు. నిశ్శబ్దంగానే మీ విషయంలో వారి అంచనాలు తప్పు అని నిరూపించండి. దయాగుణంతో విప్లవం తేవచ్చు!రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం ఇంద్ర జాలంలో మూడవ ట్రిక్కు అనుకున్నాం కదా! ఇక్కడ సహానుభూతి గురించి చెప్పుకోవాలి. ఇతరుల కష్టాలను వారి దృక్కోణం నుంచి చూడటం అలవరచుకోవాలి. నాకు 13 ఏళ్ళపుడు మా నాన్న ఉద్యోగం పోయింది. దాంతో మేం బ్రూక్లిన్ నుంచి మయామీకి మకాం మార్చాం. అక్కడ మా తాత, నాయనమ్మ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, నేను, ఆ పెద్దవాళ్ళు కలిసి మొత్తం ఆరుగురం కొన్ని నెలలపాటు సింగిల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లోనే తలదాచు కున్నాం. ఇంతమంది ఏమిటంటూ కొందరు గొడవకు దిగారు. పొరుగునే ఉన్న మరో వాటా ఆవిడ తాను అపార్టుమెంటును ఖాళీ చేస్తున్నాననీ, పెద్దవాళ్ళు ఇద్దరూ అందులో ఉండ వచ్చనీ చెప్పి అనునయించింది. కాకతాళీయంగా ఆవిడ పేరు మెర్సీ. ఔను! పేరుకు తగ్గట్లు దయచూపిన మహాత్మురాలు. ఈ నిరాశావాద ప్రపంచంలో సిసలైన దయాగుణం గాయాలను మాన్పుతుంది. క్రూరంగా వ్యవహరించడం, విషం కక్కడం, అభిప్రా యాలతో ఏకీభవించనివారి పట్ల కరకుగా ప్రవర్తించడం మన సంస్కృతిలో భాగాలైపోయాయి. కానీ, క్రూరత్వం బలానికి రుజువు కాదు. బాధపడుతున్నవారి స్థానంలోకి మనం వెళ్ళ గలిగితే అది బలం అనిపించుకుంటుంది. ఇక్కడున్నవారిలో కొందరికి రకరకాల కష్టాలు ఉండ వచ్చు. నేటి గ్రాడ్యుయేట్లలో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషించేవారో అని నాకూ అనిపిస్తోంది. జీవితంలో మున్ముందు మీకెదురయ్యే ప్రతి వ్యక్తీ మీకు పైకి కనిపించని సమస్యతో సతమత మవుతూ ఉండవచ్చు. వారి స్థానంలోకి వెళ్లి వారి గురించి ఆలోచించండి. ప్రపంచానికి మరింత సహానుభూతి, మరింత వినయ విధేయతలు, ముఖ్యంగా మానవ మర్యాదలను కనబరచడం అవసరం. మీరు నిజంగా ప్రపచాన్ని నివ్వెరపరచదలచుకుంటే, మీలోని దయా గుణాన్ని బయటకు తీయండి. మార్పు చెందుతూనే ఉండాలి!ఇంద్రజాలంలో చివరి ట్రిక్కు– ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం! అన్ని ట్రిక్కుల కన్నా ఇదే కష్టమైనది. రూపాంతరం చెందడం. చిన్నప్పుడు మనం రకరకాల రూపాలను ఇష్టపడినా, పెద్ద యిన తర్వాత, ఒక మూసలో ఒదిగిపోయేందుకు మొగ్గు చూపుతాం. ప్రపంచం పట్ల, మీపట్ల మీకొక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. కానీ, మారకపోతే మకిలిపట్టిపోతాం. ఆశలు, ఆశయాలను సమయానుకూలంగా సవరించుకోవడంలో తప్పు లేదు. మనల్ని మించినవారు లేరనుకుంటే పప్పులో కాలేసినట్లే. తమ ఆలోచనా ధోరణిని తామే ప్రశ్నించుకుని, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని భావించే లక్షణాన్ని నేను కొందరు అత్యంత ప్రజ్ఞావంతులలో గమనించాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మారాలి. అన్నీ తెలిసిపోయాయని ఎన్నడూ అనుకోకండి. అవకాశాలు అనంతంగా ఉంటాయి. వాటిని అందుకునేందుకు సిద్ధ పడాలి అంతే! ఎక్కడెక్కడ మీ ప్రతిభా నైపుణ్యాలను కనబరచడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ అన్వేషించండి. ఒకటే మార్గంలో పయనించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్కచోట ఉపయోగించుకోవచ్చు. -
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్‌లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్‌లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
జూలై 1 నాటికి దేశంలో 6 లక్షల కేసులు
వాషింగ్టన్: భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జూలై 1 నాటికి ఈ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి అధ్యయనకారిణి భ్రమర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో ర్యాపిడ్ పరీక్షల సంఖ్యను పెంచడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "భారత్ కేవలం 0.5 శాతం జనాభాకు మాత్రమే పరీక్షలు నిర్వహించింది. వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్‌లపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది. లక్షణాలు గుర్తించేందుకు ఉష్ణోగ్రత పరిశీలించడం, ఆక్సిజన్ చెక్ చేయడం, కాంటాక్టులను గుర్తించడం అత్యవసరం". (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) "అలాగే దేశంలో అధిక జనాభాపై సర్వే చేయడం ద్వారా ఎంతమంది కరోనా బారిన పడే అవకాశం ఉందనేది గుర్తించే అవకాశం ఉంటుంది. మరోవైపు లాక్డౌన్ వల్ల ఇతర దేశాల్లో కరోనా కేసులు తగ్గితే, దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం అలా జరగలేదు. మనం వైరస్ వ్యాప్తిని మందగించేలా చేశాం కానీ నిర్మూలించలేదు. అయితే న్యూజిలాండ్ లాగా భారత్ కరోనాను పూర్తిగా నియంత్రించకపోవచ్చు" అని భ్రమర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కాగా భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. (భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు) -
ఆత్మహత్య ఆలోచనలు అందుకేనట!
వాషింగ్టన్: నిద్ర తక్కువయితే ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు మిచిగాన్ యూనివర్శిటీ పరిశోథకులు. మామూలు వ్యాధుల కన్నా కూడా మెదడు సంబంధ వ్యాధులతో బాధపడేవారిలో ఆత్యహత్యా ఆలోచనలు తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం కూడా వీరి అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు మూడు లక్షల మంది మీద పదమూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఈ కాలంలో సుమారు మూడు వేల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వీరిలో 19 శాతం మంది మాత్రమే అనారోగ్య కారణాల వలన ఆత్మహత్య చేసుకోగా 20 శాతం మంది మానసిక రుగ్మతల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా వారిలో పదిశాతం మంది నిద్రలేమితో ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువై ఆత్మహత్య ఆల్చోనలు కలిగి ఉండవచ్చని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. -
శస్త్రచికిత్సకు ‘రోబో’
వాషింగ్టన్: వైద్య చికిత్సల్లో రోబోల వాడకం విస్తృతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి శరీరంపై చిన్న గాటు చేసి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్స చేసే రోబోటిక్ పరికరాన్ని అమెరికాలోని మిచిగాన్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందులో భారత సంతతి శాస్త్రవేత్త శోర్య అవతార్ ఉండటం విశేషం. ఫ్లెక్స్డెక్స్ అనే ఈ రోబోటిక్ పరికరాన్ని వైద్యులు తమ చేతికి ధరించి దానికి మార్గదర్శకం చేయడం ద్వారా చికిత్స నిర్వహించవచ్చని పరిశోధకులు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వీలుగా దీనికి సహజమైన సూదిని అమర్చారు. ఈ పద్ధతిలో చికిత్స నిర్వహించడం ద్వారా తక్కువ ఖర్చు, సన్నటి రంధ్రం, తక్కువ నొప్పి, గాయం త్వరగా మానే అవకాశం.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఈ పరికరం ధర కేవలం రూ.33 వేలు. -
టీనేజ్ లో అడిక్ట్ అవుతున్నారు.. ఇక అంతే..!
వాషింగ్టన్: స్మార్ట్ ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం లేదని టీనేజ్ యువతీయువకులు వీటికి అడిక్ట్ అవ్వడం వారి పేరేంట్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. మొబైల్ వీడియో గేమ్స్, కంప్యూటర్స్ వాడుతూ వీడియో గేమ్స్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, టీవీలో కార్టూన్ ఛానల్స్ చూడటం లాంటి దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ టీనేజర్స్ ఎలాంటి అంశాలపై టైం పాస్ చేయడంపై దృష్టిసారించారు. ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. తల్లిదండ్రులు పది సార్లు పిలిచినా పలకడం లేదట. ఏసీ ఆఫ్ చెయ్.. వాటర్ తీసుకురా, లైట్ ఆఫ్ చెయ్ అంటూ పేరేంట్స్ మొత్తుకుంటున్నా వారిలో చలనం రావటం లేదని వెల్లడించారు. తల్లి, పిల్లల మధ్య రిలేషన్ గతంలో ఉన్నట్లు లేదని, వారి మధ్య దూరం పెరుగుతుందని చెప్పారు. 44 కుటుంబాలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగి పలు విషయాలను బయటపెట్టారు. గ్రాడ్యూయేషన్ చదివిన తల్లులు ఉన్న ఇంట్లో పరిస్థితి పరవాలేదని, అంతకంటే తక్కువ చదివిన వారి ఇళ్లల్లో పిల్లలను కంట్రోల్ చేయడం వారి వల్ల కష్టమవుతోందట. పేరేంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాపై అవగాహనా తెచ్చుకోవాలని, నెట్ వాడకం, ట్రాకింగ్ విషయాలపై మెరుగవ్వాలని సూచిస్తున్నారు. చదువు, ఆటల మీద ఆసక్తి పెంచాలని.. వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ నుంచి వారి దృష్టిని మళ్లించాలని రీసెర్చర్స్ పదే పదే చెబుతున్నారు. -
రొమాంటిక్ భాగస్వామి లేకుంటే ..
న్యూయార్క్: రొమాంటిక్ భాగస్వామి లేనివారు పెట్టే పెట్టుబడులు నష్టాలను తెస్తాయట. వీరు భాగస్వామిని వెతికే క్రమంలో విచక్షణ కోల్పోయి అధిక ప్రమాదం-అధికాదాయం ఉన్న వాటిపై పెట్టుబడులు పెడతారని మిచిగాన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. ప్రతికూల ఫలితాలను పొందే అవకాశమున్నవారు ప్రమాదాన్ని తగ్గించేందుకు పెట్టుబడులను వివిధ మార్గాల్లో పెడతారనీ, రొమాంటిక్ భాగస్వామి లేనివారు వ్యూహాత్మ పెట్టుబళ్లు పెట్టలేరని వెల్లడైంది. -
డీఎన్ఏ బుక్
ఫేస్బుక్... ప్రపంచం దాసోహమైన సోషల్ హబ్. డీఎన్ఏ... ప్రపంచంలోని జీవరాశిని నడిపిస్తున్న ఓ నిర్మాణం. ఈ రెంటినీ ఏకం చేసింది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ‘జీన్స్ ఫర్ గుడ్’. వారసత్వంగా ఆస్తులొస్తాయో లేదో కానీ.. పూర్వీకుల లక్షణాలు, వారికున్న జబ్బులు మాత్రం వస్తాయి. వంశపారంపర్యంగా ఏయే జబ్బులు వచ్చే అవకాశముందో తెలుసుకోవాలనుకునేవాళ్ల కోసం ఓ ఫేస్బుక్ యాప్‌ను క్రియేట్ చేసింది. దీని ద్వారా 20,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించడం కోసం ఓ ప్రశ్నావళిని తయారు చేసింది. వారిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రను, అలవాట్లను, జీవన విధానాన్ని తెలుసుకుని.. ఆ హెల్త్ ప్రోగ్రెస్‌ని గ్రాఫికల్ టూల్స్ ద్వారా ప్రజెంట్ చేయనుంది. వారికి ఏయే జబ్బులు రావొచ్చో సమాచారంతో పాటు.. ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇలా సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. -
మంత్రి హరీశ్‌కు మిషిగన్ వర్సిటీ ఆహ్వానం
‘మిషన్ కాకతీయ’పై ప్రసంగించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది. ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు. -
అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!
అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రతిరోజూ 60వేల మందికి కొంతమంది వాలంటీర్లు భోజనాలు పెడతారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని మరీ ఇలా అంతా కలిసి ఈ విధులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసి అబ్బురపడిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో కూడా ఈ తరహాలోనే అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ప్రతి శుక్రవారం వాళ్లు పదివేల మందికి ముందుగా తయారుచేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలా తయారుచేసినవాటిలో ఏమైనా మిగిలిపోతే అనాథాశ్రమాలకు పంపుతున్నారు. అమెరికాలో ధనవంతులతో పాటు చాలామంది పేదలు కూడా ఉన్నారని, అందువల్ల అందరూ ఇలా ముందుకు రావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఈ 'లంగర్' అందరికీ స్ఫూర్తినిస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జస్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని తరిమేసే ‘స్ట్రెస్బస్టర్స్’ యాప్!
వాషింగ్టన్: పరీక్షల కోసం రేయింబవళ్లు చదువుతూ.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా? ఇతరులతో సంబంధాలు దెబ్బతినడం లేదా పని ఒత్తిడి, సమస్యల వల్ల కుంగుబాటుకు లోనవుతున్నారా? అయితే మీ లాంటివారి ఒత్తిడిని, ఆందోళనను తరిమేసేందుకు ఉపయోగపడే ‘స్ట్రెస్బస్టర్స్’ అనే ఓ మొబైల్ అప్లికేషన్‌ను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పరిశోధకులు రూపొందించారు. అమెరికా, ఇతర పలు దేశాల యూనివర్సిటీల విద్యార్థులు ఉపయోగిస్తున్న ఈ ‘స్ట్రెస్బస్టర్స్’ యాప్‌తో ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడేలా న్యూస్ అలర్ట్స్, స్ఫూర్తిదాయకమైన మాటలు, వీడియోలు పరస్పరం అందుకోవచ్చు. ఒకే ఒక్క బటన్‌ను నొక్కి నేరుగా ఇతరులకు రిప్లై ఇవ్వవచ్చు. విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. ఆపిల్ కంపెనీ యాప్ స్టోర్, గూగుల్ ప్లే నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


