breaking news
Truptimayee
-
పరిచయస్తుడే ప్రాణం తీశాడా?
మొబైల్ కాల్స్‌పై పోలీసుల దృష్టి తృప్తిమయి హత్య కేసులో పురోగతి బరంపురం : బరంపురం కళ్లికోట్ వర్సిటీ విద్యార్థి తృప్తిమయి పండా హత్య కేసులో ఆశించిన రీతిలో పురోగతి కనిపిస్తోంది. బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఛత్రపూర్‌కు చెందిన తృప్తిమయి పండా స్థానిక అనంత నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. గత నెల 25న రాత్రి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లోని సోంపేట, బారువ మధ్య గల బేసిరామచంద్రపురం జాతీయ రహదారి పక్కన రక్తపు మడుగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. హ త్య జరిగిన వారం రోజులైనా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు ఆంధ్ర, ఒడిశా పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ కెమెరాలో కారు తృప్తిమయి పండా హత్య కేసుకు సంబంధించి పోలీసులకు కీలకమైన ఆధారం లభించిందని తెలిసింది. తృప్తిమయి పండా ప్రయాణిస్తున్న కారు ఒడిశా సరిహద్దు దాటుతున్నట్లు గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాలో నమోదైంది. ఘటన జరిగిన రోజున గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాల ఫుట్టేజీలు గంజాం పోలీసులు సేకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్స్ సేకరణ విద్యార్థి హత్య కేసు మిస్టరీ ఛేదించడానికి ఆంధ్ర, ఒడిశా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఆధారాల సేకరణలో మునిగిపోయారు. ఆమె ఫోన్ కాల్స్ లిస్ట్‌ను ఆంధ్ర పోలీసులు సేకరించినట్లు తెలిసింది. తృప్తిమయి ఎవరితో మాట్లాడింది, ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి, ఆఖరి ఫోన్ ఎవరు చేశారని ఆరా తీస్తున్నారు. ఆమె చివరి ఫోన్ కాల్ ఎవరికి చేసిందని ఆరా తీస్తున్నారు. తెలిసినవారే హంతకులు? విద్యార్థిని తృప్తిమయితో బాగా పరిచయం ఉన్న వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఆలస్యమైతే నిందితులు రాష్ట్రం నుంచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. విద్యార్థిని హత్య కేసు ఇరు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది. -
పథకం ప్రకారమే హత్య
బరంపురం(భువనేశ్వర్): కళ్లికోట్ విశ్వవిద్యాలయం విద్యార్థిని తృప్తిమయి పండాను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒడిశాలో హత్య చేసి ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పాతిపెట్టినట్లు భావిస్తున్నారు. తృప్తిమయి పండా కేసు దర్యాప్తునకు సోంపేట, బారువ పోలీసులు బరంపురం వచ్చారు. ఒడిశా పోలీసులతో కలిసి కేకే వర్సిటీలో వివరాలు సేకరించారు. తర్వాత అనంతనగర్‌లోని ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌కు వెళ్లి వివరాలు, ఆధారాలు సేకరించారని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట – బారువ మధ్య బేసి రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని ఆగస్టు 27న స్థానికులు గుర్తించారు. రెండు రోజులు గడిచినా మృతురాలి వివరాలు తెలియలేదు. మృతదేహం వద్ద ఒడియా దినపత్రిక లభించడంతో ఒడిశావాసి అయి ఉంటుందని భావించారు. ఒడియా దినపత్రికల్లో మృతురాలి ఫొటోతో వార్తలు ప్రచురితమయ్యాయి. ఛత్రపూర్‌కు గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండా సోంపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మృతదేహాన్ని చూశారు. మృతురాలు తమ కుమార్తె తృప్తి మయి పండా(23)గా గుర్తించారు. బీఎన్పూర్లో మిస్సింగ్..సోంపేటలో మర్డర్ కేసు ఛత్రపూర్‌కు చెందిన బివేకనందా పండా చత్రపూర్ పోలీస్ క్వార్టర్స్‌లో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె తృప్తిమయి పండా నెల రోజుల కిందట బరంపురం కళ్లికోట్ కళాశాలలో ఎంసీఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. బరంపురం అనంతనగర్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆగస్టు 25 నుంచి ఆమె కనిపించడం లేదు. తృప్తిమయి తండ్రి ఫిర్యాదు మేరకు బరంపురం బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 26న మిస్సింగ్ కేసు నమోదైంది. 27న బేసిరామచంద్రపురం వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. సోంపేట పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. దీంతో ఒడిశా, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్‌స్టర్ మృతి తర్వాత.. ఛత్రపూర్ సైన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతుండగా ఒక గ్యాంగ్‌స్టర్‌తో తృప్తిమయి సన్నిహితం మెలిగేదని పోలీసులకు తెలిసింది. ఆ గ్యాంగ్‌స్టర్ మృతి తర్వాత ఆమెకు బెదిరింపు కాల్స్ రావడంతో సిమ్ మార్చింది. కళ్లికోట్ వర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుండడంతో బరంపురం అనంతనగర్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్లో చేరింది. గత నెల 24న ఆమె బయట తిరిగిందని, 25న రాత్రి 9 గంటలకు ఎవరో వచ్చి పిలిస్తే బయటకు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ వార్డెన్ చెప్పినట్లు బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ అధికారి అశోక్ మిశ్రా తెలిపారు. నేరస్తులు ఒడిశావారే! పోస్టుమార్టం నివేదిక ప్రకారం తృప్తిమయి పండా హత్యకు గురైనట్లు తెలిసిందని బారువా సీఐ సూర్యనారాయణ నాయుడు తెలిపారు. పక్కా ప్రణాళికతో ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఒడిశాలో హత్య చేసి మృతదేహాన్ని ఆంధ్ర ప్రాంతానికి తీసుకువచ్చారని తమ ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. హంతకులు బరంపురం, ఛత్రపూర్‌లలో ఉండి ఉంటారని పేర్కొన్నారు. ఒడిశా పోలీసుల సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, హంతకులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.