breaking news
tribal welfare school
-
29 మంది గిరిజన విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం దుంపల కూర, పెరుగు తిన్న 29 మంది గిరిజన విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి గురువారం ఉదయాన్నే నిద్రలేచిన కొద్దిసేపటి తరువాత ఒక్కసారిగా కడుపునొప్పి మొదలైంది. దీంతో.. పాఠశాలకు ఎదురుగా ఉన్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్ననికి 26 మంది కోలుకోవడంతో వారు పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, అరుణ్‌కుమార్ (10వ తరగతి), శామ్యూల్ (5వ తరగతి), కె. రవి (3వ తరగతి)కి బీపీ అధికంగా ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఈ ముగ్గుర్నీ చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ పాఠశాలలో మొత్తం 240 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. కలుషిత పెరుగే కారణమా!?..ఈ ఆశ్రమ పాఠశాలకు పెరుగు సరఫరా లేకపోవడంతో నిర్వాహకులు పాలను తోడుపెడుతున్నారు. కానీ, పాలు తోడుకోలేదని బుధవారం మధ్యాహ్నం ఎండలో పెట్టడంతో పెరుగు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఉదయాన్నే జర్రెల ఆశ్రమ పాఠశాల, ఆస్పత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించి ఘటనపై విచారణ జరిపారు. పెరుగు కలుషితంపై వివరాలు సేకరించారు. అలాగే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ నేత చిలకల రవికుమార్, ఏబీవీపీ నేత తిరుపల్లి యోగిలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంవల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తతదళిత విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళనకు దిగిన 3 వేల మంది విద్యార్థులు తమ కుమారుణ్ని అన్యాయంగా చంపేశారంటూ తల్లిదండ్రుల ఆవేదన8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన డైరెక్టర్ శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బుధవారం దళిత విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గుంటూరుకు చెందిన సృజన్‌కు మద్దతుగా కళాశాలలోని 3 వేల మంది విద్యార్థులు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. యాజమాన్యం తీరుపై నిరసన గళం వినిపించారు. సృజన్ ఆత్మహత్య చేసుకునేలా సీనియర్లు ప్రవర్తించారని, బుధవారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడని, సరిగా చదవడని ఒత్తిడితోనే చనిపోయాడంటూ యాజమాన్యం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బిడ్డను అన్యాయంగా నాలుగు గంటలపాటు కొట్టి చంపేశారని, అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీశారని, సమాచారం కూడా ఆలస్యంగా ఇచ్చారని సృజన్ తల్లిదండ్రులు వాపోయారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు సైతం కళాశాల డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, రిజిస్ట్రార్ అమరేంద్రలతో వాగ్వాదానికి దిగారు. చివరికి శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది విద్యార్థుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం క్యాంపస్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు 8 మందిని సస్పెండ్ చేశారు.భోజనం సరిగా పెట్టడం లేదువారానికి ఆరు సార్లకు బదులుగా రెండు సార్లే గుడ్లు ఇస్తున్నారు ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలికి విద్యార్థుల ఫిర్యాదు మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులో ఉన్న ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారాన్ని మెనూ ప్రకారం అందించడం లేదని ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి ఎదుట విద్యారి్థనులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వారానికి ఆరు సార్లు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. సాయంత్రం పండ్లు ఇవ్వడం లేదని, 301 మంది విద్యార్థినులు ఉండగా, రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తున్నారని, తాగునీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది పిల్లలతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదని, మళ్లీ అన్నం కోసం వెళితే తిడుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. అలాగే వంట సిబ్బందిని కూడా తొలగించాలన్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని, కమిషన్ తరఫున కూడా సుమోటోగా తీసుకుంటామని తెలిపారు. -
15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.50 మంది విద్యార్థినులు డిశ్చార్జిరెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్‌ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలుసాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. ‘పెండింగ్‌లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమతించొద్దు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. -
గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక
జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు. ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్ఎం తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్ రాజేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్‌కుమార్ విచారణ చేపట్టారు. నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్‌కుమార్ -
స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని..
ఖమ్మం క్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో పాశవికంగా హత్యకు గురైన విద్యార్థి జోసఫ్(10) హత్య కేసు మిస్టరీ వీడింది. అదేరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న పదో తరగతి విద్యార్థే ఈ బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తలారి వెంకటేశ్వర్లు, వినోదల కుమారుడు ఖమ్మంలో పదో తరగతి చదువుతూ.. గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఉంటున్నాడు. ఇతడికి స్వలింగ సంపర్కం అలవాటైంది. ఈ క్రమంలో ఈనెల 23న జోసఫ్‌ను సైకిల్‌పై తిప్పి.. వసృతి గృహానికి తీసుకొచ్చాడు. ఎవరూ లేనిది చూసి జోసఫ్‌పై స్వలింగ సంపర్కానికి ఉపక్రమించగా.. అతడు ఒప్పుకోలేదు. దీంతో జోసఫ్‌పై దుప్పటి కప్పి రాళ్లతో కొట్టి చంపాడు. అలాగే దాదాపు రెండేళ్ల క్రితం పాల్వంచలో ఓ మూగ బాలుడైన సంతోష్‌ను ఆడుకుందామని తీసుకెళ్లి ఇదే తరహాలో స్వలింగ సంపర్కానికి ప్రేరేపించగా.. అతడు ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేసి.. రెండు రోజులపాటు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచి ఉంచాడు. -
ఆగని మరణ మృదంగం
రెండు నెలల్లో పదిమంది మృతి ఆశ్రమాల్లో మెరుగుపడని వైద్యసేవలు రక్తహీనతతో చిన్నారుల విలవిల ఏటేటా కబళిస్తున్న వ్యాధులు నిన్న మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో..నేడు జోలాపుట్టు బాలుర ఆశ్రమ వసతి గృహంలో.. ఇలా ఏజెన్సీలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. రెండు నెలల్లో పదిమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారుల చర్యలు కానరావడం లేదన్న ఆందోళన తల్లిదండ్రులు, గిరిజన, ప్రజాసంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో 1649 మంది చిన్నారులు చనిపోయారు. పౌష్టికాహార లోపంతో విద్యార్థులు రక్తహీనతకు గురవుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గి వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐటీడీఏ గతేడాది నుంచి నిర్వహిస్తున్న హెచ్‌బీ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయింది. పాడేరు/ముంచంగిపుట్టు: ఆశ్రమ విద్యార్థులకు వైద్య సేవలు అందనంత దూరంలో ఉంటున్నాయి. ఇటీవ చోటుచేసుకుంటున్న సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. గురువారం హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. దీనిని మరిచిపోకముందే ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ వసతి గృహాం విద్యార్థి డురు సోమరాజు(9) శుక్రవారం ఇదే పరిస్థితుల్లో ఆకస్మికంగా మృతి చెందాడు. జోలాపుట్టు పంచాయతీ గొడ్డిపుట్టుకు చెందిన సోమరాజు ఆశ్రమంలో ఉంటూ అదే గ్రామంలోని ఎంపీపీఏస్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్వగ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం ఉదయం కడుపు, తలనోప్పిగా ఉందంటూ హాస్టల్ గదిలో పడుకున్నాడు. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం మేరకు ఆశ్రమానికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతదేహంతో తండ్రి ధనుర్జయ్, బంధువులు, గిరిజన సంఘం నాయకులు కె.అప్పల నర్సయ్య, కె.త్రినాధ్, పి.శాస్త్రిబాబులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.శ్యాంబాబు, ఏటీడబ్ల్యూవో వై.శాంతకుమారి వచ్చి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పరిస్థితి గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల దృష్టికి వెళ్లింది. ఆమె ఏటీడబ్ల్యూవోతో ఫోన్లో మాట్లాడారు. రూ.2లక్షలు పరిహారం పరిహారం ఇస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టానికి విద్యార్థి మృతదేహన్ని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఆశ్రమ పాఠశాల నుంచి విద్యార్థులు అదృశ్యం
రంపచోడవరం : తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహం నుంచి ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మూడో రోజుల క్రితమై విద్యార్థులు అదృశ్యమైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


