breaking news
tribal gods
-
నా కామెంట్లను వక్రీకరిస్తున్నారు: చినజీయర్ స్వామి
సాక్షి, విజయవాడ: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి ఎలా పుట్టుకువచ్చాయో తెలియదు. గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని నా వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు. ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదు. మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే ఆ వ్యాఖ్యల ఆంతర్యం తెలుస్తుంది. వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే జాలిపడాల్సి వస్తుంది. పైగా ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. ఎవరినీ చిన్నచూపు చూడం అనేది ఉండదు. ఒకళ్లని లేదా కొంత మంది దేవతలను చిన్నచూపు చూసే అలవాటు అస్సలు లేదు. అందర్నీ గౌరవించాలన్నదే మా విధానం. అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. వివాదంపై వారికే వదిలేస్తున్నా అని వివరణ ఇచ్చుకున్నారు చినజీయర్ స్వామి. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారు. ఆదివాసీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వీలైనంత సేవ చేస్తున్నాం. మాకు కుల, మతం తేడాల్లేవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మతాలకతీతంగా ప్రజలు వస్తుంటారు. కులాన్ని పక్కనపెట్టి.. జ్ఞానసంపదను ఆరాధించాలి. ఇదే రామానుజాచార్యులవారు చెప్పింది. ఆదివాసీలకు ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చాం. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించం. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తూ వివాదం చేయడం సరికాదన్నారు చినజీయర్ స్వామి. -
తల్లులు వనమెల్లె...ప్రణమిల్లె
వైభవంగా గిరిజన దేవతల వనప్రవేశం కన్నెపల్లికి చేరిన వెన్నెలమ్మ చిలకలగుట్టకు సమ్మక్క కోటిమందికిపైగా భక్తుల మొక్కులు తెలంగాణ కుంభమేళా... మేడారం మహా జాతర శనివారం వైభవంగా ముగిసింది. గిరిజన ఆరాధ్య దైవాలు... భక్తజన ఇలవేల్పులు... వన దేవతలు అయిన సమ్మక్క-సారలమ్మ తల్లుల వనప్రవేశంతో తుది ఘట్టానికి తెరపడింది. అమ్మల దర్శనానికి ముందస్తుగా వచ్చిన భక్తులతో పులకించిన మేడారం... అసలు జాతర నాలుగు రోజుల్లో సరికొత్త శోభను సంతరించుకుంది. జనసంద్రమైన జంపన్నవాగు శివసత్తుల పూనకాలతో హోరెత్తగా... భక్త‘కోటి’ మెక్కులతో తల్లుల ప్రతిరూపాలైన గద్దెలు కిక్కిరిసిపోయూయి. తల్లులు వనమెల్లగా... భక్తులు ప్రణమిల్లారు. భక్తుల తిరుగు ప్రయాణంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది... మన్యం బోసిపోయింది. సాక్షి, మేడారం : కోటి మంది భక్తుల కొంగుబంగారం.. సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేశారు. మొక్కులు, కానుకలు స్వీకరించిన చల్లని తల్లులు భక్త‘కోటి’కి దీవెనలు అందించి.. తిరుగు పయనమయ్యారు. శనివారం సాయంత్రం 6.01 గంటలకు సమ్మక్క తల్లి వనప్రవేశం చేసింది. సాయంత్రం 6.20 గంటలకు కన్నెపల్లి, కొండాయి, పూనుగొడ్లకు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పయనమయ్యారు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకుంటామని అభయమిస్తూ గిరిజన దేవతలు వనం చేరారు. అమ్మల వనప్రవేశ ఘట్టాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. సాయంత్రం మొదలైన పూజలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశ కార్యక్రమం సాయంత్రం 5.49 గంటలకు గిరిజన పూజారుల ప్రత్యేక పూజలతో ఆర్భాటంగా ప్రారంభమైంది. తొలుత సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ఇతర వడ్డెలు గద్దెలపైకి చేరుకున్నారు. అక్కడ గిరిజన ఆచారం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్కను గద్దెలపై నుంచి వడ్డెలు 6.01 బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వేలాదిగా తరలివచ్చిన భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లి తల్లిని వన ప్రవేశం చేయించారు. తల్లి వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమను స్థానికులు, భక్తులు తీసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ముగ్గురు ఒకేసారి అంతకుముందు పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజు పూజారులు కాళ్లకు గజ్జెలు, నడుముకు దట్టీలు ధరించారు. డోలీలు, బూరలు వాయిస్తుండగా పూజారులు పగిడిద్దరాజు గద్దెపై గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజు గద్దెలపై ఉన్న పడిగెల ను ఎత్తుకున్నారు. ఇదే పద్ధతిలో కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజుల పూజారులు సంప్రదాయం ప్రకారం పూజ లు నిర్వహించి, గోవిందరాజు పడిగెలను ఎత్తుకున్నారు. సారలమ్మకు పూజలు గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. అప్పటికే గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. దీంతో సారలమ్మ పూజలు చివరి దశకు చేరుకోగానే దేవతలు వనప్రవేశానికి సిద్ధమయ్యారు. వనప్రవేశ ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు దారి ఇవ్వాలంటూ మైకుల్లో ప్రకటించారు. గిరిజన పూజారులు, ఆదివాసీ యువకులు సారలమ్మకు దారి ఇచ్చేలా భక్తులను పక్కకు జరిపారు. సరిగ్గా సాయంత్రం 6.20 గంటలకు సారలమ్మ గద్దె దిగి కన్నెపల్లికి పయనమైంది. అప్పటికే పూజలు పూర్తయి సారలమ్మ కోసం ఎదురుచూస్తున్న పగిడిద్దరాజు, గోవిందరాజులను సారలమ్మను అనుసరిస్తూ గద్దెల ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లారు. దీంతో నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన మహాజాతర ముగిసినట్లయింది.