breaking news
tourism service
-
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘థామస్ కుక్’ దివాలా...
లండన్: ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా తీసింది. దీంతో దాదపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వానికి భారీగానే వ్యయం కానున్నది. బల్గేరియా, క్యూబా, అమెరికా, టర్కీ తదితర దేశాల నుంచి ఈ యాత్రీకుల తరలింపునకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలను ప్రకటించింది. ఆపరేషన్ మ్యాటర్‌హార్న్ పేరుతో ఈ తరలింపును తక్షణం ప్రారంభించింది. దీని కోసం డజన్ల కొద్దీ చార్టర్ విమానాలను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో బ్రిటీషర్లను స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. వేరే దారి లేక దివాలా.. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సోమవారం ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు, కొత్తగా రుణాలివ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందం కుదర్చడంలో శతథా ప్రయత్నాలు చేశామని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొంది. వేరే దారి లేక తక్షణం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది. ఆన్లైన్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడం, బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా హాలిడే ట్రిప్పులు, ప్యాకేజీల బుకింగ్స్ పడిపోవడం థామస్ కుక్ కష్టాలను మరింతగా పెంచింది. 2007లో మై ట్రావెల్ సంస్థను థామస్ కుక్ విలీనం చేసుకోవడం ఆ కంపెనీ పుట్టి మునగడానికి గల కారణాల్లో ఒకటి. వ్యయాలు తడిసి మోపెడై భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. 1841 నుంచి కార్యకలాపాలు.. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు. ఆరంభంలో ఇంగ్లాండ్‌లోని రైల్వే ప్రయాణికులకు పర్యాటక సేవలందించిన ఈ సంస్థ, ఆ తర్వాత విదేశీ యాత్రలను నిర్వహించడం మొదలు పెట్టింది. . పర్యాటకానికి సంబంధించి వివిధ రంగాల్లోకి విస్తరించింది. వార్షిక టర్నోవర్ 1,000 కోట్ల పౌండ్లు, ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందికి పర్యాటక సేవలందించే ఘనతలున్నప్పటికీ, భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు లండన్ స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ షేరును ఇటీవలే తొలగించారు. గోవా పర్యాటకంపై దెబ్బ థామస్ కుక్ దివాలా ప్రకటన గోవా పర్యాటకంపై తీవ్ర ప్రభావమే చూపించనున్నది. గత టూరిస్ట్ సీజన్లో దాదాపు 30 వేలమంది బ్రిటీషర్లు గోవా వచ్చారు. వీరంతా థామస్ కుక్ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానాల ద్వారా వచ్చిన వాళ్లే, రోజుకు 300 మందిని ఇంగ్లాండ్ నుంచి గోవాకు థామస్ కుక్ తీసుకువచ్చేది. ఒక్కో బ్రిటీషర్ గోవాలో సగటున రెండు వారాలు పాటు ఉంటారని అంచనా. ఇక థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గుతారని విశ్లేషకులంటున్నారు. కాగా థామస్ కుక్ భారత కార్యకలాపాలను 2012లో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసింది. థామస్ కుక్ యూకేకు, థామస్ కుక్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదిన థామస్ కుక్ ఇండియా స్పష్టం చేసింది. -
ఏపీ వైపు వచ్చే వాహనాల అడ్డగింత
► తెలంగాణ టూరిజం సిబ్బంది నిర్వాకం ► ఏపీ టూరిజం లాంచీలు మూసేశారంటూ దుష్ప్రచారం విజయపురి సౌత్: ఇటీవల షరతులతో కూడిన అనుమతులతో నాగార్జున కొండకు తెలంగాణ లాంచీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అయితే అధిక ఆదాయం ఆర్జించేందుకు తెలంగాణ టూరిజం సిబ్బంది నాగార్జునసాగర్ హిల్‌కాలనీ మీదుగా ఏపీ వైపు వచ్చే పర్యాటకుల వాహనాలను అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్‌లో ప్రముఖ ప్రదేశాలను తిలకించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తుంటారు. విజయపురి సౌత్‌లోని లాంచీ స్టేషన్ నుంచి లాంచీ సర్వీసులు పర్యాటకులను కొండకు చేరవేస్తుంటాయి. ఇక్కడ లాంచీ స్టేషన్ నుంచి నాగార్జున కొండ వెళ్లేందుకు పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుంది. అయితే నల్గొండ జిల్లా హిల్‌కాలనీ సాగర్ ఎర్త్ డ్యాం వద్ద తెలంగాణ టూరిజం అధికారులు రెండు లాంచీ సర్వీసులను నాగార్జునకొండకు ఏర్పాటు చేశారు. ఆ లాంచీలలో నాగార్జున కొండకు వెళ్తే తెలంగాణకు ఆదాయం లభిస్తుందనే ఉద్దేశంతో అక్కడి టూరిజం సిబ్బంది.. ఏపీలోని లాంచీ స్టేషన్ మూసివేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలంగాణ పర్యాటకులు ఏపీ వైపు రావటం లేదు. తెలంగాణ టూరిజం సిబ్బంది ఏపీ వైపు వచ్చే వాహనాలను అడ్డుకోవటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.