breaking news
tour operators
-
ట్రావెల్ ఆపరేటర్ల లాభాలకు బూస్ట్
ముంబై: ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 6–7 శాతం వృద్ధి చెందనున్నాయి. అలాగే కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 90 శాతం ఆదాయాన్ని రికవర్ చేసుకోనున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. కోవిడ్‌పరమైన ఆంక్షల వల్ల ప్రయాణాలు నిల్చిపోవడంతో రెండేళ్ల పాటు నష్టపోయిన ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభదాయకత .. 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 6–7 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్, విహార ప్రయాణాలు మెరుగుపడటంతో ఆదాయాలూ పెరగగలవని క్రిసిల్ తెలిపింది. కోవిడ్ సమయం నుంచి అమలు చేస్తున్న ఆటోమేషన్, వ్యయ నియంత్రణ విధానాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తిరిగి మహమ్మారి పూర్వ స్థాయిని (2020 ఆర్థిక సంవత్సరం) దాటేయొచ్చని తెలిపింది. 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటింగ్ సంస్థలు వరుసగా 25.8%, 2.7% మేర నిర్వహణ నష్టాలు ప్రకటించాయి. నివేదికలోని మరిన్ని అంశాలు. ► నిర్వహణ పనితీరు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, నికర రుణ రహితంగా ఉండటం వంటి అంశాలు ఆయా సంస్థలకు సహాయకరంగా ఉండనున్నాయి. ► స్వల్పకాలిక విహార యాత్రలకు.. (ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతాలకు) ప్రాధాన్యం పెరుగుతోంది. యూరోపియన్ దేశాల వీసాల జారీ పుంజుకోవడంతో రాబోయే వేసవి సెలవుల కోసం బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే, విహార యాత్రల కోసం అమెరికాకు వెళ్లే ధోరణులు రికవర్ కావడానికి మరింత సమయం పట్టనుంది. ► అంతర్జాతీయ మందగమనం సుదీర్ఘంగా కొనసాగవచ్చన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతుండటంతో రాకపోకలు మెరుగుపడనుండటం.. ఆదాయాల వృద్ధికి తోడ్పడనుంది. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
రండి ఎన్ని'కళ'ను చూడండి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. ప్రచారం కూడా జోరందుకుంటోంది. దాదాపు 80 కోట్ల మందికిపైగా ఓటర్లు పాల్గొంటున్న ఇంత భారీ ఎన్నికల ప్రక్రియను ప్రపంచ దేశాలన్నీ వేయికళ్లతో గమనించనున్నాయి. ఇది ఒకరకంగా మన వ్యాపార వర్గాలకు కూడా పంట పండించనుంది. ఈ ఆసక్తినే సొమ్ముచేసుకోవడానికి దేశీయ టూర్ ఆపరేటర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలను ప్రత్యక్షంగా భారత్‌లోనే చూసేందుకు రారమ్మంటూ ‘పోల్ టూరిజం’ పేరుతో విదేశీ టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. ఆ కథేంటో మీరూ చూడండి!! భారతీయ ఎన్నికల కురుక్షేత్రంలో అంతుచిక్కని ఎత్తులు... రాజకీయ పార్టీల వ్యూహాలు... భారీ బహిరంగ సభలు ఇవన్నీ ఎవరికైనా ఉత్కంఠను రేకెత్తించేవే. ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందడి, కోలాహలాన్ని విదేశీయులూ చవిచూడనున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ ఇందుకోసం వినూత్న ప్యాకేజీలకు తెరతీసింది. గుజరాత్ టూరిజం డెవలప్మెంట్ సొసైటీకి చైర్మన్ కూడా అయిన ఈ సంస్థ అధిపతి మనీష్ శర్మ దేశవ్యాప్తంగా 60కి పైగా టూర్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని మరీ విదేశీ టూరిస్ట్‌లకు భారత్ ఎన్నికల సిత్రాలను చూపించేపనిలో పడ్డారు. ఇంకా పారిస్, ఆమ్స్టర్డామ్, దుబాయ్, అబుదాబి, లండన్, బీజింగ్, టోక్యో తదితర దేశాల్లోని టూర్ ఆపరేటర్లతోనూ ‘పోల్ టూరిజం’ను ప్రోత్సహించడం కోసం జట్టుకట్టారు. బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ ట్రావెల్ అండ్ టూరిజమ్ సదస్సు (ఐటీబీ- ఇంటర్నేషనల్ టూరిస్మస్ బోర్స్) సందర్భంగా ఈ పోల్ టూరిజం ప్యాకేజీలకు విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించామని ఆయన చెబుతున్నారు. 100కు పైగా దేశాలనుంచి ఈ సదస్సుకు హాజరైన టూర్ ఆపరేటర్లు, హోటళ్ల ప్రతినిధులు, ఆతిథ్య రంగ ప్రముఖులకు దీన్ని వివరించామన్నారు. దీంతో ఇప్పటికే తమకు ఈ ఎన్నికల ప్యాకేజీల గురించి విదేశీ పర్యాటకుల నుంచి 800కు పైగా కాల్స్(ఎంక్వయిరీలు) లభించాయని.. ఇందులో లండన్, ఉక్రెయిన్, బీజింగ్, సింగపూర్, ఫ్రాన్స్‌ల నుంచి అత్యధికంగా ఆసక్తి వ్యక్తమైందని శర్మ చెప్పారు. ఎంతమంది రావచ్చు? 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చాలా తక్కువ వ్యవధిలోనే ఈ ప్యాకేజీలను నిర్వహించామని... అయినా 90 మంది విదేశీ టూరిస్టులను ఆకర్షించగలిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కావడం ప్రపంచంలోనే అతిపెద్ద ఘట్టం కానున్న నేపథ్యంలో మా ప్యాకేజీలకు మరింత డిమాండ్ లభించనుందని.. 2,000 వరకూ పర్యాటకులను చేజిక్కించుకోగలమని శర్మ అంచనా వేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియ గురించి పెద్దగా అవగాహనలేని ఈజిప్ట్, ఇతరత్రా గల్ఫ్ దేశాల నుంచి ఎక్కుమందిని ఆకర్షించే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం. దక్షిణ భారత్‌లో ప్రధానంగా రాజకీయ రంగంలో ర్యాలీలు, భారీ కటౌట్లు, వేలకొద్దీ జనంతో కిక్కిరిసే బహిరంగ సభలు ఇవన్నీ చాలావరకూ విదేశీయులకు జీవితంలో ఒక్కసారైనా చూసితీరాల్సిన ఘట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర నగరాల్లో అక్షర్ ట్రావెల్స్తో జట్టుకట్టిన భాగస్వామ్య ఆపరేటర్లు కూడా ఈ నయా కాన్సెప్ట్ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాతో ఉన్నారు. ‘ఇప్పటిదాకా మేం ఇలాంటి వినూత్న ప్యాకేజీలను అందించలేదు. ఇప్పుడు ఎన్నికల సందడిని విదేశీ టూరిస్టులకు ఆఫర్ చేయడం మాకుకూడా కొత్త అనుభూతిని మిగల్చనుంది’ అని ఐడియల్ లీజర్ హాలిడే ప్రతినిధి పీకే మండల్ పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు భారత్‌కు ఈ సంస్థ టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ప్యాకేజీలు ఇలా... ఒక పూర్తిస్థాయి పోల్ టూరిజం ప్యాకేజీ విలువ ఒక వ్యక్తికి 1,200-1,800 డాలర్ల మధ్య(మన కరెన్సీలో రూ.75,000-1,12,000) ఉంటుందని అంచనా. 6 రాత్రులు-7రోజుల ట్రిప్‌లో ఆహారం, బస, రవాణా ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. దీంతోపాటు భారత్‌లోని ప్రధాన టూరిస్ట్ గమ్యస్థానాలతోపాటు రాజకీయ పార్టీల ర్యాలీల్లోనూ పాల్గొనేలా ప్యాకేజీని రూపొందించారు. అంతేకాదు వివిధ పార్టీల నాయకులతో మాట్లాడటం ద్వారా ఎలక్షన్ మజాను ఆస్వాదించే అవకాశాన్నీ కల్పిస్తారు . ఉదాహరణకు ఢిల్లీ-ఆగ్రా-జైపూర్ ప్యాకేజీనే తీసుకుంటే... పర్యాటకులు దేశ రాజధానిలోని ముఖ్యమైన ప్రాంతాల సందర్శన అక్కడ నిర్వహించే ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను తిలకించే ఏర్పాటు చేస్తారు. సాయంకాల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలుసుకునేలా ప్యాకేజీ ఉంటుంది. ప్రధాన ప్యాకేజీ రూట్లు...: ఢిల్లీ-బికనీర్-జైసల్మేర్-జోధ్‌పూర్; అహ్మదాబాద్-రాజ్‌కోట్-గోండల్; ద్వారక-పోర్బందర్-సాసన్-గిర్; లక్నో-అయోధ్య-వారణాసి; ఢిల్లీ-సిమ్లా-మనాలీ-చండీగఢ్; మథుర-ఆగ్రా-హరిద్వార్-రిషికేశ్-ఢిల్లీ; కొచ్చిన్-మున్నార్-థెక్కడి; గువాహటి-కజిరంగా-షిల్లాంగ్; గాంగ్టక్-లాషెన్-పెలింగ్ వంటి రూట్లు ప్రముఖ ప్యాకేజీల్లో ఉన్నాయి. అయితే, ఢిల్లీ-ఆగ్రా-జైపూర్ సర్క్యూట్‌కు అత్యధికంగా ఎంక్వయిరీలు లభించినట్లు సమాచారం. మరి దీనికి అనుమతులో.. అసలే తీరికలేని ఎన్నికల తంతులో మునిగితేలే రాజకీయ నాయకులను కలుసుకోవడం సాధ్యమేనా? అనే ప్రశ్న సహజంగా వినిపిస్తుంది. ఇందుకోసం తాము అన్ని ప్రధాన పార్టీలతోనూ మాట్లాడామని, ఈ వినూత్న కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పినట్లు శర్మ వెల్లడించారు. ప్రధాన నాయకులు అందుబాటు కష్టం కానుండటంతో ద్వితీయ శ్రేణి లీడర్లతో ముఖాముఖికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. మరోపక్క, విదేశీ పర్యాటకులు పోలింగ్ బూత్‌లను సందర్శించేందుకు కూడా వీలుకల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘాన్ని తమ టూర్ ఆపరేటర్ల బృందం సంప్రదించిందని ఆయన చెప్పారు.