breaking news
TIM machines
-
ప్రైవేట్ కండక్టర్ల చేతికి టికెట్ మెషిన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు చార్జీలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడికక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతుండడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీఏ అధికారులు నగరంలో పలు చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆర్టీసీ గ్రేటర్ జోన్ సైతం చర్యలు తీసుకుంటోంది. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు సెలవులు ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. శివార్లలోని ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కానీ ఈలోగా సమ్మె ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న బస్సులన్నింటిలో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి వినియోగంపై ప్రైవేట్ కండక్టర్లకు శిక్షణనిచ్చి రెగ్యులర్ సిబ్బంది తరహాలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ‘టిమ్స్’తో సేవలు పారదర్శకం... ప్రస్తుతం టికెట్ల జారీ విధానం లేకుండా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రూట్లో ఏ కండక్టర్ నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే విషయంపై అధికారులకు అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రైవేట్ కండక్టర్లు కచ్చితంగా టికెట్ మెషిన్లను వినియోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడమే మంచిదని అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. టికెట్ల జారీతో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో ఆయా రూట్లలో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత వస్తుంది. అలాగే సిటీ బస్సుల నిర్వహణపై డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది కండక్టర్లు, డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. శుక్రవారం నాటికి 1300 బస్సులను రోడ్డెక్కించినట్లు అధికారులు తెలిపారు. మరో 2,300లకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారుల హెచ్చరిక... ప్రయాణికుల నుంచి చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతీయ రవాణా అధికారి సీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శీతల్ చౌహాన్ బృందం అక్కడి బస్టాప్ వద్ద తనిఖీలు నిర్వహించింది. మెహిదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లను సీరియస్‌గా హెచ్చరించింది. ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు తీసుకుంటే డ్యూటీలోకి తీసుకోబోమని, నేరుగా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కండక్టర్ల వద్దనున్న టికెట్ చార్ట్‌లను పరిశీలించారు. చార్ట్ ప్రకారమే డబ్బులివ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
ఇకపై బస్ కండక్టర్లు ఉండరట..!
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల విధానానికి మంగళం పాడాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. కొత్తగా వచ్చే బస్సులను వీలైనంతవరకు పూర్తిగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్(టిమ్) సర్వీసులుగా మార్చాలనే యోచనలో ఉంది. ఈ సర్వీసుల్లో బస్సు డ్రైవర్లే ప్రయాణీకులకు టిక్కెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం వినియోగిస్తున్న టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్లతో ఇప్పటికే కొన్ని బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో 1,200 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో తాజా పరిణామం ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. సిటీ బస్సుల్లో మినహా మిగతా అన్ని రకాల సర్వీసుల్లో టిమ్ మిషన్ల ద్వారా డ్రైవర్లే టికెట్లు జారీ చేయాల్సివుంటుంది. ప్రస్తుతం దూర, సుదూర ప్రాంతాలకు నడిచే గరుడ, సూపర్ లగ్జరీ, కొన్ని డీలక్స్ సర్వీసుల్లో వీటిని డ్రైవర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, కొత్త బస్సులను రోడ్డు మీదకు పంపే రోజు నుంచి పల్లె వెలుగు, మిగిలిన సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది.