breaking news
Ticket collection
-
టిక్కెట్ కలెక్షన్ .. యమ టెన్షన్
కొత్తపేట, న్యూస్‌లైన్ :ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటంగా మారిం ది. కొన్ని దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా టూ ఇన్ వన్ మాదిరిగా వేస్తున్న డ్యూ టీలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. విజయవాడ - కాకినాడ, గుంటూరు - అమలాపురం వంటి దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా ఆ పని కూడా డ్రైవర్‌కే అప్పగించడం వల్ల ఆర్టీసీకి ఒక ఉద్యోగి కలిసి వస్తాడు. డ్రైవర్ బస్సు నడుస్తుండగానే టికెట్ ఇచ్చే పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రమాదాలు సంభవించేలా ఉన్నాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-కాకినాడ వయా మండపేట, రామచంద్రపురం డీలక్స్ బస్ సర్వీసు రావులపాలెం నుంచి కాకినాడ గంటన్నర సమయంలో చేరుకోవాలి. కానీ రెండున్నర గంటలు సమయం పట్టింది. టూ ఇన్ వన్ డ్యూటీ కాకుండా సాధారణంగా డ్రైవర్, కండక్టరు సర్వీసు బస్ అయితే నిర్ణీత సమయానికే చేరుకుంటుంది. కానీ రెండు డ్యూటీలు ఒక్కరే (డ్రైవర్) చేయడం వల్ల గంట ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. అదనంగా గంట సేపు ప్రయాణికులు బస్సులో అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలమూరు-రామచంద్రపురం మధ్య చాలా వరకు ఓ వైపు పంట కాలువలు, మరో వైపు డ్రెయిన్ మధ్యలో రెండు లైన్ల రహదారి ఉన్నాయి. ఆదివారం ఓ బస్సు సర్వీసులో డ్రైవర్ స్టీరింగ్ వదిలి సొమ్ము లెక్క పెడుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రమాదాలు రెప్పపాటులో జరిగే అవకాశం ఉందని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ విధానం బస్సులోని సుమారు 55 మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం కాదా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కం కండక్టరు విధానం రద్దు చేసి ఎవరి డ్యూటీ వారు చేసేలా ఇద్దరితో సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరారు. -
అంజన్న దర్శనం భారం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : పేదల దేవుడిగా పేరొందిన కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లే భక్తులకు అడ్డంకులు మొదలవ్వనున్నాయి. కొండ మార్గానికి వేగంగా చేరుకునేందుకు ఉపయోగపడుతుందనుకున్న రోప్‌వే(తాడు మార్గం) భక్తుల జేబులకు చిల్లులు పెట్టనుంది. ప్రభుత్వ పరంగా నిర్మించి భక్తులు ఉచితంగా కొండపైకి వెళ్లేందుకు ఉపయోగపడుతుందనుకున్న రోప్‌వేపై ప్రైవేటు కంపెనీల కళ్లు పడ్డాయి. రూ.7 కోట్లతో రోప్‌వే నిర్మించి.. వడ్డీతో సహా ఈ ఖర్చులు రాబట్టే వరకు భక్తుల నుంచి టిక్కెట్ వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిర్మించి, నిర్వహించి, బదలాయించే(బీవోటీ) పద్ధతిలో అమలు చేస్తామని, కనీసం 25 ఏళ్లు భక్తులకు టిక్కెట్ పెడతామని ప్రాజెక్టు రూపొందించింది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీకి రాష్ట్రంలోని శ్రీశైలం రోప్‌వే నిర్మాణం చేసిన అనుభవం ఉన్నట్లు తెలిసింది. కొండగట్టులో మాత్రం నిర్మాణం తామే చేసి నిర్వహణ కూడా చూస్తామని ప్రతిపాదించింది. రోప్వో ఖర్చు రాబట్టుకునే క్రమంలో కొండపైకి నడిచివెళ్లే భక్తుల విషయంలోనూ కొన్ని ఆంక్షలు విధించక తప్పదని ప్రాజెక్టు రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్వహణ ప్రైవేటు కంపెనీ పరిధిలో ఉన్నన్ని రోజులు ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నియంత్రిస్తారని చెబుతున్నారు. రోప్‌వే తో కొండపైకి వెళ్లే ఒక్కో భక్తుడికి కనీసం రూ.80 నుంచి రూ.100 చొప్పున టిక్కెట్ రుసుము ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాల్లో అభ్యంతరాలను పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ఆమోదానికి వెళ్లనుంది. ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపితే జేబు నిండా డబ్బులు తెచ్చుకునే భక్తులకు మాత్రమే అంజన్న వద్దకు చేరుకునే భాగ్యం ఉంటుంది. అనుకున్నదొక్కటి... వామపక్ష ఉద్యమం తీవ్రత తగ్గి రవాణా వసతులు మెరుగవడంతో పదేళ్లుగా కొండగట్టు అంజన్న వద్దకు భక్తుల రాక భారీగా పెరిగింది. మొదట్లో కేవలం కొండపైన ఉన్న చిన్న గుడి... ఇప్పుడు పెద్ద పట్టణంగా తయారైంది. కొండగట్టుకు ఇప్పుడు సగటున రోజుకు మూడు వేల మంది భక్తులు వస్తారు. కొండగట్టు కాలినడక మార్గం నుంచి అంజన్న వద్దకు 750 మీటర్ల పొడవైన రోప్‌వే అవసరమని నిఫుణులు అంచనా వేశారు. దీనికోసం రూ.7 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పరంగానే జరుగుతుందని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇన్నాళ్లుగా ప్రకటిస్తూ వచ్చారు. వీరి ప్రకటనలు అమల్లోకి వస్తే మంచి వసతులు ఉంటాయని భక్తులు ఆశించారు. ఇంత మొత్తంతో రోప్‌వే చేపట్టడం తమ వల్ల కాదని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీ ఇక్కడి ఆదాయంపై కన్నేసింది. నిర్వహణలో ఇబ్బందుల కారణంగానే ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని చెబుతున్న అధికారులు... ప్రైవేటు కంపెనీకి ఇది ఎలా సాధ్యమనే సందేహాలకు జవాబివ్వడంలేదు. రోప్‌వే ఏర్పాటు చేసిన కంపెనీ... నడకదారిలో వచ్చే భక్తులను, వాహనాలను నియంత్రిస్తే ఏమిటనే సందేహాలకు ఎవరూ స్పందించడంలేదు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు ఇలా ఓ ప్రైవేటు సంస్థకు ఆదాయ వనరుగా ఎలా మారిందనే విషయంపైనా అధికారులు స్పందించడం లేదు. రోప్‌వే ప్రాజెక్టు అంశాలు ఏమిటనే విషయంపై పర్యాటక శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు.