breaking news
Theatrical performance
-
అబద్ధం... నిజమైంది!
అనుభవం నేనొక నటుడ్ని. ప్రకాశం జిల్లా రావులపాలెంలో నాటక ప్రదర్శన ముగించుకొని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి వచ్చేశాం. మా ‘అహంబ్రహ్మ’ నాటక ప్రదర్శన సాయంత్రం ఆరు గంటలకి కదా అని, నేను, మా సాంకేతిక నిపుణుడు ‘సింహా’ సినిమాకి రహస్యంగా వెళ్లాం. సినిమా సగం నడిచింది. ఇంటర్వెల్లో ఫోన్ చూస్తే పందొమ్మిది మిస్డ్కాల్స్. భయపడుతూనే ఫోన్ చేశా. మా సహనటుడు ‘‘రా. ఎక్కడున్నా?’’వని గట్టిగా అడిగాడు. అంతే! ఒక్క ఉదుటున రిహార్సల్స్‌లో ప్రత్యక్షమయ్యా. మా దర్శకులు ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తే, పర్సు పోయిందని, వెతకడంలో ఆలస్యమయిందని అబద్ధం చెప్పేశా. రిహార్సల్స్, నాటక ప్రదర్శన పూర్తయింది. పాలకొల్లుకి బయల్దేరాం. ట్రైన్లో శనగలు అమ్ముతున్న ముసలావిడ కొనమని బతిమాలింది. జేబులోకి చెయ్యి దూర్చా. అంతే! పర్సు లేదు. పర్సు పోయిందని మధ్యాహ్నమే చెప్పాను కదా, నిజంగా పోయినా నోరు మెదపలేకపోతున్నాను. నన్ను నేనే తిట్టుకొని బాధపడ్డాను. నిజాన్ని దాచటం ఎంత కష్టమో అబద్ధాన్ని చెప్పడం అంతే నేరమని అప్పుడే తెలిసింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొస్తే, నామీద అసహ్యం కలుగుతుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరుపతికి మహతీ ఆడిటోరియంలో నాటక ప్రదర్శన కోసం వెళ్లాం. ఒక అమ్మాయి నుంచి ఫోన్. ‘‘మాది బుచ్చిరెడ్డిపాలెం. నా పేరు మంజులాదేవి. నేను షాపింగ్కెళ్లి వస్తుంటే దార్లో మీ పర్సు కనబడింది. అందులోని మీ నంబరు చూసి ఫోన్ చేశా. ఇందులో మీ ఐడెంటిటీ కార్డు, మూడు వేలు, ఇతర ప్రూఫ్స్ ఉన్నాయి’’ అని చెప్పింది. బ్యాంకు అకౌంటు నంబరు చెప్తే డిపాజిట్ చేస్తానంది. నా డబ్బులు నాకు అందాయి. అందుకు కృతజ్ఞతలు తెలిపాను. కాని ఆమె మంచితనమే నన్ను మార్చివేసింది. - బొడ్డుపల్లి హరికృష్ణ -
ఎవరికీ భయపడను
థియేటర్.. భారతీయ ప్రాచీన కళ! దాన్నిప్పటికీ బతికిస్తున్న అతికొద్దిమందిలో అమీర్ రజా హుస్సేన్ ఒకరు! పద్మశ్రీ వరించిన ఈ థియేటర్ పర్సనాలిటీ తన నాటక ప్రదర్శన కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు.సిటీప్లస్‌తో ముచ్చటించారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. - అమీర్ రజా హుస్సేన్ రంగస్థల ప్రముఖుడు ఇక్కడి థియేటర్‌తో నాకు అంతగా పరిచయం లేదు. ఎప్పుడు వచ్చినా ఓ వారం కోసం వస్తాను ఇక్కడికి. అందులో అయిదు రోజులు నా రిహార్సల్స్‌కి, ఓ రోజు నాటక ప్రదర్శనకి.. ఇంకో రోజు షాపింగ్‌కి అయిపోతుంది. హైదరాబాద్ ఉర్దూ జుబాన్ (ఉర్దూ భాష), ముఖ్యంగా ఈ సిటీ ఒరిజినాలిటీ నాకు చాలా ఇష్టం. చార్మినార్ చుడీబజార్.. ఆ దగ్గరలోని ఏరియాలన్నీ తిరుగుతుంటా. ఇత్తడి సామాన్లు దొరికే గల్లీలు, వెండి సామాన్లు చేసే చోటికీ వెళ్తుంటా. నచ్చినవి కొనుక్కుంటా. లోకల్ ఫ్లేవర్ నేను వెరీ ఫాండ్ ఆఫ్ హైదరాబాద్ ఫుడ్. ఇక్కడి బిర్యానీకి ఏదీ సాటిరాదు. ఒకసారి హైదరాబాదీ ఫ్రెండ్ ఒకరు నన్ను డిన్నర్‌కి పిలిచాడు. తందూరీ బకరా సర్వ్ చేశారు. దాని పొట్టను కట్ చేస్తే లోపల రైస్, దాని లోపల తందూరీ చికెన్... చికెన్ ఓపెన్ చేస్తే దాంట్లో రైస్, లోపల ఉడికించిన గుడ్డు... వాట్ ఎ ఫెంటాస్టిక్ డిన్నర్.. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఆ హాస్పిటాలిటీ.. ఆ టేస్ట్ హైదరాబాద్‌కే ప్రత్యేకం. రెస్పాన్స్ ఒకటే నా నాటకాలకు ఏ సిటీలో అయినా ఒకటే రెస్పాన్స్ ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ముంబై, ఢిల్లీల్లో ఎక్కడ షో ఇచ్చినా సేమ్ రెస్పాన్స్. ఎందుకంటే.. ఇప్పుడు అన్నీ ట్రాన్సఫరబుల్ జాబ్సే. నా షోస్ ఏవీ ఉర్దూ, తెలుగులాంటి లోకల్ భాషల్లో వుండవు. ఇంగ్లిష్‌లోనే వుంటాయి. దానికి మైగ్రేటెడ్ ఆడియెన్సే ఉంటారు. కాబట్టి సేమ్ ఆడియెన్స్.. సేమ్ రెస్పాన్స్! డ్రామాపై సినిమా ప్రభావం.. అల్లా దయ వల్ల డ్రామాపై సినిమా ప్రభావం లేదనే చెప్పాలి. థియేటర్లో రెండు రకాల వాళ్లున్నారు. థియేటర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు, సినిమా ఎంట్రీ కోసం దీన్ని నిచ్చెనగా వాడుకునేవాళ్లు. సీరియస్ థియేటర్ ఆర్టిస్ట్‌లు వేరే ప్రభావాలకు లోనయ్యే అవకాశం వుండదు. లెజెండ్ రామా.. నా డ్రామాలకు.. మైథాలజీ, హిస్టారిక్, కాంటెంపరరీ థీమ్ ఏదైనా నాకు ఒకటే. రామాయణాన్ని నాటకంగా.. ప్రపంచంలోనే పెద్ద షోగా చూపించేందుకు ప్రిపేరయ్యాను. అయితే బాబ్రీ మస్జిద్ సంఘటన జరిగి అప్పటికి రెండేళ్లు. వెల్‌విషర్స్ జాగ్రత్తగా ఉండమన్నారు. అపోజిషన్‌లో ఉన్న ఎల్కే అద్వానీని కలిశాను. అప్పటికి ఆయనకు నేనెవరో తెలియదు. ‘ప్రపంచంలో ఎవరూ చెయ్యనంత పెద్ద షో రాయాయణ్ మీద చేస్తున్నాను. స్క్రిప్ట్ చదివి అభ్యంతరాలేవైనా ఉంటే చెప్పండి. ఓకే అంటేనే షో చేస్తాను’ అన్నాను. ఆయన చదివి బాగుందని ప్రెస్మీట్లో చెప్పారు. మొదటి షోని నా మిత్రుడు, అప్పటి ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ హోస్ట్ చేశారు. 102 మంది అంబాసిడర్స్ వచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ చీఫ్ గెస్ట్. అదీ కథ. నా పనిలో దమ్మున్నంత వరకు ఎవరికీ భయపడను. నాటకాలు .. రాజకీయాలు ఇవి ఒకే నాణేనికి ఇరువైపులు. నాయకుడు, నటుడు ఇద్దరూ నటిస్తారు. తద్వారా కోట్ల మందిని బురిడీ కొట్టించగలరు. కానీ నాకు మాత్రం నా వృత్తి, ప్రవృత్తి థియేటర్. పాలిటిక్స్.. పాస్టైమే. పన్నీరైజేషన్ ఆఫ్ ఇండియా... దేశంలో ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి లోకల్ ఫుడ్‌ను టేస్ట్ చేద్దామంటే అసలు దొరకట్లేదు. ఏ ధాబాకు వెళ్లినా పన్నీర్ లాంటి పంజాబీ వెరైటీసే. ఇంకోవైపు బర్గర్, పీజా, చికెన్ బకెట్ లాంటి హవా ఉండనే ఉంది. కలల నగరం సిటీ ఆఫ్ డ్రీమ్స్.. చరిత్ర, వారసత్వ సంపద వున్న కలల నగరం. ఈ కొత్త ప్రభుత్వం ఆ హెరిటేజ్‌ని కాపాడుతుందని ఆశిస్తున్నాను. ముంబై, కోల్‌కతా ఒరిజినాలిటీని పోగొట్టుకున్నాయి. బెంగళూరు ఆత్మ లేకుండా బతుకుతోంది. ఈ దేశంలో సోల్‌తో కనిపించే నగరాలు రెండే రెండు. ఒకటి హైదరాబాద్, ఇంకోటి లక్నో. ఇప్పుడది ఆ ప్రాభవాన్ని కోల్పోతూ వుంది. హైదరాబాద్ మాత్రం ఇప్పటికీ అలా బతికే ఉంది. - ఓ మధు