గ్రీన్హౌస్ సబ్సిడీ నేరుగా రైతుకే..
సీఎం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్(పాలీహౌస్) సబ్సిడీ నిబంధనలను సర్కార్ సరళతరం చేసింది. సబ్సిడీని నేరుగా రైతులకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీ ఎంపికలో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గ్రీన్హౌస్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరానికి 75 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 25 శాతం సొమ్మును రైతులు చెల్లించాలి. ఒక్కో ఎకరానికి అన్ని ఖర్చులు కలసి ప్రస్తుతం నిర్మాణవ్యయం రూ. 39.36 లక్షలవుతోంది. ఇటీవల దాన్ని రూ. 2 లక్షల మేర తగ్గించాలని కూడా నిర్ణయించారు.
కంపెనీలకు సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ సొమ్మును రైతులకే చెల్లించాలని సర్కారు భావిస్తోంది. రైతులు తమకు ఇష్టమైన కంపెనీ ద్వారా గ్రీన్హౌస్ నిర్మించుకుంటారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినందున ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుందని ఆయన చెప్పారు.