breaking news
telephone booth
-
ఆత్మలతో ఫోన్లో మాట్లాడాలని ఉందా!
టోక్యో: ఫోన్ కనెక్షన్ బాగుంటే సాధారణంగా మన కుటుంబసభ్యులకు, స్నేహితులు, ఇతర సన్నిహితులకు కాల్ చేసి మాట్లాడుతుంటాం. పరస్పరం క్షేమ సమాచారాన్ని, ఇతర విషయాలను చర్చించుకుంటారు. అయితే ఆత్మలకు (చనిపోయిన వ్యక్తులకు) ఫోన్ చేసి వారితో మాట్లాడాలని ఎప్పుడైనా అనుకున్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి ఆలోచన ఒకటి వెలుగుచూసింది. జపాన్ లోని ఓట్సుచి నగరంలో ఓ టెలిఫోన్ బూత్ ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని రోజుల్లో పర్యాటక కేంద్రంగానూ మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జపాన్ దేశాన్ని 2011లో వచ్చిన పెను విషాధం సునామీ చాలా కుటుంబాలలో కన్నీరు మిగిల్చించి. ఇక్కడి ఓట్సుచి పట్టణంలో సునామీ వల్ల 16 వేల మందికి పైగా స్థానికులు మృతిచెందారు. అప్పటినుంచీ తమ కుటుంబసభ్యులు, బంధువులు, ఇతర సన్నిహితుల లేని లోటును పూడ్చుకోలేక వీరు ఎంతో బాధపడుతున్నారు. ఇటారు ససాకి అనే వ్యక్తి ఆ సునామీలో తన సోదరుడిని కోల్పోయాడు. అతడిని తలుచుకుని ఎప్పుడూ ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో అతడికి ఓ వింత ఆలోచన వచ్చింది. తన ఇంటి గార్డెన్లో చుట్టూ అద్దాలతో ఇటారు ససాకి ఓ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేశాడు. ఇందులో కనెక్షన్ సదుపాయం లేని ఓ ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేశాడు. తన సోదరుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ బూత్‌కు వచ్చి మొబైల్ నెంబర్ కు డయల్ చేసి చనిపోయిన సోదరుడి (ఆత్మ)తో మాట్లాడున్నట్లు.. తన బాధను పంచుకున్నట్లు, అతడు తనకు సమీపంలోనే ఉన్నట్లు భావించేవాడు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించింది. కొన్ని రోజుల కిందట ఏర్పాటు చేసిన ఈ బూత్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. 10 వేలకు పైగా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. నేరుగా ఈ బూత్ వద్దకు వచ్చి తాము ప్రేమించిన వారితో, సన్నిహితులతో కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఫీలవుతూ రిలాక్స్ అవుతున్నారు. ససాకీ ప్రతిరోజు ఈ బూత్‌ను, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసిన తర్వాతే తన పనిని స్టార్ట్ చేస్తుంటాడు. కొందరైతే ప్రతిరోజు రెండుసార్లు ఆత్మలకు ఫోన్ చేసేందుకు వస్తుంటారని సమాచారం. -
నెత్తుటి ప్రశ్న?
క్రైమ్ ఫైల్ అక్టోబర్ 12, 2002... లండన్... ‘‘త్వరగా పద శామ్... ఇప్పటికే ఆలస్యమైపోయింది’’... పరిగెడుతున్నట్టే నడుస్తూ అంది స్టెల్లా. ‘‘ఓహ్ స్టెల్లా... పది నిమిషాలే కదా లేటయ్యింది. ఎప్పుడూ టైముకే వెళ్తాం కదా! ఈ ఒక్కరోజే ఆలస్యంగా వెళ్లితే నష్టమేం లేదులే. లెక్చెరర్కి నేను సంజాయిషీ ఇస్తా’’... అన్నాడు శామ్ ఎంతో కూల్‌గా. ‘‘అదే వద్దనేది. డిసిప్లిన్ డిసిప్లినే. టైమంటే టైముకి వెళ్లి తీరాలి. నా సంగతి నీకు తెలుసుగా? ఎట్టి పరిస్థితుల్లోనూ పంక్చువాలిటీ తప్పను. త్వరగా ప...’’... మాట పూర్తి చేసేలోపే కాళ్లకు బ్రేకులు వేసినట్టుగా ఠక్కున ఆగిపోయింది స్టెల్లా. ‘‘ఓ మై గాడ్’’... అరిచినట్టే అంది. చేతుల్లో ఉన్న పుస్తకాలు వదిలేసి పరిగెత్తుకు వెళ్లి శామ్ని గట్టిగా పట్టుకుంది. ‘‘ఏమైంది’’ అన్నాడతను కంగారుగా. ‘‘అటు చూడు’’ అంటూ చూపించింది. అక్కడ ... ఓ వ్యక్తి నేలమీద పడి ఉన్నాడు. అతడు సడెన్‌గా పైనుంచి కింద పడటం వల్లే స్టెల్లా ఆగిపోయింది. అతని తల చిట్లి రక్తం చిమ్మడం చూసి హడలిపోయి పరుగెత్తింది. స్టెల్లాను వదిలి గబగబా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు శామ్. అతనికి యాభై యేళ్లుంటాయి. దెబ్బలు బాగా తగిలాయి. బాధతో మెలికలు తిరుగుతున్నాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ చెప్ప లేకపోతున్నాడు. చుట్టూ చూశాడు శామ్. టెలిఫోన్ బూత్ కనిపించింది. పరుగెత్తుకెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. స్టేషన్ పక్కనే ఉండ టంతో క్షణాల్లో వచ్చేశారు పోలీసులు. ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత విచారణకు దిగాడు ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్. ‘‘మీరేనా ఇతణ్ని మొదట చూసింది?’’... అడిగాడు శామ్ని. ‘‘లేదు సర్. స్టెల్లా చూసింది. మేము ఈ దారిలో నడుస్తున్నప్పుడు అతను హఠాత్తుగా పైనుంచి పడ్డాడు.’’ శామ్ చెప్పింది వినగానే తలెత్తి పైకి చూశాడు స్టీవ్. ఓ పెద్ద అపార్ట్మెంట్ ఉందక్కడ. అందులోని ఏదో ఒక అంతస్తు నుంచి అతడు పడి ఉంటాడని అర్థమైంది. దాంతో బిల్డింగ్ దగ్గరకు వెళ్లి వాకబు చేశాడు. అతడు ఊహించింది నిజమే. ఆ వ్యక్తి ఆ భవంతిలోనే ఉంటున్నాడు. ఏడో ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో. అక్కడి నుంచే అతడు పడిపోయి ఉంటాడు. లేదంటే దూకేసి ఉంటాడు. అదీ కాదంటే ఎవరైనా తోసేసి ఉంటారు. అసలేం జరిగిందో ఆ ఫ్లాట్‌కు వెళ్తే తెలుస్తుంది. క్షణాల్లో తన టీమ్‌ని తీసుకుని ఏడో అంతస్తులోని ఆ ఫ్లాట్‌కు చేరుకున్నాడు స్టీవ్. మెయిన్ డోరు పక్కన గోడకు ఓ నేమ్ ప్లేట్ వేళ్లాడుతోంది. దానిమీద ‘అబ్దుల్లా యోన్స్’ అని రాసివుంది. ఫ్లాట్ తలుపు తీసేవుంది. అయినా వెళ్లడం మర్యాద కాదని కాలింగ్ బెల్ కొట్టాడు స్టీవ్. కానీ ఎవరూ బయటకు రాలేదు. దాంతో ఇక తప్పదని అందరూ లోనికి వెళ్లారు. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ... ఇంట్లో ఎవరూ లేరా?’’... అరిచాడు స్టీవ్. జవాబేమీ రాలేదు. అసలు ఎక్కడా ఏ అలికిడీ కూడా లేదు. అంటే ఇంట్లో ఎవరూ లేనట్టే. హాలంతా పరికించి చూశాడు. మధ్యలో అందమైన సోఫా సెట్, చక్కని గ్లాస్ టీపాయ్, ఓ మూలగా ఉన్న బుక్ షెల్ఫ్, దాన్నిండా బోలెడన్ని పుస్తకాలు, గోడలకు వేళ్లాడుతోన్న పెయింటింగులు... ఇల్లు చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. ‘‘అతను తప్ప ఎవరూ ఉండటం లేదేమో సర్’’ అన్నాడు అసిస్టెంట్ బాబ్. ‘‘లేదు బాబ్. అతను, అతని కూతురు ఉంటారట. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతోందట. రోజూ ఈపాటికి వెళ్లిపోయేది కానీ ఇవాళ వెళ్లినట్టు లేదు అన్నాడు వాచ్‌మేన్.’’ ‘‘అయితే తను ఇంట్లోనే ఉండాలి కద సర్?’’ అవునన్నట్టు తల పంకించాడు స్టీవ్. ‘‘తను కాలేజీకి వెళ్లిపోయి ఉండొచ్చు. వాచ్‌మేన్ తనని చూసి ఉండకపోవచ్చు. లేదా తను ఇంట్లోనే దాక్కుని ఉండొచ్చు. లేదా తన తండ్రి మరణానికి తనే కారణమై, భయంతో పారిపోయి ఉండొచ్చు. లేదా తను కూడా...’’ అర్ధోక్తిలో ఆగిపోయాడు స్టీవ్. అతని మెదడు చురుగ్గా పని చేసింది. ఏదో ఆలోచన ఫ్లాష్‌లా మెరిసింది. ‘‘గయ్స్... కమాన్ క్విక్... ఇల్లంతా వెతకండి’’... అరిచినట్టే అన్నాడు. తక్షణం అందరూ మెరుపు వేగంతో కదిలారు. ఒక్కొక్కళ్లూ ఒక్కో గదిలోకి పరుగు తీశారు. ఇంట్లోని అణువణువూ పరిశీలించారు. అంతలో ఓ బెడ్ రూమ్‌లోంచి బాబ్ గొంతు వినిపించింది... ‘‘సర్... ఇటు రండి’’ అంటూ. వేగంగా అటు వెళ్లాడు స్టీవ్. ఆ గదికున్న అటాచ్డ్ బాత్రూమ్లోని దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. బాత్రూమ్ అంతా రక్తం. గోడల నిండా రక్తపు మరకలు. తెల్లని బాత్‌టబ్ ఎర్రగా మారిపోయింది. అందులోని నీళ్లన్నీ కూడా ఎరుపురంగును పులుముకున్నాయి. ఆ నీటిలో సగం మునిగి సగం తేలుతోంది ఓ అమ్మాయి మృతదేహం. ‘‘తనను బయటకు తీయండి’’... ఆదేశించాడు స్టీవ్. అమ్మాయిని బయటకు తీసి నేలమీద పడుకోబెట్టారు. కత్తిపోట్లతో ఒళ్లంతా చీరుకుపోయింది. దాదాపు ఒంట్లోని రక్తమంతా బయటకు వచ్చేసి దేహం తెల్లగా పాలిపోయింది. ‘‘ఈ అమ్మాయి ఆయన కూతురై ఉంటుందా సర్?’’... అడిగాడు బాబ్. ‘‘అయివుండటం కాదు... ఆయన కూతురే. హాల్లో ఇద్దరూ కలిసున్న ఫొటో ఉంది. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించండి. అతనికి స్పృహ వచ్చిందేమో కనుక్కోండి. అతడు మాత్రమే ఏం జరిగిందో చెప్పగలడు’’ అంటూ ఆ గదిలోంచి బయటకు నడిచాడు స్టీవ్. ‘‘చెప్పండి మిస్టర్ అబ్దుల్లా యోన్స్... ఏం జరిగింది?’’... రెండు రోజుల తర్వాత కళ్లు తెరిచిన అబ్దుల్లాని ప్రశ్నించాడు స్టీవ్. అతడు వెంటనే మాట్లాడలేకపోయాడు. చాలాసేపు ప్రయత్నించాక మెల్లగా పెదవి మెదిపాడు. ‘‘నా కూతురు హేషు కాలేజీకి తయారవుతోంది. నేను న్యూస్‌పేపర్ చదువుకుంటున్నాను. అంతలో కొందరు ఇంట్లోకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా నా మీద, నా కూతురి మీద దాడి చేశారు. భయంతో హేషు లోపలికి పరుగు తీసింది. కాసేపటికి దాని అరుపులు వినిపించాయి. దాన్ని కాపాడుకునే అవకాశం కూడా నాకు దొరకలేదు. వాళ్లు చాకుతో నా గొంతుపై గాటు పెట్టారు. నన్ను బాల్కనీలోకి లాక్కొచ్చి పై నుంచి కిందకు తోసేశారు’’... ఏడుస్తూ చెప్పాడు. ‘‘వాళ్లెవరో మీకు తెలుసా?’’ తల అడ్డంగా ఊపాడు అబ్దుల్లా. ‘‘ముఖాలకు మాస్కులు వేసుకున్నారు. నల్ల దుస్తులు తొడుక్కున్నాడు. మిలిటెంట్లో టైస్టులో అయివుంటారు. లేదంటే దొంగలన్నా అయివుంటారు. అవునూ... ఇంతకీ నా కూతురు ఎలా ఉంది? తనకేమీ కాలేదు కదా?’’ తల దించుకున్నాడు స్టీవ్. ‘‘చెప్పండి సర్. నా హేషూకి ఏమైంది సర్? నా బంగారుతల్లి... అదే నా ప్రాణం. తనకేదైనా అయితే నేను బతకలేను. తను క్షేమంగానే ఉందా?’’ తల ఎత్తి అబ్దుల్లా కళ్లలోకి తీక్షణంగా చూశాడు స్టీవ్. ‘‘క్షేమంగా ఎలా ఉంటుంది అబ్దుల్లా? కన్నతండ్రే కాలయముడిలాగ కత్తితో తనువును చీల్చేశాడు. చిత్రవధ చేసి దారుణంగా చంపేశాడు. నువ్వు మొదటి సారి పొడిచినప్పుడే తన మనసు చనిపోయి ఉంటుంది. పదమూడు సార్లు పొడిచాక తను పూర్తిగా చనిపోయింది.’’ అబ్దుల్లా కళ్లు పెద్దవయ్యాయి. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను... నేను నా హేషుని... అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా?’’... అరిచాడు అబ్దుల్లా. ‘‘ఇక చాలు మిస్టర్ అబ్దుల్లా. నువ్వు స్పృహలోకి ఎప్పుడు వస్తావా అని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏం జరిగిందో నీ నుంచి తెలుసుకోవాలని కాదు. నువ్వేం కథ చెబుతావో వినాలని. నిజం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇదిగో... ఈ ఉత్తరం చూశాక’’.... తన చేతుల్లో ఉన్న ఉత్తరాన్ని చూపిస్తూ అన్నాడు స్టీవ్. తర్వాత అందులో రాసి ఉన్నదాన్ని గట్టిగా చదివాడు. ‘‘ప్రియమైన నాన్నకు... నేను వెళ్లిపోతున్నాను నాన్నా. నిన్ను వదిలేసి, నువ్వు గీసిన గీతను దాటేసి వెళ్లి పోతున్నాను. నేను ఆకాశంలో పక్షిలా ఎగరాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పంజరంలో బంధించాలని అనుకుంటు న్నావ్. నేను అలా బతకలేను నాన్నా! నాకు స్వేచ్ఛ కావాలి. మతం, సంప్రదాయం అంటూ నువ్వు సృష్టించిన చట్రంలో నేను బందీగా ఉండలేను. అది తెలిసి కూడా నువ్వు నన్ను నియంత్రించా లని ప్రయత్నిస్తున్నావ్. ఏ దేవుడు నాన్నా మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే కోప్పడతాడు? ఏ దేవుడు నాన్నా పర మతస్తులతో స్నేహం చేస్తే శిక్షిస్తాడు? ఇలా అడిగితే కొడతావ్. ఈ వయసులో కూడా నీకెంత బలం ఉందో నిరూపించుకోవడానికి నా శరీరమే దొరికిందా నాన్నా! అయినా ఫర్లేదు. మా నాన్న చాలా బలవంతుడని నేను సంతోషపడుతున్నాను. కానీ నీ ఛాందస భావాలకు మాత్రం తల వంచ లేను. నువ్వేనాడూ పట్టించుకోని నా మన సును పూర్తిగా చదివిన వ్యక్తి దగ్గరకు వెళ్లి పోతున్నాను. నన్ను క్షమించు. బై నాన్నా.’’ అబ్దుల్లా ముఖం కోపంతో ఎర్ర బారింది. కళ్లు చింతనిప్పుల్లా మారాయి. ‘‘అవును. నేనే చంపాను. నా కూతుర్ని నా చేతులతో పొడిచి పొడిచి చంపాను. నేను చేసింది తప్పు కాదు. నా మతానికి నేను న్యాయం చేశాను. అల్లా నన్ను చూసి గర్వ పడతాడు’’... పిచ్చి వాడిలా అరుస్తూ పగలబడి నవ్వసాగాడు. మతిపోయినట్టు చూస్తూండి పోయాడు స్టీవ్. ‘‘నువ్వు నీ దేశమైన ఇరాక్ వదిలి వచ్చి మా దేశంలో బతకొచ్చు. ఇక్కడి తిండి తినొచ్చు. ఇక్కడి గాలి పీల్చొచ్చు. కానీ నీ కూతురు ఇక్కడి కుర్రాడిని మాత్రం ప్రేమించకూడదు. నీలాంటివాడి కడుపున పుట్టిన పాపానికి పాపం తను పదహారేళ్లకే ప్రాణాలు కోల్పోయింది. నిన్ను నీ దేవుడు క్షమిస్తాడేమో, ఈ దేశ చట్టం మాత్రం క్షమించదు’’ అనేసి విసవిసా వెళ్లిపోయాడు. స్టీవ్ అన్న మాటే నిజమైంది. చట్టం అబ్దుల్లాని క్షమించలేదు. ముప్ఫై ఎనిమి దేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. మత మౌఢ్యంతో మృగంలా మారి కూతురినే పొట్టనబెట్టుకున్న ఆ కసాయివాడిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ విచిత్రం.. ఇప్పటికీ అబ్దుల్లా పశ్చాత్తాప పడటం లేదు. తాను చేసింది తన దేవుడి దృష్టిలో కరెక్టే అంటున్నాడు. అలాంటి వాడిని ఏ దేవుడు మాత్రం క్షమిస్తాడు?? - సమీర నేలపూడి