breaking news
Telangana Real Estate Board
-
ఏప్రిల్ 1 నుంచి రెరా జరిమానా 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ఏప్రిల్ 1 నుంచి జరిమానా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచేందుకు సిద్ధమైంది. అయినా నమోదు చేసుకోని మొండి ఘటాలపై సెక్షన్ 59 కింద ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం పెనాల్టీ వి«ధించనుంది. రూ.2 లక్షల ఫైన్‌తో ఈనెల 31 వరకూ రెరా నమోదు గడువుకు మరొక అవకాశమిస్తున్నామని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. 2016లో కేంద్రం రెరా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏడాది ఆలస్యంగా 2017లో రెరాను నోటిఫై చేసింది. జనవరి 1, 2017 నుంచి ఆగస్టు 31, 2018 మధ్య జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్ రెరాలో నమోదు చేసుకోవాలని తెలిపింది. రెరాలో 4176 రిజిస్ట్రేషన్స్.. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. జనవరి 1, 2017 తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయి. ఇందులో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ నమోదు చేసుకోవాల్సిందే. కానీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లు, ఏజెంట్లు రెండూ కలిపి 4176 నమోదయ్యాయి. వీటిల్లో 2338 ప్రాజెక్ట్‌లు, 1800లకు పైగా ఏజెంట్లుంటారు. ప్రస్తుతం రోజుకు 20 ప్రాజెక్ట్‌లు నమోదు అవుతున్నాయని.. మరొక 700 ప్రాజెక్ట్‌లు నమోదైతే లక్ష్యం నెరవేరినట్లేనని విద్యాధర్ తెలిపారు. టీ రెరా రూ.3 కోట్లు గతేడాది డిసెంబర్ నుంచి గడువులోగా నమోదు చేసుకోని ప్రాజెక్ట్‌లపై జరిమానాలను విధించడం ప్రారంభమైంది. తొలుత రూ.50 వేలు, ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచాం. గత నెలన్నర రోజులుగా జరిమానా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచాం. ఇప్పటివరకు జరిమానాల రూపంలో రూ.3 కోట్లు వసూలయ్యాయని విద్యాధర్ తెలిపారు. -
‘డబుల్ బెడ్రూం’కు కార్యాచరణ
గృహ నిర్మాణ శాఖతో జరిపిన సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖకు చెందిన పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పై జిల్లాలవారీగా టెండర్ల పురోగతి, పనుల ప్రారంభంపై ఆరా తీశారు. ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో 5,238 ఇళ్లకుగాను టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలపై రెవెన్యూ బృందాల విచారణను త్వరితంగా పూర్తి చేసి అర్హులకు పెండింగు బిల్లులు త్వర గా చెల్లించాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో రాజీవ్ స్వగృహ ఖాళీ ఫ్లాట్లపై సమీక్ష చేపట్టారు. బండ్లగూడ, పోచారంలోని స్వగృహ ఇళ్లకు ధరను నిర్ణయించి పేర్లు నమోదు చేసుకున్నవారికి నోటీసులు ఇవ్వాలన్నారు. హౌసింగ్ బోర్డు, గృహ నిర్మాణ సంస్థ విభజన ప్రక్రియ మందకొడిగా సాగడంపై వివరాలు కోరారు. సమీక్ష సందర్భం గా హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గృహ నిర్మాణ శాఖకు చెందిన అంశాలను ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వాంబే ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.


