పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా మహిళ
హైదరాబాద్: పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా మొట్టమొదటి సారిగా ఓ మహిళా అధికారి నియమితులయ్యారు. గత నెలలో అమెరికా రాయబారిగా నియమితులైన ఐజాజ్ అహ్మద్ స్థానంలో తెహ్మినా జంజువా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వెల్లడించారు.
తెహ్మినా జంజువా ప్రస్తుతం జనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆ దేశ శాశ్వత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈమె ఇంత మునుపు ఇటలీ రాయబారిగా కూడా పనిచేశారు. దేశ, విదేశీ వ్యవహారాల్లో మంచి అనుభవమున్న జంజువా విదేశాంగ శాఖలో 1984లో ఉద్యోగంలో ప్రవేశించారు. దాదాపు 32 ఏళ్లపాటు వివిధ బాధ్యతలను ఈమె సమర్ధవంతంగా నిర్వహించారు. ఈమె ఇస్లామాబాద్‌లోని క్వాయిద్-ఎ.ఆజం యూనివర్సిటీతోపాటు అమెరికాలోని కొలంబియా వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు.