breaking news
team of ap ministers
-
పవన్ వద్దకు మంత్రుల బృందం?
-
పవన్ వద్దకు మంత్రుల బృందం?
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న పవన్ కల్యాణ్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే స్వయంగా తాను కూడా పవన్‌తో భేటీ కావాలని అనుకుంటున్నారట. రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేయొద్దని పవన్ ఇంతకుముందు, తాజాగా కూడా ట్వీట్లలో చెప్పారు. బేతపూడి, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో గతంలో పవన్ పర్యటించినప్పుడు తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే బలవంతంగా భూసేకరణకు దిగితే ఊరుకునేది లేదని పవన్ చెప్పారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో మళ్లీ ట్వీట్ చేశారు. అయితే.. దానిపై మంత్రులు కొందరు సెటైర్లు వేశారు. భూసేకరణ చేయకుండా రాజధాని ఎలా నిర్మిస్తారో చెప్పాలంటూ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దానిపై మళ్లీ పవన్ స్పందించారు. రైతుల సమస్యను ప్రస్తావిస్తే వెటకారం చేస్తున్నారంటూ నేరుగా యనమల పేరు పెట్టి ట్వీట్లు చేశారు. దీంతో వివాదం క్రమంగా ముదురుతోందని భావించిన చంద్రబాబు.. మంత్రుల బృందాన్ని పవన్ వద్దకు పంపుతున్నారు. ఆయన మరోసారి బేతపూడి, పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాలకు వెళ్తే రైతుల నుంచి ఉద్యమం మొదలు కావచ్చని, దానికి పవన్ మద్దతు ఇచ్చి తీరుతారని అనుకుంటున్నారు. భూసేకరణకు తీవ్రస్థాయిలో అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లనుంచి కూడా విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తోంది. దానిపైనే పవన్ ఇప్పుడు స్పందించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. పవన్‌ను రాజీమార్గంలోకి తెచ్చుకుని భూసేకరణకు వెళ్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముందుగా మంత్రుల బృందాన్ని పంపి, ఆ తర్వాత రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు కూడా పవన్‌తో భేటీ కావచ్చని అంటున్నారు.