breaking news
teacher unions demand
-
తెలుగు మీడియం కొనసాగించాలి
అనంతపురం న్యూసిటీ: మునిసిపల్ పాఠశాలల్లో యథావిధిగా తెలుగు మీడియం కొనసాగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా గురువారం అనంతపురం నగర పాలక సంస్థ ఎదుట సమాఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు రమణయ్య(యూటీఎఫ్), ఫణిభూషణ్(తెలుగునాడు), రామాంజినేయులు(ఎస్టీయూ), సాయప్ప(ఏపీటీఎఫ్) మాట్లాడుతూ... మునిసిపల్ పాఠశాలల్లో ఉన్నఫలంగా ఇంగ్లీష్ మీడియంను మాత్రమే ప్రవేశపెడితే చదువుకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుందన్నారు. గతంలోలాగే తెలుగు, ఇంగ్లీష్ సమాంతర మీడియంలు కొనసాగించాల్సిందేనన్నారు. విద్యా సంవత్సరం మొదలై 40 రోజులు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, ఇలాగైతే విద్యను ఏవిధంగా బోధించాలని ప్రశ్నించారు. పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌రూల్స్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించి జీఓ 40లో ఉన్న అధికారాలను ఇవ్వాలని కోరుతూ నగర పాలక సంస్థ కార్యదర్శి జ్యోతిలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. -
స్కూల్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి
ఏలూరు సిటీ : ఉపాధ్యాయులను బోధనేతర పనులకు, ఆన్లైన్ నమోదు కార్యక్రమాలకు వినియోగించకూడదని, స్కూల్ క్యాలెండర్ మేరకే పరీక్షలు, పాఠశాల సమయాలు ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక గాంధీ జాతీయ మహావిద్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, ఏపీయూఎస్, ఆప్టా, వైఎస్సార్ టీఎఫ్, ఎంబీటీఎస్, పీఈటీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాఠశాల విద్య శాఖ స్కూల్ క్యాలెండర్ జారీ చేసిందని, ఈ క్యాలెండర్‌కు భిన్నంగా బేస్మెంట్ పరీక్షలు నిర్వహించటం, పరీక్షల మార్కులు ఆన్లైన్ చేయటం, బడిగంటలు వంటి అదనపు కార్యక్రమాలతో బోధనా సమయం వృథా అవుతుందని తెలిపారు. బోధనా సమయం తగ్గిపోయి పరీక్షించే గంటలు పెరిగిపోవటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న నిర్వహించే ధర్నాలో పాల్గొనే ఉపాధ్యాయుల వివరాలు అందించాలని, ఏ సంఘం నుంచి ఎంతమంది పాల్గొంటున్నారో వివరాలు ఇవ్వాలనడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కె.రాజ్‌కుమార్, వి.ధర్మరాజు, ఎంఎన్ శ్రీనివాస్, బి.మనోజ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, వి.కనకదుర్గ, బి.సుభాషిణి, వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్.రవికుమార్ తదితరులు ఉన్నారు.