breaking news
Tax policies
-
కేంద్రం కీలక నిర్ణయం.. రెట్రో ట్యాక్స్ రద్దు
న్యూఢిల్లీ: స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన చట్టాల్లో తగు సవరణలు చేసేందుకు లోక్‌సభలో గురువారం బిల్లు ప్రవేశపెట్టింది. 2012 మే, 28కి పూర్వం జరిగిన డీల్స్‌కి సంబంధించి దీని కింద జారీ చేసిన ట్యాక్స్ డిమాండ్లను ఉపసంహరించేందుకు.. ట్యాక్సేషన్ చట్టాల (సవరణలు) బిల్లు, 2021ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆయా సంస్థలు కట్టిన మొత్తాన్ని.. వడ్డీ ప్రసక్తే లేకుండా ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం సదరు సంస్థలు రెట్రో పన్నుపై వేసిన దావాలను ఉపసంహరించుకోవాలి లేదా ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, తాము వ్యయాలు, నష్టపరిహారం, వడ్డీ వంటివి కోరబోమంటూ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ వంటి బహుళ జాతి దిగ్గజాలకు ఊరట లభించనుంది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ నిబంధన కింద మొత్తం రూ. 8,100 కోట్లు వసులు కాగా.. ఇందులో కెయిర్న్ ఎనర్జీ నుంచి రాబట్టినదే రూ. 7,900 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కాగా తాజా పరిణామంపై తగు సమ యంలో స్పందిస్తామని కెయిర్న్ పేర్కొంది. ఇన్వెస్టర్లకు భరోసా.. 2014 నుంచే (కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత) రెట్రో ట్యాక్సేషన్ అనేది ప్రభుత్వ విధానం కాదని సోమనాథన్ పేర్కొన్నారు. ఇవన్నీ 2014కి పూర్వపు వివాదాలని తెలిపారు. ప్రస్తుతం భారత్‌కి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని వివరించారు. పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. ‘‘పన్ను వేసే విషయంలో భారతదేశ సార్వభౌమ అధికారాలను ప్రశ్నించడానికి లేదు. కానీ రెట్రో ట్యాక్సేషన్ అనేది మాత్రం ప్రభుత్వ విధానం కాదని తెలియజెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని స్పష్టం చేశారు. రెట్రో సంగతి ఏమిటంటే... గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం కొత్తగా పన్ను విధించవచ్చూ లేదా గతంలో చెల్లించిన దానికి అదనంగా వసూలూ చేయవచ్చు. సాధారణంగా గత, ప్రస్తుత ట్యాక్స్ విధానాల్లో భారీగా మార్పులు ఉన్నప్పుడు, పాత విధానం కింద కట్టిన పన్నులు చాలా తక్కువని భావించినప్పుడు దీన్ని అమలు చేయవచ్చు. తద్వారా వ్యత్యాసాలను సరిచేయొచ్చు. అయితే, గత కాలంలో జరిపిన లావాదేవీలకు అప్పటి నిబంధనల ప్రకారమే పన్నులు కట్టి ఉంటారు కాబట్టి ఇలాంటి రెట్రోస్పెక్టివ్ పన్నులపై ట్యాక్స్‌పేయర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కూడా అదే జరిగింది. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే, 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్నుండి సుమారు 17 సంస్థలకు దాదాపు రూ. 1.10 లక్షల కోట్ల మేర కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ప్రధానంగా బ్రిటన్ దిగ్గజాలైన కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ ట్యాక్స్‌పై అవి అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా, వాటికి అనుకూలంగానే ఉత్తర్వులు వచ్చాయి. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే .. తనకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ విదేశాల్లో ఉన్న భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మరింత మసకబారకుండా ఇలాంటి వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. వొడాఫోన్ వివాదం ఇదీ.. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ 2007లో భారత్‌లో టెలికం కార్యకలాపాలున్న హచిసన్ ఎస్సార్‌లో 67 శాతం వాటాలను 11.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రెండూ విదేశీ సంస్థలే కాగా కేమ్యాన్ ఐల్యాండ్స్ వేదికగా ఈ డీల్ జరిగింది. దీనికి సంబంధించి విత్‌హోల్డింగ్ ట్యాక్స్ మినహాయించుకోనందుకు గాను రూ. 11,218 కోట్లు కట్టాలంటూ 2010లో వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. 2011లో రూ. 7,900 కోట్ల పెనాల్టీ విధించింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రెండు విదేశీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి ఇవి వర్తించవంటూ అత్యున్నత న్యాయస్థానం 2012లో ట్యాక్స్ డిమాండ్లను కొట్టివేసింది. ఆ దరిమిలా వొడాఫోన్‌పై విధించిన పన్నును సమర్థించుకునే విధంగా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌కు సంబంధించి అదే ఏడాది కేంద్రం ఐటీ చట్టాన్ని సవరించింది. అటుపైన 2013లో వొడాఫోన్‌కు మళ్లీ రూ. 14,200 కోట్లకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. భారత్–నెదర్లాండ్స్ ఒడంబడిక కింద 2014లో వొడాఫోన్ కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు ఇచ్చింది. దీనిపై కొత్తగా చర్యలేమీ తీసుకోమంటూ కేంద్రం చెప్పినప్పటికీ 2016లో మరోసారి రూ. 22,100 కోట్లు కట్టాలంటూ కంపెనీకి డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఈ వివాదంలో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో వొడాఫోన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. కెయిర్న్ అంశం.. కెయిర్న్ ఎనర్జీ వివాదం కూడా దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటిది. 2006లో కెయిర్న్ యూకే అంతర్గతంగా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కెయిర్న్ ఇండియా హోల్డింగ్‌లో తన షేర్లను కెయిర్న్ ఇండియాకు బదలాయించింది. 2011లో దీన్ని వేదాంత రిసోర్సెస్‌కి విక్రయించింది. 2006లో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలంటూ రెట్రో ట్యాక్స్ విధానం కింద రూ. 20,495 కోట్లు (అసలు, పెనాల్టీలు కలిపి) కట్టాలంటూ 2014లో కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. దాన్ని రాబట్టుకునేందుకు విక్రయ డీల్ ప్రకారం వేదాంతలో కెయిర్న్ ఎనర్జీకి లభించిన 5 శాతం వాటాలను జప్తు చేసుకుని, విక్రయించింది. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. అది కాకుండా కెయిర్న్ యూకేకి చెందాల్సిన డివిడెండ్లు, దానికి ఇవ్వాల్సిన పన్ను రీఫండ్లను కూడా ఆపేసింది. దీనిపై కెయిర్న్ ఎనర్జీ వివిధ న్యాయస్థానాల్లో పోరాడింది. 2020 డిసెంబర్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్..కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం కెయిర్న్ ఎనర్జీకి భారత ప్రభుత్వం వడ్డీ మొదలైనవి కలిపి 1.7 బిలియన్ డాలర్లు కట్టాలి. హేగ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లో భారత ప్రభుత్వం దీన్ని సవాలు చేసింది. మరోవైపు, తనకు రావల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతులు పొందేలా అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల్లో న్యాయస్థానాలను కెయిర్న్ ఆశ్రయించింది. ప్యారిస్‌లో దాదాపు 20 మిలియన్ డాలర్ల విలువ చేసే భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతులు కూడా పొందింది. అటు ఇదే కేసులో వేదాంతకు కూడా నోటీసులు జారీ కాగా ఆ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. అనిశ్చితి పోతుంది.. పన్ను చట్టాల విషయంలో ప్రభుత్వ ధోరణిపై అనిశ్చితిని తొలగించేందుకు తాజా బిల్లు తోడ్పడుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర పేర్కొన్నారు. -
పన్ను సంస్కరణలకు ఓఈసీడీ చర్యలు
లండన్: బహుళజాతి సంస్థలకు వర్తించే అంతర్జాతీయ పన్ను విధానాల్లో సంస్కరణలకు సంబంధించి తుది కార్యాచరణ ప్రణాళికను ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఆవిష్కరించింది. కంపెనీల లాభాల మళ్లింపు (బీఈపీఎస్) తదితర అంశాల కారణంగా ఏటా ప్రపంచ దేశాల ఖజానాలకు 100-240 బిలియన్ డాలర్ల మేర పన్నుల ఆదాయపర ంగా నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా కార్పొరేట్ ఆదాయ పన్నుల (సీఐటీ) ద్వారా వసూలయ్యే మొత్తంలో ఇది 4-10 శాతం మేర ఉంటుందని పేర్కొంది. పన్ను ఎగవేతలు, అక్రమ మార్గాల్లో నిధుల ప్రవాహాన్ని అరికట్టేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో ఓఈసీడీ పన్నులపరమైన ప్రమాణాలను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 8న పెరూలో జరగబోయే జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో కొత్త ప్రమాణాలను చర్చించనున్నారు. -
పన్ను విధానాలు స్థిరంగా ఉండేలా చూస్తాం
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి - ఇన్ఫ్రా, తయారీ, డిఫెన్స్‌ల్లో అవకాశాలు - అమెరికన్ ఇన్వెస్టర్లతో భేటీలో జైట్లీ న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు సముచితంగాను, స్థిరంగా ఉండేలా చూస్తామని అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఇక్కడి ఇన్ఫ్రా, తయారీ, రక్షణ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యాపారావకాశాలు అందిపుచ్చుకోవాలని ఆహ్వానించారు. సోమవారం ఇక్కడ 11వ ఇండో-యూఎస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం మరికొన్నేళ్లలో అయిదు రెట్లు ఎగిసి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ .. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. స్థిరమైన విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం తదితర చర్యలతో ఎకానమీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. పన్నులకు సంబంధించి వారసత్వంగా వచ్చిన సమస్యలను చట్టాలపరంగా, న్యాయస్థానాల తీర్పులపరంగా, విధాన నిర్ణయాల రూపంలోనూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజా సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. -
మరిన్ని సంస్కరణలు తెస్తాం...
- వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం... - భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి: ఆర్థిక మంత్రి జైట్లీ అంకారా (టర్కీ): పన్నుల విధానాలు హేతుబద్ధంగా ఉండేలా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెడతామని, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్‌లో స్మార్ట్ సిటీలు, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు సందర్భంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ.. టర్కీ ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇన్ఫ్రాకు ఇంకా నిధులు కావాలి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలరు’’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. టర్కీ నిర్మాణ రంగ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి, భారత్‌లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని జైట్లీ సూచించారు. -
పన్నుల విధానాలు సరళతరం చేయాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేయటంతో పాటు నియంత్రణ, పన్నుల విధానాలను సరళతరం చేయాలని టాటా స్టీల్, జీఎంఆర్ తదితర దిగ్గజ సంస్థలు కేంద్రాన్ని కోరాయి. ఇన్వెస్టర్లు బహుళ అనుమతుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చర్యలు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అజయ్ శంకర్ కమిటీకి ఆయా సంస్థలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశాయి. -
పన్నులు తగ్గించాలి
వృద్ధికి ఊతమివ్వాలి కేంద్రానికి పారిశ్రామిక దిగ్గజాల వినతి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో {పీ-బడ్జెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్న పన్నుల విధానాలను సరిచేయాలని పారిశ్రామిక దిగ్గజాలు కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయ పన్నులు మొదలైనవి తగ్గించాలని సూచించారు. బడ్జెట్ తయారీకి ముందు జరిపే చర్చల్లో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన సమావేశంలో వారు ఈ మేరకు తమ అభ్యర్థనలు తెలియజేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించాలని, మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు. తయారీ రంగ వృద్ధి మందకొడిగా ఉన్న పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన అరుణ్ జైట్లీ.. వ్యాపార నిర్వహణకు పరిస్థితులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వస్తే.. పన్నుల వ్యవస్థ మెరుగుపడగలదని, మరింత పారదర్శకత రాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 10 శాతానికి పరిమితం చేయడం ద్వారా తయారీ రంగానికి తోడ్పాటునివ్వాలని భేటీలో కోరినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో(సెజ్) యూనిట్లకు, డెవలపర్లకు మ్యాట్ .. డివిడెండ్ పంపిణీ పన్నులు (డీడీటీ) నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రక్రియకు, ఉపాధి కల్పనకి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో మరిన్ని చర్యలు ఉండగలవని ఆశిస్తున్నట్లు శ్రీరామ్ పేర్కొన్నారు.