breaking news
tati venkateswarulu
-
ముంపు మండలాల రాజకీయ ప్రాతినిధ్యంపై సీఈసీకి లేఖ: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలకు రాజకీయంగా ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి తీసుకెళ్లి, స్పష్టత తీసుకుంటామని ఉమ్మడిరాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.ఈ విషయంపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని, తదుపరి సమాచారాన్ని తెలియజేస్తామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు ఆయన చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు (2019) జరిగే వరకు ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక ఎస్టీ నియోజకవర్గాల్లోని 7 మండలాలకు తామే ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించాలని భన్వర్‌లాల్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి ఆయనపై విధంగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ మండలాలు ఏపీ పాలనలో ఉండడంతో ఆ ప్రాంత సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించే పరిస్థితి, ప్రభుత్వానికి నివేదించే అవకాశం లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు
ఖమ్మం : తాను పార్టీ మారటం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి తనను ఎమ్మెల్యేను చేశారని, వారిని ఎన్నటికీ మోసగించనని ఆయన అన్నారు. బీఫాం ఇచ్చిన పార్టీని, వెన్నుదన్నుగా ప్రోత్సహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానాన్ని ఏ పార్టీకి తాకట్టు పెట్టే ప్రసక్తే లేదన్నారు. 'తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు' అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థల్లో ఇలాంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఈనెల 18న కుక్కునూరులో టీడీపీ నాయకుల దాడిపై సీఎం కేసీఆర్‌కు వివరించానని, ఆయన స్పందించి పోలీస్ అధికారులతో మాట్లాడారని, రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలకు తానే ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు.