breaking news
Task force polices
-
బిట్టు ఇకలేదు
సాక్షి, తిరుపతి : పోలీసుశాఖకు విశేష సేవలు అందించిన బిట్టు (తిరుపతి టాస్క్ ఫోర్స్ డాగ్) ఇక లేదు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిట్టు.. ఆదివారం మృతి చెందింది. గత నాలుగేళ్లుగా బిట్టు తిరుపతి పోలీసులకు సేవలు అందించింది. అడవుల్లో స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం దుంగలను గుర్చించడంలో బిట్టు దిట్ట. అలాగే చాలా సార్లు నక్కి ఉన్న స్మగ్లర్లను కూడా పోలీసులకు పట్టించింది. 2016 జనవరిలో జన్మించిన బిట్టు కు మొయినబాద్ లో 8 నెలల పాటు పోలీసులు శిక్షణ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి నుంచి తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంది. ఇప్పుడు తీవ్ర అనారోగ్యము తో చనిపోయింది. పోస్ట్ మార్టం చేయించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏ ఎస్పీ రవిశంకర్ సిబ్బంది నివాళులు అర్పించారు. -
లక్షల్లో లాక్కున్నాడు.. వేలల్లో విదిల్చాడు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆకర్షించి, వారి నుంచి అందినకాడికి దండుకుని జారుకునే ముఠాలను ఇప్పటివరకు చాలా చూశాం. కానీ ఈ అంతర్రాష్ట్ర ముఠా వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఈ ముఠా నాయకుడు.. ఉద్యోగాలకు ఎంపికైనవారి పేర్లు బోగస్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా వారికి పొరుగు రాష్ట్రాల్లో శిక్షణ సైతం ఇప్పించాడు. అనంతరం వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించి, నెల జీతం కూడా ఇచ్చాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఈ ముఠాను పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోటాల పేరుతో బుట్టలోకి... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కంప్యూటర్ హార్డ్‌వేర్ ఉద్యోగి వి.గంగాధర్ కొన్నేళ్ళుగా ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. 2015లో కంచన్‌బాగ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత పంథా మార్చా డు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పి.దస్తగిరి, ఎం.శివరెడ్డి, కె.రాజేష్, ఎ.స్వామి, ఎం.క్రాంతికుమార్, వై.వీరేశం, ఎం.శ్రీకాంత్‌లను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు నిరుద్యోగ యువతను ఆకర్షించి గంగాధర్ దగ్గరకు తీసుకెళ్లేవారు. తమకు ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని.. స్పెషల్ డిపార్ట్ మెంట్ కోటా, మినిస్టర్స్ కోటా, డిసీస్డ్ కోటా తదితర కేటగిరీల్లో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గంగాధర్ వారిని బుట్టలో వేసుకునేవాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రేట్లు చెప్పి, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకుని ఏజెంట్లకు కొంత కమీషన్ ఇచ్చేవాడు. అనుమానం రాకుండా పక్కాగా... నియమాక ప్రక్రియలో ఎలాంటి అనుమానం రాకుండా గంగాధర్ పక్కాగా వ్యవహరించేవాడు. రైల్వే ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతానికి చెందిన శ్యామ్ ద్వారా వైద్య పరీక్షల పత్రాలు ఇప్పించేవాడు. అనంతరం విజయవాడలో శంకర్ అనే వ్యక్తితో ఇంటర్వ్యూలు చేయించేవాడు. ఎంపికైనవారి వివరాలు వెబ్సైట్లో ఉంటాయని చెప్పి వారికి ఆ సైట్ అడ్రస్ ఇచ్చేవాడు. ఇందుకోసం ముందుగానే పి.పద్మారెడ్డి అనే వెబ్ డిజైనర్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేయించాడు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ఇలా మారిందని చెప్పి, అందరి పేర్లనూ ఎంపికైనవారి జాబితాలో ప్రదర్శించేవాడు. వారికి నమ్మకం కుదిరిన తర్వాత మిగిలిన మొత్తం తీసుకునేవాడు. అనంతరం నకిలీ నియామక పత్రాలు ఇచ్చి శిక్షణ పేరుతో ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్, దుర్గాపూర్, ఒడిశాలోని ఖురధ్వలకు తీసుకెళ్లేవాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పాత కాలేజీ, ఐటీఐలకు చెందిన భవనాలను అప్పటికే లీజుకు తీసుకున్న గంగాధర్.. వాటిలో నకిలీ ఫ్యాకల్టీల ద్వారా 15 రోజులపాటు శిక్షణ ఇప్పించేవాడు. అనంతరం ఎక్కడ రిపోర్టు చేయాలో చెబుతానని చెప్పి స్వస్థలాలకు పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఫలానా సమయంలో, ఫలానా చోట రిపోర్ట్ చేయాలంటూ వారికి సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్ పంపేవాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో టీసీలుగా.. ఇదే కోవలో ‘టికెట్ కలెక్టర్’ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థుల్ని గతేడాది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండే ఓ అధికారికి రిపోర్ట్ చేయమని గంగాధర్ చెప్పాడు. అప్పటికే తన ముఠాకు చెందిన వ్యక్తినే టీసీ మాదిరిగా మూడో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిల్చోబెట్టాడు. అతడు వారి నుంచి జాయినింగ్ రిపోర్టు తీసుకుని.. నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ప్యాడ్, పెన్ను, తెల్లకాగితాలు అందించి బాధ్యతలు అప్పగించాడు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌కు వచ్చే రైళ్ల పేర్లు, నంబర్లు, సమయాలు రాయించాడు. దాదాపు 25 రోజులు ఇలా పని చేసిన తర్వాత వీరికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతాలు కూడా ఇచ్చి ఆపై మోసగాళ్లంతా దుకాణం సర్దేశారు. రూ.3 కోట్లకు పైగా వసూళ్లు... ఈ పంథాలో గంగాధర్ ముఠా గత రెండున్నరేళ్లుగా దాదాపు 150 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేశారు. వారందరికీ రైల్వేలో టీసీ, కమర్షియల్ క్లర్క్, పాయింట్ మెన్‌తో పాటు రెవెన్యూ, విద్యాశాఖ, సచివాలయం, హైకోర్టు, జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కోల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారిలో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు విశాఖపట్నానికి చెందిన వారు ఉన్నారు. వీరి ఫిర్యాదుతో ఈ ముఠాపై 10 కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సెంట్రల్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పద్మారెడ్డి, శ్యామ్, శంకర్ మినహా మిగిలిన ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీ పత్రాలు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఎస్సార్‌నగర్, సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
కోడి పందేల ముఠా అరెస్ట్
విశాఖ క్రైం: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం దరి లెప్రసీ కాలనీలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆనంద్ పరారయ్యాడు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 18 పందెం కోళ్లు, రూ.5వేలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐలు సతీష్, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. -
బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్
విశాఖపట్నం బీచ్రోడులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్డులోని ఓ పెద్ద హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు బీచ్‌రోడ్డులోని హోటల్‌పై దాడి చేశారు. వ్యభిచారులతోపాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోటల్ యాజమాన్యంతోపాటు వ్యభిచార ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ‘కరెన్సీ’ ముఠా
సాక్షి,సిటీబ్యూరో: నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగురోజుల వ్యవధిలో మరో నకిలీ కరెన్సీ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ లింబారెడ్డి కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా కట్నాపల్లికి చెందిన అన్నదమ్ములు పి.మునీందర్, పి.అనీల్‌ను నకిలీ నోట్లు తయారు చేసి చెలామణి చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ప్రింటర్,స్కానర్ తదితరాలను కొనుగోలు చేసిన మునీందర్ నకిలీ రూ.100 నోట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. వీటిని తన స్నేహితుల ద్వారా మార్పిడి చేయిస్తున్నాడు. వీరి స్నేహితుడైన రామాంతపూర్ వాసి బి.శ్రీనివాసరావు కూడా కలవడంతో ‘వ్యాపారం’ జోరందుకుంది. గతంలో గుల్బర్గాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి నకిలీ కరెన్సీ కావాలంటూ శ్రీనివాసరావును కోరడంతో మునీందర్ ద్వారా రూ.3 లక్షల విలువైనవి ముద్రింప చేయించి, వీటికి అర్జున్‌కు అప్పగించి రూ.లక్ష తీసుకురావడానికి వెళ్లాడు. నకిలీ కరెన్సీ తీసుకున్న అర్జున్ పోలీసుల పేరు చెప్పి బెదిరించి అసలు నోట్లు ఇవ్వకుండా పంపేశాడు. వారంక్రితం మరోసారి అనిల్‌ను సంప్రదించిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లో నకిలీనోట్లు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారని, తీసుకురావాలని కోరాడు. దీంతో అనిల్, మునీందర్‌లు రూ.2 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు ప్రింటర్, స్కానర్లను తీసుకొని నగరానికి చేరుకున్నారు. మార్పిడికి యత్నిస్తుండగా సమాచారమందుకున్న ఇన్స్పెక్టర్ కె.శ్రీకాంత్ నేతృత్వంలో పోలీసులు వలపన్ని మంగళవారం అరెస్టు చేశారు.