breaking news
Sunil James
-
ఇంటికి చేరిన నావికుడు
ముంబై: టోగో నిర్బం ధంలో ఉన్న భారతీయ నావికుడు సునీల్ జేమ్స్ శుక్రవారం కుటుంబాన్ని చేరుకున్నాడు. ఐదు నెలలుగా ఇంటికి దూ రంగా ఉన్న జేమ్స్‌ను ఇంటికి చేరగానే విషాదమే పలకరించింది. ఈ నెల రెండో తేదీన ఆయన 11 నెలల కుమారుడు మరణించాడు. ఈ పరిస్థితిలో అతని విడుదల కోసం ప్రభుత్వం మీద వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చారు. జేమ్స్ భార్య అదితి... ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా కలసి తన భర్తను విడుదల చేయించాల్సిందిగా ప్రార్థించింది. చివరికి జేమ్స్‌ను టోగో ప్రభుత్వం విడుదల చేసింది. ‘నిర్బంధంలో ఉన్నప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తండ్రిగా నా విధిని నిర్వహించాల్సిన పరిస్థితి. దయచేసి అర్థం చేసుకొని వదలిపెట్టండి’ అని ఎయిర్‌పోర్టులో అతన్ని కలిసిన మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని కార్యాలయం, టోగో అధ్యక్షుల జోక్యంతోనే తనకు స్వేచ్ఛ లభించిందన్నాడు. కెప్టెన్ జేమ్స్ నాయకత్వం వహించిన మార్షల్ దీవులకు చెందిన ఎంటీ ఓషన్ షిప్‌ను దోచుకోవడానికి పైరేట్లకు సహకరించాడనే ఆరోపణతో జూలై 16న టోగో అధికారులు అరెస్టు చేశారు.డిసెంబర్ 2న గాంగ్రీన్‌తో మరణించిన జేమ్స్ కుమారుడి అంత్యక్రియలను నిర్వహించకుండా అతని రాక కోసం కుటుంబం ఎదురుచూసింది. జేమ్స్ ఇంటికి చేరినందున వివాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారని సన్నిహితులు తెలిపారు. -
టోగో జైలు నుంచి విడుదలైన సునీల్
పశ్చిమ ఆఫ్రికాలోని టోగో జైలు నుంచి భారతీయ నౌక కెప్టెన్ సునీల్ జేమ్స్‌తో పాటు మరో భారతీయుడు నావికుడు విజయన్ విడుదలయ్యారు. ఈ మేరకు టోగోలో భారత రాయబారి కె.జీవ సాగర్ సమాచారం అందించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. వారిద్దరు ఈ రోజు భారత్‌కు బయలుదేరతారని తెలిపారు. ఈ ఏడాది జులైలో వారిద్దరిని టోగో దేశాధికారులు అరెస్ట్ చేశారు. అయితే డిసెంబర్ 2వ తేదీని సునీల్ జేమ్స్ 11 మాసాల వయస్సు గల కుమారుడు వివన్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో టోగో జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాని సునీల్ భార్య అదితితోపాటు విజయన్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అంశంపై ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చించాలని టోగోలోని భారత రాయబారి జీవ సాగర్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జీవ సాగర్ టోగో ఉన్నతాధికారగణంతో సంప్రదింపులు జరిపి భారతీయ నావికలు ఇద్దరు విడుదలకు మార్గం సుగమం చేశారు. సునీల్ విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.