breaking news
Sunday ET
-
రాజ్ చల్తా!
మాతృ సంస్థ శివసేననుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే 2006లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని స్థాపించారు. భూమిపుత్రులు, మరాఠీయుల హక్కుల కోసం ఉద్యమించారు. ఉత్తర భారతీయులపై విరుచుకపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై అనేక కేసులు నమోదైనా వెరవలేదు. బాల్‌ఠాక్రే మాదిరిగానే పదునైన పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న పది లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడంపై దృష్టి పెట్టారు. ముంబై: శివసేన పార్టీనివీడి రాజ్‌ఠాక్రే ఎనిమిదేళ్ల క్రితం స్థాపించిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తొలిసారిగా పోటీ చేసిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలు దక్కించుకొని ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించింది. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుమారు డజను లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, శివసేన పార్టీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసి పరోక్షంగా అధికార డీఎఫ్ కూటమికి సహకరించింది. మరాఠీ ఓట్లను చీల్చడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, శివసేనల తర్వాత ఐదో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2012 మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 28 స్థానాలు, పుణేలో 29 సీట్లు, కళ్యాణ్-డోంబివలిలో 27 స్థానాలను గెలిచింది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారాన్ని దక్కించుకుంది. దీంతో రాజ్‌ఠాక్రే బలాన్ని గుర్తించిన బీజేపీ ఆయనను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 2010 సంవత్సరంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు గుజరాత్లో రాజ్‌ఠాక్రే పర్యటించారు. మోడీ పాలన బహుబాగు అని కితాబిచ్చేశారు. 2012లో శివసేన పార్టీ అధినేత బాల్‌ఠాక్రే మరణించిన తర్వాత రాజ్‌ఠాక్రేతో బీజేపీకి మరింత సన్నిహిత్యం పెరిగింది. ఇటీవలే బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఓ హోటల్లో రాజ్‌ఠాక్రేతో సమావేశమై కమలం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే స్థానాల్లో పోటీ చేయకూడదని కోరారు. అందుకు అనుగుణంగానే రాజ్‌ఠాక్రే బీజేపీ స్థానాల్లో కాకుండా, శివసేన పార్టీ బరిలోకి దిగిన స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. ఇది 25 ఏళ్లుగా బీజేపీతో మైత్రి బంధం సాగిస్తున్న శివసేన పార్టీకి అగ్రహానికి గురి చేసింది. ఏకంగా పొత్తును వదిలేసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే హెచ్చరించే స్థాయికి చేరుకుంది. ఇలా బీజేపీ, శివసేనల మధ్య మైత్రిని కాస్త దెబ్బతీయడంలో రాజ్‌ఠాక్రే సఫలీకృతమయ్యారు. ఇప్పటికీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకే తమ మద్దతు ఉంటుందని రాజ్‌ఠాక్రే బాహాటంగానే ప్రకటిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే మోడీ ప్రధాని అయ్యేందుకు తగినంత బలం లేకపోతే, రాష్ట్రఅభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తికే తాము మద్దతును ప్రకటిస్తామని ఎమ్మెన్నెస్ ఉపాధ్యక్షుడు వాఘీశ్ సరస్వత్ అన్నారు. స్వల్పకాలికం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషించే దిశగా పార్టీని ముందుకు నడుపుతామని తెలిపారు. -
థామస్ కుక్-స్టెర్లింగ్ హాలిడేస్ విలీనం
ముంబై: పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ (ఇండియా), స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ ఇండియా విలీనం కాబోతున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 870 కోట్లు ఉంటుందని, ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి కాగలదని థామస్ కుక్ (టీసీఐఎల్) సంస్థ వెల్లడించింది. కొంత నగదుగాను, మరికొంత మేర షేర్ల రూపంలోనూ దశలవారీగా ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. తొలిదశలో స్టెర్లింగ్ మేనేజ్మెంట్ టీమ్ సహా ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి సుమారు 23 శాతాన్ని థామస్ కుక్ రూ. 176 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్హోల్డర్లలో స్టెర్లింగ్ చైర్మన్ సిద్ధార్థ మెహతా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఉన్నారు. అలాగే, ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ కోసం రూ.187 కోట్లు, ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ. 230 కోట్లు టీసీఐఎల్ వెచ్చిస్తుంది. మొత్తం మీద టీసీఐఎల్కి చెందిన ప్రతి 120 షేర్లకు.. స్టెర్లింగ్ సంస్థకి చెందిన 100 షేర్లు లభిస్తాయి. ఈ పరిణామాల దరిమిలా రెండు సంస్థల సగటు విలువ రూ.3,000 కోట్ల పైచిలుకు ఉంటుందని టీసీఐఎల్ ఎండీ మాధవన్ మీనన్ తెలిపారు. విలీనం తర్వాత స్టెర్లింగ్ సంస్థ కనుమరుగైనా బ్రాండ్ మాత్రం కొనసాగుతుందని వివరించారు. ఈ డీల్‌తో దేశవ్యాప్తంగా తమకున్న రిసార్ట్స్.. థామస్ కుక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని మీనన్ పేర్కొన్నారు. థామస్ కుక్ కొన్నాళ్ల క్రితమే బెంగళూరుకు చెందిన ఐక్య అనే సంస్థలో 74 శాతం వాటాలను రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది. థామస్ కుక్ మాతృ సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్స్. దీని చైర్మన్ అయిన ప్రేమ్ వత్స హైదరాబాదీ కావడం గమనార్హం. సుమారు నెలన్నర రోజులుగా ఈ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రేమ్ వత్స భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగానే స్టెర్లింగ్‌తో ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం. మరోవైపు, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ 1987లో ఏర్పాటైంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లోని రిసార్ట్స్‌లో 1,512 గదులు ఉన్నాయి.